RC16: రామ్‍చరణ్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నా: ఏఆర్ రహమాన్-ar rahman confirmed that he is the music director for ram charan tej rc16 movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rc16: రామ్‍చరణ్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నా: ఏఆర్ రహమాన్

RC16: రామ్‍చరణ్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నా: ఏఆర్ రహమాన్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 12, 2023 09:43 PM IST

RC16 - AR Rahman: రామ్‍చరణ్ - బుచ్చిబాబు సాన కాంబినేషన్‍లో రూపొందనున్న ఆర్‌సీ16 సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతం అందించడం దాదాపు ఖాయమైంది. ఈ విషయాన్ని రహమాన్ వెల్లడించాడు.

ఏఆర్ రహమాన్
ఏఆర్ రహమాన్ (ANI Photo)

RC16 - AR Rahman: మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. తదుపరి ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానతో మూవీ చేయనున్నాడు. ఇది రామ్‍చరణ్ 16వ చిత్రం కానుంటడంతో RC16 అనేది వర్కింగ్‍ టైటిల్‍గా ఉంది. గ్లోబల్ స్టార్ రేంజ్‍కు వెళ్లిన రామ్‍చరణ్.. యువ దర్శకుడైన బుచ్చిబాబుకు అవకాశం ఇవ్వటంతో మొదటి నుంచి ఈ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఆర్‌సీ16 మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తాడని కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. తాజాగా, ఈ విషయంపై రహమాన్ స్పందించాడు.

రామ్‍చరణ్ (RC16) సినిమాకు తాను సంగీతం అందిచనున్నట్టు ఏఆర్ రహమాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నాయకుడు సినిమా ప్రమోషన్‍లలో భాగంగా ఈ విషయాన్ని రహమాన్ వెల్లడించాడు. రామ్‍చరణ్ - బుచ్చిబాబు మూవీకి రహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడని అంటూ కొంతకాలంగా వాదనలు బయటికి వస్తున్నాయి. కాగా, ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా రహమాన్ కన్ఫర్మ్ చేశాడు. “నేను రామ్‍చరణ్ సినిమాకు పని చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ పట్ల ఉత్సాహంగా ఉన్నా. ఇది చాలా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్” అని రహమాన్ చెప్పాడు. అయితే, ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే అనౌన్స్‌మెంట్ రావొచ్చు.

ఆర్‌సీ16 మూవీలో తమిళ స్టార్ విజయ్‍ సేతుపతి కీలక పాత్ర పోషిస్తాడని లీకులు వస్తున్నాయి. హీరోయిన్‍గా జాన్వీ కపూర్ చేయనుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌ రేంజ్‍కు వెళ్లిన రామ్ చరణ్‍తో భారీగా మూవీ ప్లాన్ చేస్తున్నాడట బుచ్చిబాబు. దీంతో ఆర్‌సీ16 తారాగణం కూడా భారీగా ఉంటుందని తెలుస్తోంది. ఏఆర్ రహమాన్‍ను తీసుకుంటే ఈ చిత్రానికి గ్లోబల్‍గా క్రేజ్ వస్తుందని బుచ్చిబాబు ప్లాన్ చేశాడని సమాచారం.

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో ఆర్‌సీ 16 సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మించనున్నారు. సుకుమార్ రైటింగ్స్ కింద డైరెక్టర్ సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరించనుండగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పించనుంది.

మరోవైపు, శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్‍ను రామ్‍చరణ్ కొనసాగించనున్నాడు. హైదరాబాద్‍లో జరిగే షెడ్యూల్‍లో చరణ్ పాల్గొననున్నాడని తెలుస్తోంది. గేమ్ చేంజర్ చిత్రీకరణ పూర్తయ్యాక బుచ్చిబాబు మూవీ షూటింగ్‍లో రామ్‍చరణ్ పాల్గొననున్నాడు. పోస్టు ప్రొడక్షన్ పనుల తర్వాత వచ్చే ఏడాది గేమ్ చేంజర్ సినిమా విడుదల కానుంది.