Anjali Balakrishna: బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పిన అంజలి.. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని ట్వీట్-anjali thanks balakrishna for gracing the pre release event of gangs of godavari ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anjali Balakrishna: బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పిన అంజలి.. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని ట్వీట్

Anjali Balakrishna: బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పిన అంజలి.. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని ట్వీట్

Hari Prasad S HT Telugu
May 31, 2024 03:38 PM IST

Anjali Balakrishna: బాలకృష్ణకు నటి అంజలి థ్యాంక్స్ చెప్పింది. తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా బాలయ్య బాబుకు ఆమె థ్యాంక్స్ చెప్పిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తనను నెట్టేసిన ఘటన తర్వాత ఆమె ఈ పని చేయడం విశేషం.

బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పిన అంజలి.. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని ట్వీట్
బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పిన అంజలి.. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని ట్వీట్

Anjali Balakrishna: బాలకృష్ణ, అంజలి ఇష్యూ తెలుసు కదా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో స్టేజ్ పైనే అంజలిని బాలయ్య నెట్టేయడం, ఆ వీడియో కాస్తా వైరల్ గా మారి.. అందరూ అతన్ని టార్గెట్ చేశారు. మూవీ టీమ్ మాత్రం ఈ ఘటనను లైట్ తీసుకుంది. ఇక ఇప్పుడు ఇందులో బాధితురాలిగా భావిస్తున్న అంజలి కూడా బాలయ్యకు థ్యాంక్స్ చెప్పడం గమనార్హం. ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

బాలయ్యకు అంజలి థ్యాంక్స్

ఓవైపు సోషల్ మీడియాలో బాలకృష్ణకు వ్యతిరేకంగా పోస్టులు ఇంకా వస్తూనే ఉన్న వేళ అతనికి అంజలి మాత్రం థ్యాంక్స్ చెప్పింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చినందుకు ఆమె ఇలా కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు ఈ సందర్భంగా ఆ ఈవెంట్ హైలైట్స్ వీడియో షేర్ చేసింది. అందులో బాలకృష్ణను తనను నెట్టేసిన సీన్ కూడా ఉంది.

"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చినందుకు బాలకృష్ణ గారికి థ్యాంక్స్. బాలకృష్ణ గారు, నాకు మధ్య పరస్పర గౌరవం ఉంది. చాలా రోజులుగా మేము మంచి ఫ్రెండ్స్. అతనితో కలిసి మరోసారి స్టేజ్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది" అని అంజలి ట్వీట్ చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో అంజలి కూడా ముఖ్యమైన పాత్రలో నటించింది.

బాలయ్యను వెనకేసుకొచ్చిన మూవీ టీమ్

మరోవైపు అంజలిని నెట్టేసిన ఘటనలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్ బాలయ్యను వెనకేసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా హీరో విశ్వక్ మాత్రం బాలకృష్ణను వెనకేసుకొచ్చాడు. సరదాగా జరిగిన విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారని, మొత్తం వీడియో చూడాలని అతడు అనడం విశేషం.

"అతడు చాలా మంచి వ్యక్తి. సీరియస్ విషయాన్ని కూడా సరదాగా తీసుకుంటాడు. మనం కూడా దేనిని సీరియస్ గా తీసుకోవాలి, దేనిని తేలిగ్గా తీసుకోవాలో అర్థం చేసుకోవాలి. ఆ వీడియోలో కొంత భాగాన్ని వైరల్ చేశారు. మొత్తం వీడియో చూస్తే తెలుస్తుంది. చివర్లో వాళ్లిద్దరూ హైఫై కూడా కొట్టుకున్నారు" అని విశ్వక్ సేన్ అన్నాడు.

అంజలిని బాలయ్య నెట్టడాన్ని నిర్మాత నాగవంశీ కూడా తేలిగ్గా తీసుకున్నారు. "ముగ్గురు స్నేహితులు ఒకచోట మాట్లాడుకుంటున్నారనుకోండి. ఓ వ్యక్తిని జరగమని అడిగితే అతడు జరగకపోతే ఏం చేస్తారు? ఏదో అలా నెట్టారు అంతే. అక్కడ జరిగింది అంతే. దీనిని అనవసరంగా వివాదం చేస్తున్నారు" అని నాగవంశీ అన్నాడు. ఇక ఇదే ఈవెంట్లో మరో వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలుసు కదా.

అందులో బాలకృష్ణ కుర్చీ కింద మందు బాటిల్ ఉండటం చూడొచ్చు. ఈ వీడియోను కూడా నాగవంశీ తేలిగ్గా తీసుకున్నాడు. అదంతా గ్రాఫిక్స్ అని అతడు చెప్పడం గమనార్హం. ఇప్పుడన్నంటిలోనూ గ్రాఫిక్స్ జోడిస్తున్నారని నాగవంశీ చెప్పాడు. మధ్యలో జోక్యం చేసుకున్న విశ్వక్ మాట్లాడుతూ.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి పని చేసిన వ్యక్తే ఈ పని చేశాడని, అతన్ని పట్టుకున్నామని అనడం విశేషం.

టీ20 వరల్డ్ కప్ 2024