Adipurush Teaser Brutally Trolled: ఆదిపురుష్‌ టీజర్‌ ఎన్ని హాలీవుడ్‌ సినిమాలను కాపీ కొట్టిందో చూడండి!-adipurush teaser copied from so may hollywood movies say angry fans ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush Teaser Brutally Trolled: ఆదిపురుష్‌ టీజర్‌ ఎన్ని హాలీవుడ్‌ సినిమాలను కాపీ కొట్టిందో చూడండి!

Adipurush Teaser Brutally Trolled: ఆదిపురుష్‌ టీజర్‌ ఎన్ని హాలీవుడ్‌ సినిమాలను కాపీ కొట్టిందో చూడండి!

HT Telugu Desk HT Telugu
Oct 04, 2022 01:04 PM IST

Adipurush Teaser: ఆదిపురుష్‌ టీజర్‌ ఎన్ని హాలీవుడ్‌ సినిమాలను కాపీ కొట్టిందో చూడండి అంటూ ఈ భారీ బడ్జెట్‌ మూవీని ట్రోల్‌ చేస్తున్నారు అభిమానులు. ఒక్కో సీన్‌ ఒక్కో సినిమా నుంచి అంటూ ఫొటోలను కూడా షేర్‌ చేస్తున్నారు.

<p>ఆదిపురుష్ మూవీలో ప్రభాస్</p>
ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ (PTI)

Adipurush Teaser: భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా మూవీ ఆదిపురుష్‌ తన టీజర్‌తో అంచనాలు పెంచడం కాదు కదా.. తుస్సుమనిపించిందన్న విమర్శలు వస్తూనే ఉన్నాయి. అక్టోబర్‌ 2న ఈ టీజర్‌ రిలీజైనప్పటి నుంచీ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్న ఫ్యాన్స్‌.. తాజాగా ట్విటర్‌లో ఈ మూవీ ఎన్ని హాలీవుడ్‌ సినిమాలను కాపీ కొట్టిందో వివరిస్తూ ఫొటోలు కూడా పోస్ట్‌ చేస్తున్నారు.

ఇప్పటికే టీజర్‌లోని వీఎఫ్‌ఎక్స్‌ మరీ నాసిరకంగా ఉన్నాయంటూ ట్రోల్స్‌ నడుస్తుండగా.. ఆ మాత్రం టీజర్‌లోనే చాలా హాలీవుడ్‌ సినిమాలను ఓంరౌత్‌ కాపీ కొట్టాడంటూ అభిమానులు విమర్శిస్తున్నారు. టీజర్‌లోని ఒక్కో సీన్‌ను తీసుకొని అది ఏ హాలీవుడ్‌ సినిమాకు కాపీయో కనిపెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే అలాంటి ఫొటోలు కొన్ని ట్విటర్‌లో షేర్‌ చేస్తున్నారు.

"డైరెక్టర్‌ ఓంరౌత్‌పైన గౌరవం ఇంకా పెరిగింది. ఈయన ఒకే సినిమాతో ఎన్నో హాలీవుడ్‌ సినిమాలను మన ముందుకు తీసుకొస్తున్నారు" అని ఓ అభిమాని ట్వీట్‌ చేశాడు. థోర్‌, అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌, లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌, కాంగ్‌ స్కల్‌ ఐలాండ్‌, ఆక్వామాన్‌, హౌజ్‌ ఆఫ్‌ ద డ్రాగన్, రైజ్‌ ఆఫ్‌ ద ప్లానెట్‌ ఆఫ్‌ ద ఏప్స్‌ సినిమాల నుంచి కాపీ కొట్టారంటూ ఆ ట్విటర్‌ యూజర్‌ ఫొటోలను పోస్ట్‌ చేశాడు.

మరికొందరు యూజర్లు కూడా ఆదిపురుష్‌ టీజర్‌లోని సీన్ల స్క్రీన్‌షాట్లు తీసుకొని.. వాటి హాలీవుడ్‌ ఒరిజినల్‌ వెర్షన్ల సినిమా పేర్లను యాడ్‌ చేస్తూ పోస్ట్‌లు చేశారు. రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఎన్నో ఆశలతో ఈ సినిమా తీస్తున్న మేకర్స్‌కు ఈ ట్రోల్స్‌ మింగుడు పడటం లేదు. ఫస్ట్‌ లుక్‌, టీజర్‌పైనే ఇన్ని విమర్శలు, ట్రోల్స్‌ రావడం డైరెక్టర్‌ ఓంరౌత్‌పై ఒత్తిడి మరింత పెంచుతోంది.

రాముడిగా కనిపించిన ప్రభాస్‌ లుక్‌పైనా, రావణుడిగా కనిపిస్తున్న సైఫ్‌ అలీ ఖాన్‌ లుక్‌పైనా విమర్శలు వస్తున్నాయి. ప్రభాస్‌ లుక్‌ను చాలా మంది ఆర్‌ఆర్‌ఆర్‌లోని రామ్‌చరణ్‌ లుక్‌తోనూ పోలుస్తూ విమర్శలు చేశారు. అటు రామాయణంలో రావణుడు విలనే కావచ్చు కానీ.. ఈ టీజర్‌లో చూపించినట్లు మరీ అంత పెద్ద గడ్డం ఎప్పుడూ పెంచలేదని మరికొందరు విమర్శించారు.

Whats_app_banner