Abhishek Aishwarya Marriage: అభిషేక్, ఐశ్వర్యా రాయ్ పెళ్లిలో చేయి కోసుకున్న జాన్వీ కపూర్.. అతడు నా వాడంటూ రచ్చ!-abhishek bachchan aishwarya rai wedding model janhvi kapoor cut her wrist saying abhishek already married to her ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Abhishek Aishwarya Marriage: అభిషేక్, ఐశ్వర్యా రాయ్ పెళ్లిలో చేయి కోసుకున్న జాన్వీ కపూర్.. అతడు నా వాడంటూ రచ్చ!

Abhishek Aishwarya Marriage: అభిషేక్, ఐశ్వర్యా రాయ్ పెళ్లిలో చేయి కోసుకున్న జాన్వీ కపూర్.. అతడు నా వాడంటూ రచ్చ!

Hari Prasad S HT Telugu
Aug 22, 2024 02:52 PM IST

Abhishek Aishwarya Marriage: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న ఈ సమయంలో వాళ్లకు పెళ్లి సమయంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఆ సమయంలో జాన్వీ కపూర్ తన చేయి కోసుకొని రచ్చ చేసిన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.

అభిషేక్, ఐశ్వర్యా రాయ్ పెళ్లిలో చేయి కోసుకున్న జాన్వీ కపూర్.. అతడు నా వాడంటూ రచ్చ!
అభిషేక్, ఐశ్వర్యా రాయ్ పెళ్లిలో చేయి కోసుకున్న జాన్వీ కపూర్.. అతడు నా వాడంటూ రచ్చ!

Abhishek Aishwarya Marriage: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పెళ్లి చేసుకోవడం ఏంటి? అందులో జాన్వీ కపూర్ తన చేయి కోసుకొని రచ్చ చేయడం ఏంటన్న డౌట్ మీకు కలుగుతోందా? మీరు చదివింది నిజమే. ఆ సమయంలో ఇది నిజంగానే జరిగింది. కానీ అప్పుడు రచ్చ చేసి జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురు జాన్వీ కాదు.. ఆమె ఓ మోడల్. అసలు ఏం జరిగిందంటే?

ఐశ్వర్య పెళ్లిలో జాన్వీ హల్‌చల్

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పెళ్లి చేసుకొని 17 ఏళ్లు అవుతోంది. అయితే ఇప్పుడు వాళ్ల మధ్య విభేదాలు వచ్చాయని, విడాకులు కూడా తీసుకోబోతున్నారన్న వార్తలు.. అలాంటిదేమీ లేదన్న అభిషేక్ ఇచ్చిన వివరణ నేపథ్యంలో వాళ్ల పెళ్లి సమయంలో జరిగిన ఓ రచ్చ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. 2007లో వీళ్ల పెళ్లి జరుగుతున్నప్పుడే వాళ్ల ఇంటి బయట జాన్వీ కపూర్ అనే ఓ మోడల్ రచ్చ రచ్చ చేసింది.

అభిషేక్ ఇల్లు ప్రతీక్షలో పెళ్లి జరుగుతున్న సమయంలోనే బయట ఓ అమ్మాయి తన చేయి కోసుకోవడం, అభిషేక్ అప్పటికే తనను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించడం సంచలనం రేపింది. ఆమె పేరు జాన్వీ కపూర్ కావడం ఇక్కడ మరో విశేషం. అయితే ఆమె శ్రీదేవి కూతురు జాన్వీ కాదు. ఆమె ఒక మోడల్ అని తర్వాత తేలింది. ఆమె అభిషేక్ పై జుహు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టడానికి ప్రయత్నించినా.. ఆధారాలేవీ లేవంటూ పోలీసులు కేసు నమోదు చేయలేదు.

పబ్లిసిటీ స్టంట్ అంటూ..

అయితే అప్పటికే అభిషేక్ బచ్చన్ తో కలిసి దస్ మూవీలో నటించిన జాన్వీ కపూర్.. కేవలం పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్ ఇదని చాలా మంది కొట్టి పారేశారు. మొదట్లో ఆమె శాంతియుతంగా అభిషేక్ ఇంటిముందు ధర్నాకు దిగినా.. ఆమె తనపై చేసిన ఆరోపణలను అభిషేక్ ఖండించాడు. దీంతో జాన్వీ తన మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో పరిస్థితులు అదుపు తప్పాయి.

జాన్వీని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆమె కోలుకున్న తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించిందన్న కారణంతో ఐపీసీ సెక్షన్ 309 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రూ.10 వేల పూచీకత్తుపై రిలీజ్ చేశారు. వాళ్ల పెళ్లి తర్వాత జాన్వీ మళ్లీ ఎప్పుడూ అభిషేక్ ఇంటి ముందు కనిపించకపోగా.. ఆ తర్వాత కూడా అతనిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు.

ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. ఇప్పుడు అభిషేక్, ఐశ్వర్య మధ్య విభేదాలు, విడాకుల వార్తలతో మరోసారి సోషల్ మీడియాలో కొందరు అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు.