Janhvi Kapoor in Tirupati: శ్రీదేవి జయంతి రోజు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తిరుపతి వచ్చిన జాన్వీ.. వీడియో వైరల్-janhvi kapoor in tirupathi janhvi boyfriend shikhar paharia sridevi birth anniversary ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor In Tirupati: శ్రీదేవి జయంతి రోజు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తిరుపతి వచ్చిన జాన్వీ.. వీడియో వైరల్

Janhvi Kapoor in Tirupati: శ్రీదేవి జయంతి రోజు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తిరుపతి వచ్చిన జాన్వీ.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu
Aug 13, 2024 02:42 PM IST

Janhvi Kapoor in Tirupati: శ్రీదేవి జయంతి రోజున బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన బాయ్‌ఫ్రెండ్ తో కలిసి తిరుపతి వచ్చింది. మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్న ఆమె.. మంగళవారం (ఆగస్ట్ 13) శ్రీవారి దర్శనం చేసుకుంది.

శ్రీదేవి జయంతి రోజు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తిరుపతి వచ్చిన జాన్వీ.. వీడియో వైరల్
శ్రీదేవి జయంతి రోజు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తిరుపతి వచ్చిన జాన్వీ.. వీడియో వైరల్

Janhvi Kapoor in Tirupati: ప్రతి ఏటా తన తల్లి శ్రీదేవి జయంతి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఆనవాయితీని ఆమె కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈసారీ కొనసాగించింది. ఏడాదికి కనీసం రెండు, మూడుసార్లు తిరుపతికి వచ్చే జాన్వీ.. శ్రీదేవి పుట్టిన రోజునాడు మాత్రం కచ్చితంగా వస్తుంది. మంగళవారం (ఆగస్ట్ 13) ఆమె 61వ జయంతి సందర్భంగా జాన్వీ శ్రీవారి సేవలో తరించింది.

తిరుమల తిరుపతిలో జాన్వీ

జాన్వీ కపూర్ తిరుపతి ఎప్పుడు వచ్చినా మెట్ల మార్గంలోనే తిరుమల కొండపైకి వెళ్తుంది. ఈసారి కూడా ఆమె మెట్లు ఎక్కింది. ఈ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. "హ్యాపీ బర్త్ డే మమ్మా.. ఐ లవ్యూ" అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను ఆమె పంచుకుంది. మొదట తిరుమల మెట్ల మార్గం ఫొటోను జాన్వీ పోస్ట్ చేసింది. ఆ తర్వాత శ్రీదేవితో తన చిన్ననాటి ఫొటో, చివరికి చీరలో సాంప్రదాయబద్ధంగా శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు తీసిన ఫొటోలను షేర్ చేసింది.

పసుపు రంగు పట్టు చీరలో ఆమె తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి తిరుమల ఆలయంలోకి వెళ్లింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ ఇద్దరూ సాష్టాంగ నమస్కారం చేసి వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. శిఖర్ కేవలం పట్టు పంచె, కండువాతో కనిపించాడు.

తల్లి శ్రీదేవి కోసమే..

నిజానికి గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను ప్రతి ఏటా రెండు, మూడుసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కారణమేంటో జాన్వీ వివరించింది. ఆమె జీవించి ఉన్న సమయంలో తాను పెద్దగా దేవుడిని నమ్మేదాన్ని కాదని, కానీ శ్రీదేవి చనిపోయిన తర్వాత మాత్రం ఆమె పాటించే కొన్ని విషయాలను తాను కూడా అనుసరించినట్లు తెలిపింది. శుక్రవారం జట్టు కత్తిరించుకోవద్దని చెప్పేదని, ఇప్పటికీ తాను దానిని ఫాలో అవుతున్నట్లు చెప్పింది.

ఇక తన పుట్టిన రోజు నాడు, శ్రీదేవి పుట్టిన రోజు నాడు తాను కచ్చితంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు జాన్వీ అప్పట్లో వెల్లడించింది. ఈ ఏడాది కూడా చెప్పినట్లే శ్రీదేవి జయంతి రోజు ఆమె తిరుమల వచ్చింది. అటు ఆమె తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ కపూర్ కూడా శ్రీదేవికి నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

1963లో జన్మించిన శ్రీదేవి నాలుగేళ్ల వయసులోనే బాల నటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తర్వాత 13 ఏళ్లకే హీరోయిన్ అయింది. సుమారు ఐదు దశాబ్దాల పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించింది. 2017లో వచ్చిన మామ్ మూవీ ఆమె కెరీర్లో చివరిది. తర్వాత 2018లో దుబాయ్ లో ఓ హోటల్ రూమ్ బాత్ టబ్ లో పడి శ్రీదేవి కన్నుమూసిన విషయం తెలిసిందే.

ఇక జాన్వీ విషయానికి వస్తే తన తల్లిబాటలో నడుస్తూ ప్రస్తుతం ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ అడుగు పెడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి జాన్వీ నటించిన దేవర మూవీ వచ్చే నెల 27న రిలీజ్ కానుంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో కలిసి ఆర్సీ16లోనూ జాన్వీ నటిస్తోంది.