Malayalam Dubbing Movies: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతోన్న మలయాళం డబ్బింగ్ సినిమాలు
Malayalam Dubbing Movies: మలయాళం డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్నాయి. గత ఏడాది రిలీజైన 2018 మూవీతో పాటు ఇటీవల రిలీజైన ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్ నిర్మాతలకు ఐదారింతల లాభాలను తెచ్చిపెట్టాయి.
Malayalam Dubbing Movies: భాషాభేదాలతో సంబంధం లేకుండా మంచి సినిమా ఏ భాషలో వచ్చిన ఆదరించే గొప్ప మనసు తెలుగు ప్రేక్షకులది. గతంలో ఎన్నో సందర్భాల్లో ఇది రుజువు అయ్యింది. ఇప్పటికీ అవుతూనే ఉంది. కథ బాగుంటే స్ట్రెయిట్, డబ్బింగ్ అన్నది చూడకుండా... చిన్న హీరో...పెద్ద హీరో అనే పట్టింపులు లేకుండా ఆ సినిమాను హిట్ చేస్తుంటారు.
తమిళ్ డబ్బింగ్ సినిమాల హవా...
ఇదివరకు టాలీవుడ్ బాక్సాఫీస్ తమిళ డబ్బింగ్ సినిమాల హవా కొనసాగేది. రజనీకాంత్, కమల్‌హాసన్, విక్రమ్, సూర్య తో పాటు ఇతర తమిళ హీరోల సినిమాలు భారీగా వసూళ్లను రాబట్టేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. కోలీవుడ్ మూవీస్‌ను మలయాళ సినిమాలు డామినేట్ చేస్తున్నాయి.
అగ్ర నిర్మాణ సంస్థలు...
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మలయాళ డబ్బింగ్ బొమ్మలు అదరగొడుతోన్నాయి. గత ఏడాది రిలీజైన 2018 నుంచి ఇటీవల విడుదలైన మంజుమ్మేల్ బాయ్స్ వరకు పలు మలయాళ డబ్బింగ్ సినిమాలు నిర్మాతలు భారీగా లాభాలను తెచ్చిపెట్టాయి. ఇదివరకు మలయాళ డబ్బింగ్ సినిమాలను చిన్న నిర్మాతలు తెలుగులో రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు గీతా ఆర్డ్స్, సితార, మైత్రీ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.
2018 మూవీ...
గత ఏడాది రిలీజైన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ 2018 తెలుగులో జీఏ2 పతాకంపై బన్నీవాస్ రిలీజ్ చేశాడు. కేవలం కోటిన్నర బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ 11 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. నిర్మాతకు పదింతల లాభాలను తెచ్చిపెట్టింది. తెలుగులో డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ప్రేమలు స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా...
ఇటీవల విడుదలైన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ప్రేమలు తెలుగు డబ్బింగ్ వెర్షన్ స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా వసూళ్లను దక్కించుకున్నది. ఈ సినిమాను అగ్ర దర్శకుడు రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ తెలుగులో రిలీజ్ చేశాడు. మలయాళంలో వంద కోట్లు వసూళ్లను రాబట్టడం, తెలుగులో ఈ సినిమా ప్రమోషన్స్‌లో రాజమౌళి పాల్గొనడంతో ప్రేమలుపై రిలీజ్‌కు ముందు నుంచే భారీగా బజ్ ఏర్పడింది. దాంతో తొలిరోజు నుంచే ఈ లవ్‌స్టోరీకి కలెక్షన్ల వర్షం కురిసింది. తెలుగు వెర్షన్ థియేటర్లలో పదహారు కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. నిర్మాత కార్తికేయకు ఐదు కోట్లకుపైనే ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయగా...
మలయాళంలో 200 కోట్ల వసూళ్లను సాధించిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో డబ్ చేసింది. ఈ సర్వైవల్ మూవీ తెలుగు వెర్షన్ పది కోట్ల వసూళ్లను దక్కించుకున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
భ్రమయుగం కూడా…
ఇటీవల రిలీజైన మమ్ముట్టి భ్రమయుగం తెలుగు వెర్షన్ మోస్తారు లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం. ఈ హారర్ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. పథ్వీరాజ్ ది గోట్‌లైఫ్ కూడా మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న హిట్టు టాక్ తెచ్చుకోలేకపోయింది.
ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఆవేశం మూవీ మలయాళంలో ఐదు రోజుల్లోనే యాభై కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీని తెలుగులోకి డబ్ చేసే ప్రయత్నాల్లో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ఉన్నట్లు సమాచారం. వీటితో గత ఏడాది కాలంలో రిలీజైన మరికొన్ని మలయాళ సినిమాలు నిర్మాతలకు ప్రాఫిట్స్ తెచ్చిపెట్టాయి.