Lok Sabha Elections 2024 : ఆదిలాబాద్ లో మారుతున్న లెక్కలు..! త్రిముఖ పోరులో గెలుపెవరిది..?
Adilabad Lok Sabha Constituency : ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. 3 ప్రధాన పార్టీలు కూడా ఆదివాసీ తెగకు చెందిన అభ్యర్థులకే టికెట్లు ఇవ్వటంతో…. ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారనేది ఉత్కంఠగా మారింది.
Adilabad Lok Sabha Elections 2024 : విభిన్న తెగల జాతులు గల అదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన రోజు నుంచి నేటి వరకు రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయని ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇందులో అన్ని ప్రాంతాల్లో గిరిజన జాతుల ఓటర్లు ఉన్నారు. 7 అసెంబ్లీ నియోజవర్గాల్లో జరిగిన ఎన్నికలలో కేవలం ఒకే ఒక సీటు కాంగ్రెస్ దక్కింది. 4 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా, 2 చోట్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
త్రిముఖ పోరు ఎవరికీ కలిసి వస్తుందో...
అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో(Adilabad Lok Sabha) మూడు ప్రధాన పార్టీలు సైతం ఆదివాసులకి టికెట్లు కేటాయించారు. పార్లమెంటు నియోజకవర్గం లో సుమారు 16.14 లక్షల ఓటర్లు ఉన్నారు.
2019 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను చూస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 3,77,374 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి గొడెం నగేష్ కు 318,814 ఓట్లు వచ్చాయి, అదే విధంగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రాథోడ్ రమేష్ కి 314,238 ఓట్లు పోలయ్యాయి, ప్రస్తుతం గోడెం నగేష్, రాథోర్ రమేష్ లు ఓకే గొడుగు రావడంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీజేపీ చూస్తోంది.
ఇక కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గతంలో ఆదివాసి పోరాట సంఘం రాష్ట్ర నాయకత్వానికి బాధ్యత వహించింది. దీంతో లంబాడాలు సుగుణను ఆదరిస్తారా లేదా అన్నది అనుమానంగా మారింది. అయితే అధికార పార్టీకి చెందిన మంత్రి సీతక్క , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. అదిలాబాద్ పార్లమెంటు సీటుపై బలమైన ఆశలు పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఒక గోండు జాతికి చెందిన మహిళగా మొదటిసారి రంగంలోకి దిగుతున్న సుగుణను మంత్రి సీతక్క వెంట వేసుకొని మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ ఫలాలు గిరిజన జాతులకు అందిస్తోందని, అందుకే స్థానికంగా వెడమ బొజ్జు ను ఎమ్మెల్యేగా గెలిపించారని మంత్రి సీతక్క తెలుపుచున్నారు.
టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే మాత్రం సక్కు పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు, ఆత్రం సక్కు బలాబలాలను పరిశీలిస్తే గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలిసి పని చేశారు, నియోజవర్గంలో మంచి పేరున్న నాయకుడిగా రాణించారు. సొంత నియోజకవర్గంలో ఓటు బ్యాంకు పదిలంగా ఉన్నప్పటికీ మిగతా నియోజకవర్గాల్లో అంతంత మాత్రంగానే ఉంది,
మైనార్టీలు మైదాన ప్రాంతం ఓట్లే కీలకం
పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికలలో అదిలాబాద్ లో మైనార్టీలు, మైదాన ప్రాంత ఓట్లు కీలకం కానున్నాయి, ప్రస్తుతం పోటీ చేసిన అభ్యర్థులు గిరిజన తెగల వారు కావడంతో వారి వారి తెగలలో ఓట్లు చీలి పొనున్నాయి, ఎవరి అభిమానం ప్రకారం వారికి ఓటు వేసినప్పటికీ ముస్లిం మైనారిటీ ఓట్లు గెలుపు ఓటమి నిర్ణయిస్తాయని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.
మొత్తం ఏడు సెగ్మెంట్లలో అదిలాబాద్ మంచిర్యాల్ నిర్మల్ ఖానాపూర్ లక్సెట్టిపేట మున్సిపాలిటీలలో జనరల్ ఓట్లు అధికంగా ఉన్నాయి, వీరు ఏ పార్టీకి ముగ్గు చూపితే ఆ పార్టీ గెలుపు ఖాయమని తెలుస్తుంది.
కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(IK Reddy) కాంగ్రెస్ లో చేరారు, టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర కాంగ్రెస్ వివరాలు ఇన్చార్జి దీపా దాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎన్నో రోజులుగా కాంగ్రెస్లో చేరుతారు అనే ప్రచారానికి తెర పడింది.
ఉమ్మడి ఆదిలాబాద్ లోని కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి రాకను వ్యతిరేకించినప్పటికీ లైన్ క్లియర్ చేశారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు ఆధ్వర్యంలో కార్యకర్తలు అనేక ఆందోళన చేశారు, అయినప్పటికీ…. ఇంద్రకరణ్ రెడ్డి మొదట తన అనుచర వర్గాన్ని కాంగ్రెస్ పార్టీలోకి పంపించి తదనంతరం తను పార్టీలో చేరారు.
నిర్మల్ నియోజకవర్గం లో గత కొన్ని ఏళ్లుగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు నిర్మల్ జిల్లా లో చర్చనీయాంశంగా మారాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్లుగా ఉండే స్థానిక రాజకీయం మంత్రి చేరికతో కాంగ్రెస్ వర్సెస్ బిజెపిగా మారిపోయింది.
రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి
సంబంధిత కథనం