Khammam Jalagam: నాడు టిఆర్ఎస్ ఏకైక ఎమ్మెల్యే.. నేడు రెబల్ అభ్యర్థిగా బరిలోకి..
Khammam Jalagam: గులాబీ జెండా పట్టుకునే నాధుడే లేని రోజుల్లో ఆయన ఖమ్మంలో ఆ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే.. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన టిఆర్ఎస్ కు రెబల్ అభ్యర్థి.. ఇంతకీ ఎవరా అభ్యర్థి..? ఏమా కథ.?
Khammam Jalagam: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు వెంకట్రావు కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు.
గతంలో తన తండ్రి పని చేసిన కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఆ తర్వాత ఆ పార్టీలో తనకు సముచిత స్థానం లభించకపోవడంతో 2014 ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థిగా జలగం పోటీలో నిలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు పై విజయం సాధించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ గెలిచిన ఏకైక సీటు కొత్తగూడెం మాత్రమే. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావుపై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు జలగం భవిష్యత్తును మసకబారేలా చేశాయి.
కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన వనమా ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో జలగం ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు బిఆర్ఎస్ తరఫున టికెట్ లభిస్తుందని ఆశించి భంగపడ్డారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వరరావుకే టిఆర్ఎస్ తరఫున టికెట్ లభించడంతో జలగం వెంకట్రావు భంగపాటుకు గురయ్యారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో పోటీలో నిలవాలని భావించిన ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఆశించారు.
ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ సిపిఐ పార్టీతో కాంగ్రెస్ పొత్తు నేపథ్యంలో కొత్తగూడెం స్థానాన్ని సిపిఐ పార్టీకి కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంగ్రెస్లోనూ ఆయనకు చుక్కెదురయింది.
బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలో..
ఈ పరిణామాల నేపథ్యంలో జలగం వెంకట్రావు తన భవిష్యత్తును రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి పరీక్షించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. టిఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి సిట్టింగ్ అభ్యర్థి వనమాకు గట్టి పోటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది.
టిఆర్ఎస్ కు అలాగే కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి కునంనేని సాంబశివ రావుకు మధ్య మాత్రమే గట్టి పోటీ ఉంటుందని భావించిన క్రమంలో జలగం వెంకట్రావు రెబల్ అభ్యర్థిగా బరిలో నిలుస్తుండడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
వెంకట్రావు గతంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక అభ్యర్థిగా అక్కడ తనకంటూ ప్రత్యేకమైన కేడర్ ను బలపరుచుకున్నారు. తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కావడంతో ఆ రకమైన ప్రాధాన్యత కూడా తనకు లభించనుంది.
రెండు పార్టీల్లోనూ టికెట్ ఆశించి భంగపడిన నేపథ్యంలో ప్రజల నుంచి సానుభూతి లభించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం స్థానంలో త్రిముఖ పోటీ అనివార్యమైంది. ఈ పరిస్థితితో అక్కడ గెలుపోటములు పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.)