Lok Sabha Elections Campaign : బస్సు యాత్రలు, బహిరంగ సభలు, రోడ్ షోలు- రాష్ట్రంలో జోరందుకున్న ఎన్నికల ప్రచారాలు
Lok Sabha Elections Campaign : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు ప్రచారాలు ముమ్మరం చేశారు. వరుసగా రోడ్ షోలు, బస్సు యాత్రలు, కార్నర్ మీటింగ్, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
Lok Sabha Elections Campaign : వచ్చే నెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో.....ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అన్ని పార్టీలు ప్రచారంలో ఆరాటం, ఆర్భాటం , పోరాటం ప్రదర్శిస్తున్నాయి. ప్రచారానికి తమ స్టార్ క్యాంపెయినర్ల(Star Campaigners)ను బరిలోకి దింపుతున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ.....ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న నేతలను ప్రచారాలకు దింపుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయనతో పాటు బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సైతం జిల్లాలో పర్యటిస్తూ.... పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్పంచుకుంటున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన పూర్తి చేయగా..... పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అంతకుముందు వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ముఖ్య నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం అయ్యారు.
నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర
ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR Bus Yatra) పర్యటిస్తున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాలో జరగబోయే బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ లలో ఆయన పాల్గొననున్నారు. కేసీఆర్ రోడ్ షోకి సంబంధించిన రూట్ మ్యాప్ ఇప్పటికే ఖరారు కాగా...... హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వినయ్ భాస్కర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షించారు. హనుమకొండలోని కెప్టెన్ లక్ష్మీ కాంతరావు నివాసంలో కేసీఆర్ ఈరోజు రాత్రి బస చేయనున్నారు. సోమవారం ఉదయం వరంగల్ నుంచి బయలుదేరి మే 1వ తేదీన మానుకోట జిల్లా కేంద్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు రోడ్ షో లో పాల్గొన్న అనంతరం మానుకోటలో కేసీఆర్ బస చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్నారు.
నేడు మల్కాజిగిరి, ఎల్బీ నగర్ లో సీఎం రేవంత్ రోడ్ షో
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మల్కాజిగిరి (Malkajgiri)పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎల్బీనగర్ రోడ్ షో(Road Show)లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ తరువాత సాయంత్రం 6 గంటలకు కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటలకు మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి రోడ్ షో కొనసాగనుంది. రాత్రి 7:30 గంటలకు కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
ఈనెల 30న భూపాలపల్లికి సీఎం రేవంత్
ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల ప్రచారం(Lok Sabha Election Campaign)లో భాగంగా ముచ్చటగా మూడోసారి సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవలే హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ జన జాతర(Congress Jana Jatara) సభలో పాల్గొని పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు, శ్రేణులకు సందేశం ఇస్తూనే కాంగ్రెస్ పార్టీ విధానాలను, ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజలకు ముఖ్యమంత్రి వివరించారు. ఈ నెల 30న భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో నిర్వహించే కాంగ్రెస్ జన జాతర సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే వరంగల్ పార్లమెంటరీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ రెండో బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు ఒకే లోక్ సభ నియోజకవర్గ పరిధిలో రెండు బహిరంగ సభలు జరగలేదు. అయితే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. అందులో భాగంగానే ఈనెల 30వ తేదీన రేగొండ మండల కేంద్రంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వస్తున్నారు.ఈ నేపథ్యంలో శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మే 3న రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక
మరోవైపు వరంగల్ (Warangal)లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ (Aroori Ramesh)ను గెలిపించాలని కోరుతూ..... మే 3న హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ శివారులో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi Telangana Tour)హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు కాగా...... అందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. నరేంద్ర మోదీతో పాటు జాతీయస్థాయి నేతలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొంటారని సమాచారం. వరంగల్ సెగ్మెంట్ పై బీజేపీ(BJP) ఆశలు పెట్టుకుంది. ఆరూరి రమేష్ నామినేషన్ కు ఉత్తర్ ప్రదేశ్ సీఎం పుష్కర్ సింగ్ హాజరయ్యారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 29తో ముగియనుంది. దీంతో ఫైనల్ గా ఎంత మంది అభ్యర్థులు బరిలో నిలుస్తారు? ఒక్కో సెగ్మెంట్ కు ఎంత మంది ఫైనల్ గా పోటీ పడుతున్నారు అనేది రేపటితో క్లారిటీ రానుంది. మొత్తానికి మే 1 నుంచి సరిగ్గా 11 రోజుల పాటు ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగనుంది.
కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం