Lok Sabha elections 2024: ‘‘సెక్స్ స్కాండల్ కాదు.. మాస్ రేప్; ఆ మాస్ రేపిస్ట్ కు మోదీ సపోర్ట్’’- ప్రధానిపై రాహుల్ ఫైర్
Lok Sabha elections 2024: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కర్నాటక సెక్స్ స్కాండల్ నిందితుడు, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్నకు ప్రధాని మోదీ సపోర్ట్ చేస్తున్నాడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఆ మాస్ రేపిస్ట్ కు ఓటు వేయాలని, బహిరంగ సభ పెట్టి మరీ, ప్రధాని మోదీ కోరారని రాహుల్ మండిపడ్డారు.
కర్ణాటకలోని హసన్ ఎంపీ, మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ నిందితుడిగా ఉన్న కేసు కేవలం సెక్స్ స్కాండల్ మాత్రమే కాదని, అది సామూహిక అత్యాచారం కేసు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ జేడీ (ఎస్) తో పొత్తు పెట్టుకుని "మాస్ రేపిస్ట్ (mass rapist)" కోసం ఓట్లు అడుగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
మాస్ రేపిస్ట్ కు ప్రధాని మద్దతు
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఓ మాస్ రేపిస్టుకు మద్దతు పలుకుతున్నారని, మాస్ రేపిస్ట్ కు ఓట్లు వేయాలని అడుగుతున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణ వందలాది మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి అశ్లీల వీడియోలు తీశాడు. అలాంటి రేపిస్టుకు ప్రధాని మోదీ మద్దతు తెలుపుతున్నారు. అంతేకాదు, ఈ రేపిస్టుకు ఓటేస్తే నాకు మేలు జరుగుతుంది అని బహిరంగ వేదికపై నుంచి ప్రధాని మోదీ ఓటర్లను కోరుతున్నారు’’ అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) మండిపడ్డారు.
పారిపోవడానికి రేపిస్ట్ కు ప్రధాని సహకారం
వందలాది మంది మహిళలపై లైంగిక దాడి చేసిన ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) భారత్ నుంచి పారిపోవడానికి ప్రధాని సహకరించారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ‘ప్రజ్వల్ రేవణ్ణ భారత్ నుంచి జర్మనీ పారిపోయాడు. ఆయన పారిపోకుండా అడ్డుకునే అవకాశం ప్రధానికి (PM Modi) ఉంది. అయినా, ఆయన అడ్డుకోలేదు. కావాలనే, ఆ మాస్ రేపిస్ట్ జర్మనీకి వెళ్లేందుకు వీలు కల్పించారు. ఇదే మోదీ (Narendra Modi) గ్యారంటీ. అవినీతి నాయకుడైనా, మాస్ రేపిస్టు అయినా తమకు సహకరిస్తే చాలు బీజేపీ కాపాడుతుంది’’ అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎద్దేవా చేశారు.
రేవణ్ణ పై అత్యాచార ఆరోపణల కేసు
హసన్ సిట్టింగ్ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలను లైంగికంగా వేధించిన దృశ్యాలున్న వీడియోలు, సంబంధిత పెన్ డ్రైవ్ లు వేలాదిగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను ప్రజ్వల్ తన ఇల్లు, కార్యాలయంలో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. తొలుత ఈ టేపులు ఎన్నికల్లో తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని దేవెగౌడ కుటుంబం, బీజేపీ భావించినప్పటికీ ఆ తర్వాత పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని కుమారస్వామి ఆ టేపులకు దూరంగా ఉన్నారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) లైంగిక వేధింపుల కేసు దర్యాప్తునకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. కర్ణాటక పోలీసులు సిట్ ను ఏర్పాటు చేసిన రోజే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ కు బయలుదేరారు. ఆయన తన డిప్లొమాటిక్ పాస్పోర్టుపై విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. మంగళవారం రేవణ్ణను జేడీఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) పై భారత్ లోని అన్ని ఇమ్మిగ్రేషన్ పాయింట్ల వద్ద లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.