KCR: బెంగళూరుకు సీఎం కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ-telangana cm kcr bengaluru tour updates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr: బెంగళూరుకు సీఎం కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ

KCR: బెంగళూరుకు సీఎం కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ

HT Telugu Desk HT Telugu
May 26, 2022 01:02 PM IST

హైదరాబాద్ నుంచి బయల్దేరిన సీఎం కేసీఆర్ బెంగళూరుకు చేరుకున్నారు. మాజీ సీఎం కుమారస్వామి నివాసానికి చేరుకున్న కేసీఆర్.. కాసేపట్లో మాజీ ప్రధాని దేవెగౌడతో చర్చలు జరపనున్నారు.

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశవ్యాప్త టూర్ ను కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో చర్చలు జరిపిన ఆయన.. ఇవాళ బెంగళూరుకు చేరుకున్నారు. కుమారస్వామి నివాసానికి చేరిన కేసీఆర్.. లంచ్ తరువాత మాజీ ప్రధాని దేవెగౌడతో చర్చలు జరపనున్నారు.

దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, రాష్ట్రపతి ఎన్నికలతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై కూడా దేవెగౌడ, కుమారస్వామితో కేసీఆర్ సమాలోచనలు చేసే అవకాశం ఉంది. దాదాపు రెండు గంటలకు పైగా వీరి భేటీ జరగనున్నట్లు సమాచారం. అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.

కేసీఆర్ బెంగళూరు టూర్ సందర్భంగా నగరంలో పలు చోట్ల అభిమానులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన రాలేగావ్ సిద్ధి వెళ్తారని భావించినప్పటికీ.. దీనిపై క్లారిటీ రాలేదు. దీంతో సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన ముగించుకుని సాయంత్రమే ప్రగతి భవన్ కు చేరుకోనున్నారు.

ఇటీవలే.. ఢిల్లీ, పంజాబ్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్..అక్కడి సీఎంలతో చర్చలు జరిపారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తో కూడా మంతనాలు జరిపారు. 29వ తేదీ వరకు పర్యటన కొనసాగుతుందని భావించినప్పటికీ.. ఉన్నట్టుండి సోమవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం కర్ణాటక పర్యటనను ఖరారు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇవాళ దేవెగౌడ, కుమారస్వామితో భేటీ కానున్నారు.

మోదీ ఇటు.. కేసీఆర్ ఆటు…

మరోవైపు ప్రధాని మోదీ హైదరాబాద్ కు వచ్చి కొద్ది నిమిషాల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరూ కూడా బేగంపేట్ ఎయిర్ పోర్టుకు రావటంతో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఇరువర్గాలను అదుపు చేశాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.  

ఇది రెండోసారి…

ఇక గతంలో కూడా ప్రధాని మోడీ ముచ్చింతల్ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగానే ఉన్నారు. స్వల్ప జ్వరంతో బాధపడుతుండటంతో దూరంగా ఉన్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అయితే తాజాగా మరోసారి బెంగుళూరు టూర్ కారణంగా పీఎం కార్యక్రమానికి దూరం అయ్యారు.  కేసీఆర్ కావాలనే ఇలా చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక మోదీ టూర్ నేపథ్యంలో నగరంలో  బ్యానర్లు వెలిశాయి. కాళేశ్వరానికి జాతీయ హోదా, ఐటీఐఆర్ , పసుపు బోర్డు, ఫార్మా సిటీ వంటి అంశాలను ప్రస్తావించారు. ఈ హామీలను ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రశ్నించారు. వీటిపై రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.

మొత్తంగా ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ కు రావటం.. కేసీఆర్ బెంగళూర్ టూర్ కు వెళ్లటంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే కేసీఆర్ టార్గెట్ గా ప్రధాని మోదీ విమర్శలు చేయటంతో.. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి.

IPL_Entry_Point

టాపిక్