Cash Seizure in Telangana : ఎన్నికల వేళ ముమ్మర తనిఖీలు-రూ.104.18 కోట్ల నగదు, నగలు, మద్యం సీజ్-hyderabad lok sabha elections police seizure 104 crore cash gold liquor in checked up to now ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cash Seizure In Telangana : ఎన్నికల వేళ ముమ్మర తనిఖీలు-రూ.104.18 కోట్ల నగదు, నగలు, మద్యం సీజ్

Cash Seizure in Telangana : ఎన్నికల వేళ ముమ్మర తనిఖీలు-రూ.104.18 కోట్ల నగదు, నగలు, మద్యం సీజ్

HT Telugu Desk HT Telugu
Apr 29, 2024 02:55 PM IST

Cash Seizure in Telangana : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ రూ.104.18 కోట్ల నగదు, బంగారం, మద్యం, మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి.

రూ.104.18 కోట్ల నగదు, నగలు, మద్యం సీజ్
రూ.104.18 కోట్ల నగదు, నగలు, మద్యం సీజ్

Cash Seizure in Telangana : లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.‌ చెక్ పోస్టులు(Check Posts) వద్ద నిరంతరాయంగా తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా డబ్బులు, మద్య, మత్తు పదార్థాలు తరలించకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. పోలింగ్(Polling) కు గడువు దగ్గరపడడంతో ప్రలోభాలు జోరందుకున్నాయి. కట్టడి చేసేందుకు తనిఖీలు ముమ్మరం చేయడంతో భారీగా నగదు, నగలు, మద్యం పట్టుబడుతోంది. ఎన్నికల షెడ్యూల్(Elections Schedule) వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.104.18 కోట్ల విలువైన నగదు, నగలు, మద్యం, మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. అందులో రూ 63,41,66,697 నగదు, 5,38,12,583 రూపాయల విలువ చేసే మద్యం, 7,12,31,697 రూపాయల విలువ చేసే నార్కోటిక్ డ్రగ్స్, రూ. 21,34,75,691 రూపాయల విలువైన బంగారం(Gold), వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రూ.9.71 కోట్లు సీజ్

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు నిఘా పెంచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మార్చి 16 నుంచి నామినేషన్ల ఉపసంహరణ(Nominations Withdrawn) వరకు రూ.9.71 కోట్ల విలువైన నగదు, నగలు, మద్యం పట్టుకున్నారు. కరీంనగర్ లో ఓ హోటల్ లో రూ. 6.67 కోట్లు, నగరంలో వాహనాల తనిఖీలతో రూ.88 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో సీజ్(Seize) చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. జగిత్యాల జిల్లాలో అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.90 లక్షల విలువ గల 1.506 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ.3.96 లక్షల విలువైన 15.81 కిలోల గంజాయిని పట్టుకున్నారు. రూ.33,765 విలువ గల మద్యం సీజ్(Liquor Seize) చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.40 వేల విలువ గల గంజాయిని పట్టుకున్నారు. అదేవిధంగా రూ.7.63 లక్షల విలు వైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో రూ.38 వేల విలువగల గంజాయి పట్టుకుని, 574 లీటర్ల మద్యం సీజ్ చేశారు.

వెనక్కి తీసుకుంది రూ.71 లక్షలు

ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలో రూ.9.71 కోట్లు ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుబడగా ఆధారాలు చూపి రూ.71 లక్షలు మాత్రం వెనక్కి తీసుకున్నారు. తనిఖీల సమయంలో పత్రాల ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు పట్టుకున్న రూ.9.71 కోట్లను త్రీమెన్ కమిటీకి అప్పగించగా, బాధితులు కమిటీకి సరైన పత్రాలు చూపడంతో రూ.71 లక్షలు వెనక్కి ఇచ్చేశారు. సరైన పత్రాలను చూపిస్తే నగదు(Money) విడుదల చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సరైన ఆధారాలతో నగదు, బంగారం తరలిస్తే ఇబ్బందులుండవని సూచిస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా నగదు, ఇతర సామగ్రి తరలించవద్దని పోలీసుశాఖ, ఎన్నికల పర్యవేక్షణ అధికారులు ఎప్పటికప్పుడు చెబుతున్నా వాటిని లెక్క చేయకుండా కొంత మంది నగదు, ఇతర వస్తువులు తరలిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. పోలింగ్ కు ఇక 15 రోజులు గడువు మాత్రమే ఉండడంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేసి ప్రలోభాలను కట్టడి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

సిద్దిపేట జిల్లాలో

లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) సందర్భంగా సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా 24 గంటల పాటు విస్తృతంగా నిర్వహించిన వాహనాల తనిఖీలలో(Checkings) భాగంగా ఆధారాలు లేని రూ. 43,72,410 లక్షల నగదు, 25 తులాల బంగారు(Gold Ornaments) ఆభరణాలు, 12 కాటన్ల బీర్లు, 6.480 లీటర్లు విస్కీ క్వార్టర్ బాటిల్లు మొత్తం విలువ రూ.70,57,944 లక్షలు సీజ్ చేశారు. సిద్ధిపేట జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏసీపీలు, సీఐలు,ఎస్ఐలు, సిబ్బంది, కేంద్ర బలగాలతో కలిసి 24 గంటల పాటు విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తు్న్న రూ. 43,72,410 లక్షల నగదు,139.19 గ్రాముల బంగారు ఆభరణాలు(వీటి మొత్తం విలువ రూ. 26,55,006 లక్షలు) సీజ్ చేశారు. 12 కాటన్ల బీర్లు, 144 బీర్లు, విస్కీ క్వార్టర్ బాటిళ్లు 6.480 లీటర్లు వీటి విలువ రూ.30,528 ఉంటుందని అంచనా. వీటిని సీజ్ చేసినట్లు పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు.

శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టు(Shamshabad Airport) పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి(Ganja)ని ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ ఏసీపీ నాగబుషాణం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి కొత్వాల గూడ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ చెన్నమ్మ హోటల్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. అటుగా వెళుతున్న కారు పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేయగా.... పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న డ్రైవరు మహారాష్ట్రకు చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. అతనికి బ్రీత్ అనలైసర్ చేయగా.. అతడు మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం కారులో ఉన్న 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తునట్టు తెలిపారు.

HT Telugu Correspondent K.V.REDDY, Karimnagar

మెదక్,హెచ్.టి.తెలుగు రిపోర్టర్

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner