T Congress MP Candidates : నాడు ఎమ్మెల్యే టికెట్ త్యాగం... నేడు ఎంపీ అభ్యర్థిగా 'సురేష్ షెట్కర్'
Telangana Congress MP Candidates 2024: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ను త్యాగం చేసిన సురేశ్ షెట్కర్ కు ఎంపీ టికెట్ ను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరోసారి కూడా జహీరాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేయనున్నారు. గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Zaheerabad MP Candidate Suresh Shetkar: తెలంగాణలో గత ఎమ్మెల్యే ఎన్నికల సందర్బంగా.. తనకు వచ్చిన నారాయణఖేడ్ అసెంబ్లీ సీటుని తన తోటి నాయకునికి కోసం త్యాగం చేసిన సురేష్ షెట్కార్ కు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ను కట్టబెట్టింది. కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసిన లోక్ సభ అభ్యర్థుల తోలి(Telangana Congress MP Candidates) జాబితాలో జహీరాబాద్ టికెట్ ని సురేష్ షెట్కార్ కు కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా, కాంగ్రెస్ పార్టీ తనకు నారాయణఖేడ్ టికెట్ ఇస్తే, అదే టికెట్ కోసం పోటీపడుతున్న మరొక నాయకుడు పట్లోళ్ల సంజీవ రెడ్డి తాను ఎట్టి పరిస్థితిల్లో షెట్కార్ కు మద్దతు ఇచ్చేది లేదని ప్రకటించారు. ఇద్దరు కలిసి పనిచేస్తే తప్ప సీటు గెలుచుకోలేని పరిస్థితి ఉండటంతో… షెట్కార్ తనకు వచ్చిన బి ఫార్మ్ ని సంజీవ రెడ్డి కి ఇచ్చి త్యాగం చేసారు.
కలిసి పని చేశారు….
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(TS Assembly Elections 2024) సంజీవ రెడ్డి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు షెట్కర్. కాంగ్రెస్ పార్టీ కీలకమైన నారాయణఖేడ్ టికెట్ గెలుచుకోవడంలో, అత్యంత కీలక పాత్ర పోషించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా, షెట్కార్ కు జహీరాబాద్ ఎంపీ సీటు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, తన మాట నిలబెట్టుకోవడంతో షెట్కార్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం(Zaheerabad MP Seat ) ఏర్పడిన 2009 ఎన్నికల్లో పోటీచేసిన షెట్కార్, జహీరాబాద్ నుండి ఎంపీగా గెలిచినా తోలి ఎంపీగా రికార్డుల్లోకి ఎక్కారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యేలుగా గెలిచిన, తన పెదనాన్న అప్పారావు షెట్కార్, తండ్రి శివరావు షెట్కార్ కు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన సురేష్ షెట్కార్ 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2004 లో పోటీచేసి, తొలిసారి నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా గెలిశారు.
2009లో ఎంపీగా గెలుపు….
2009 లో నారాయణఖేడ్ టికెట్ కోసం పట్లోళ్ల కిష్టా రెడ్డి, షెట్కార్ ఇద్దరు పోటీపడటంతో, పార్టీ అధిష్టానం షెట్కార్ కు జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది. తాను పోటీచేసిన తొలిసారే ఎన్నికల్లో గెలిచి… లోక్ సభ కు వెళ్లారు షెట్కార్. 2014 లో కూడా జహీరాబాద్ నుండి పోటీచేసిన, షెట్కార్ బీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ చేతిలో ఓటమి పాలయ్యారు. జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో, గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాల బలంగా ఉండటంతో, ఈ సారి షెట్కార్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి అంటున్నారు రాజకీయ పండితులు.
కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలు.......
కామారెడ్డి, జహీరాబాద్, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాలు తప్ప, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్, అందోల్ నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. తాము ఓడిపోయిన మూడు నియోజకవర్గాల్లో, కామారెడ్డి బీజేపీ గెలుచుకోగా, జహీరాబాద్, బాన్సువాడ నియోజకవర్గాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఆ రెండు పార్టీ లు కూడా కాంగ్రెస్ పార్టీ కంటే బలహీనంగా ఉండటం, కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ముందే ప్రకటించి ఇంకా తన గెలుపు అవకాశాలను పెంచుకున్నదని కాంగ్రెస్ పార్టీ నాయకులూ అంటున్నారు. బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ని కాషాయ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.