Zaheerabad Crime : కేర్ టేకర్ గా వచ్చి చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ- జహీరాబాద్ లో అరెస్ట్!
Zaheerabad Crime : తన పిల్లలను చూసుకునేందుకు పెట్టుకున్న కేర్ టేకర్ ... ఒక చిన్నారిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నిందితురాలని జహీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
Zaheerabad Crime : చిన్నారుల సంరక్షణకు కేర్ టేకర్ గా వచ్చి ఆ చిన్నారినే కిడ్నాప్(Kidnap) చేసి పారిపోతున్న మహిళను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు (Zaheerabad Police)అదుపులోకి తీసుకొని పాపను తల్లితండ్రులకు అప్పగించారు. జహీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ (Hyderabad)చంచల్ గూడలో నివాసముండే దంపతులకు ఇద్దరు కవల పిల్లలు సిద్ధిఖీ (9 నెలలు) ఉన్నారు. వీరు చిన్నారుల సంరక్షణకు కొద్దిరోజుల క్రితం ఛత్తీస్ గడ్ కు చెందిన నుస్రత్ షాజహాన్ బేగంను కేర్ టేకర్ గా పనిలో కుదుర్చుకున్నారు. శనివారం ఒక పాపకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన మహిళ చిన్నారి సిద్ధిఖీ కిడ్నాప్ చేసింది. ఇంట్లో పాప లేకపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ మాదన్నపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కిడ్నాపర్ ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. చుట్టుపక్కల సీసీ టీవీల్లో దృశాలను పరిశీలించారు.
చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
సీసీ కెమెరాల ద్వారా ఆ మహిళ ఎంజీబీఎస్(MGBS) బస్ స్టాండ్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ పరిశీలించగా పాపను ఎత్తుకెళ్లిన నుస్రత్ షాజహాన్ బేగం అక్కడ మహారాష్ట్ర బస్సు ఎక్కినట్లుగా గుర్తించారు. వెంటనే మాదన్నపేట పోలీసులు జహీరాబాద్ పోలీసులకు సమాచారం అందించి వారిని అప్రమత్తం చేశారు. పోలీసులు తనిఖీ చేస్తారనే అనుమానంతో మహిళ సదాశివపేటలో బస్సు దిగి అక్కడే ఉన్న కర్ణాటక బస్సు ఎక్కింది. అప్పటికే జహీరాబాద్ (Zaheerabad)పోలీసులు బస్టాండ్ ఎదుట నిలబడి వచ్చే ప్రతి కర్ణాటక, మహారాష్ట్ర బస్సులను తనిఖీ చేస్తున్నారు. శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో బస్సు ఆగగానే పోలీసులను గమనించిన సదరు మహిళ పాపను తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను పట్టుకొని విచారణ చేపట్టారు. వారు మాదన్నపేట పోలీసులకు, చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులకు కాల్ చేసి పాపను చూపించడంతో వారు తమ పాప సిద్ధిఖీగా గుర్తించారు. వెంటనే వారు జహీరాబాద్ చేరుకొవడంతో చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
సంబంధిత కథనం