Congress to BRS: బిఆర్ఎస్‌లోకి పట్లోళ్ల శశిధర్ రెడ్డి, ఆహ్వానించిన హరీష్‌రావు
Congress to BRS: మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరొక భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న పట్లోళ్ల శశిధర్ రెడ్డి, భారత రాష్ట్ర సమితిలో చేరటానికి వేదిక సిద్ధం అయ్యింది.
Congress to BRS: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు బిఆర్ఎస్ ని వీడి, కాంగ్రెస్ పార్టీ లో చేరటంతో, మెదక్ నియోజకవర్గంలో రాజకీయాలు వేగంగా మారటం మొదలైంది. మైనంపల్లి కాంగ్రెస్ లో చేరిన కొద్ది రోజులు తర్వాత, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీకీ రాజీనామా చేసి, బిఆర్ఎస్ లో చేరారు.
కంఠారెడ్డి ఇంటికి స్వయంగా తానే వెళ్లి ఆహ్యానించిన మంత్రి టి హరీష్ రావు, శశిధర్ రెడ్డి ఇంటికి కూడా తానే స్వయంగా వెళ్లి బుధవారం రాత్రి ఆయనను కలిశారు. తమ పార్టీ లో చేరాలని పట్లోళ్లని, హరీష్ రావు ఆహ్యానించారు.
తమ పార్టీలోకి వస్తే, తనకు తగిన గుర్తింపు ఇచ్చి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతకుముందు మంత్రి కి దగ్గరగా ఉన్న కొంతమంది నాయకులు, శశిధర్ రెడ్డి తో సంప్రదింపులు జరిపారని, తాను పార్టీ మారడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతోనే మంత్రే స్వయంగా వారింటికి వెళ్ళి ఆహ్యానించినట్టు తెలుస్తుంది.
యువకునిగా ఉన్నప్పటి నుండి రాజకీయాల్లో చురుకుగా ఉన్న శశిధర్ రెడ్డి, 2004 లో కాంగ్రెస్ పార్టీ తరపున మెదక్ నుండి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిసాడు. 2009లో మైనంపల్లి హనుమంత రావు చేతిలో ఓడిపోవడం జరిగింది. తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో, మెదక్ సీటు 2014 లో కాంగ్రెస్ పార్టీ సినీనటి విజయశాంతి కి ఇవ్వటం తో శశిధర్ రెడ్డిని నిరాశకు గురి చేసింది.
ఆ తర్వాత కు రాజకీయంగా ఏది కలిసిరాలేదు, నాటకీయ పరిణామాల మధ్య 2018 లో తనకు సోదరుడు వరుసైన ఉపేందర్ రెడ్డి కి ఇవ్వటంతో, ఆ ఎన్నికలకు దూరంగా ఉన్న శశిధర్ రెడ్డి , తర్వాత పార్టీ మారి బీజేపీలో చేరాడు. 2023 మేలో స్వయంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి తనను టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి మరీ పార్టీలోకి ఆహ్యానించాడు.
శశిధర్ రెడ్డి ఈ సారి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేయటం తథ్యం అనుకున్న నేపథ్యంలో మైనంపల్లి చేరిక అతని ఆశలపై నీళ్లు చల్లింది. ఇదే అవకాశంగా మంత్రి హరీష్ రావు చకచకా పావులు కదిపాడు. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు, మైనంపల్లి చేరికతో అవకాశం కోల్పోయానని బాదపడుతున్న శశిధర్ రెడ్డిని తన పార్టీలోకి చేరమని ఆహ్యానించాడు. శశిధర్ రెడ్డి చేరికతో తమకు లాభిస్తుందని, బిఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి భావిస్తున్నారు.