Narayankhed Congress Candidate : నారాయణఖేడ్ లో బిగ్ ట్విస్ట్... అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్
Telangana Assembly Elections 2023 : నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది హైకమాండ్. చివరి నిమిషంలో నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
Telangana Assembly Elections 2023 : నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆ పార్టీ హైకమాండ్. చివరి నిమిషంలో నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మారుస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే సురేశ్ షెట్కార్‌కు టికెట్‌ను ఖరారు చేసిన కాంగ్రెస్.. తాజాగా సంజీవ్‌రెడ్డిని ఖరారు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇద్దరు నేతల మధ్య సయోధ్య తర్వాతనే ఈ ప్రకటన వెలువడినట్లు సమాచారం.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డిని ప్రకటించగా, బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ జర్నలిస్ట్ జనవాడే సంగప్పని బరిలోకి దించింది. వారిద్దరూ ఇక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. తొలుత కాంగ్రెస్ నుంచి షెట్కర్ పేరు ఖరారు కావటంతో… సంజీవ్ రెడ్డి వర్గం తీవ్ర ఆందోళనలకు దిగింది. ఓవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తుండగా…. కాంగ్రెస్ లోని నేతల మధ్య సఖ్యత లేకపోవటం ఇబ్బందిగా మారింది. ఈ పరిణామాలన్నింటిని గమనించిన కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది.
ఇద్దరి నేతలతో మాట్లాడిన కాంగ్రెస్ పెద్దలు … అభ్యర్థి మార్పునకు అంగీకరించారు. సురేష్ షెట్కార్ స్థానంలో పట్లోళ్ల సంజీవ రెడ్డిని ఖరారు చేశారు. ఇందుకు షెట్కర్ కూడా అంగీకారం తెలపటంతో… లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. సంజీవ రెడ్డి విజయం కోసం కలిసి పని చేస్తామని షెట్కర్ తెలపటంతో… నారాయణఖేడ్ అభ్యర్థిని మార్చినట్లు సమాచారం.
పటాన్ చెరు బరిలో శ్రీనివాస్ గౌడ్…
మరోవైపు పటాన్ చెరు రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కపోవటంతో … కాంగ్రెస్ లో చేరిన నీలం మధుకు ఆ పార్టీ టికెట్ కేటాయించింన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన జాబితాలో నీలం మధు పేరును మార్చుతూ…. కాట శ్రీనివాస్ గౌడ్ పేరును చేర్చింది హస్తం పార్టీ. దీంతో కాంగ్రెస్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నీలం మధు…. మళ్లీ రూట్ మార్చేశారు. ఎన్నికల బరిలో ఉండటం ఖాయమని చెప్పిన ఆయన…. బీఎస్పీ గూటికి చేరారు.