Khammam MP Seat 2024 : ఎంపీ సీటుపై సీపీఐ కన్ను..! ఆసక్తికరంగా మారుతున్న 'ఖమ్మం' రాజకీయం-cpi eyes on khammam mp loksabha seat 2024 ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Cpi Eyes On Khammam Mp Loksabha Seat 2024

Khammam MP Seat 2024 : ఎంపీ సీటుపై సీపీఐ కన్ను..! ఆసక్తికరంగా మారుతున్న 'ఖమ్మం' రాజకీయం

HT Telugu Desk HT Telugu
Feb 26, 2024 10:30 PM IST

Lok Sabha Sabha Elections 2024: ఖమ్మం ఎంపీ సీటు వ్యవహారం ఆసక్తిని పుట్టిస్తోంది. ఓవైపు కాంగ్రెస్ లోని కీలక నేతలు టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుండగా… మరోవైపు సీపీఐ కూడా ఆశలు పెంచుకుంటోంది. పొత్తులో భాగంగా… ఈ సీటును ఆశిస్తోంది.

ఖమ్మం ఎంపీ సీటు
ఖమ్మం ఎంపీ సీటు

Khammam MP Seat 2024 : ఖమ్మం ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో నువ్వా, నేనా అన్నట్లు పోటీ నెలకొనగా ఇప్పుడు కాంగ్రెస్ కు మరో పోటీ చిక్కు ముడిగా మారనుంది. సీపీఐ పొత్తు రూపంలో మరో కొత్త మెలిక పడనుంది. దీంతో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలకు వేదికైన లోక్ సభ అభ్యర్థిత్వంపై ఒకరకంగా కన్ఫ్యూజన్ నెలకొన్నట్లే కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఈ క్రమంలో సీపీఐ పార్టీకి కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని కేటాయించగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అక్కడ అఖండ మెజారిటీతో విజయం సాధించారు. పొత్తు నేపద్యంలోనే కాంగ్రెస్ సైతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్థానాల్లో మెజారిటీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఫలితంగా ఇరు పార్టీల నడుమ పొత్తు పరంపర కొనసాగుతోంది. ఆ పొత్తు తాజాగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కూటమి పెద్దలు ఆశిస్తున్నారు. తొలి నుంచీ ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుగాంచింది. ఈక్రమంలో సిపిఐ పార్టీ అధినాయకత్వం ఖమ్మం లోక్ సభ సీటు తమకే ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం వద్ద గట్టి పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ నుంచి కీలక నేతలు….

కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఖమ్మం అభ్యర్థి విషయానికి వస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ కుటుంబీకులకు టిక్కెట్ కేటాయించాలని భీష్మిస్తున్నారు. ఈక్రమంలో అధిష్టానం దగ్గర ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమై ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తనయుడు తుమ్మల యుగేందర్ ఇప్పటికే అగ్ర నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, దీప్ దాస్ మున్షి వంటి అధినాయకులను కలుస్తూ తన ప్రయత్నాల్లో ఉన్నారు. ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా తనకు టికెట్ ఇస్తే తన తండ్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ చరిష్మాతో పాటు ఖమ్మం లోక్ సభ పరిధిలోని కమ్మ సామాజిక వర్గం ఓట్లతో పాటు తమ తండ్రికి రాజకీయ జీవితాన్నిచ్చిన టిడిపి పార్టీ ఓట్లు కూడా పోలై అధిక మెజార్టీతో గెలవవచ్చన్న ధీమాతో ఆయన ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు గెలుపుకి, ఓట్ల శాతం భారీగా పెరగడానికి, రికార్డు స్థాయి మెజార్టీకి ఈ ఈక్వేషన్ కారణమైందని చెప్పవచ్చు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒకవేళ బిజెపి, టిడిపి పొత్తు ఖరారైతే మెజార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని తనకే ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని ఖమ్మంలోని భట్టి క్యాంప్ ఆఫీస్ నుంచి 500 కార్లతో భారీ ర్యాలీగా గాంధీ భవన్ కి వెళ్లి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మల్లు నందిని అమ్మ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భట్టికి రాజకీయంగా చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. అలాగే "ఉమ్మడి ఖమ్మంలో పదికి పది సీట్లు గెలుస్తాం.. ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను.." అని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఛాలెంజ్ విసిరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం తన సోదరుడికి టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి తన పంతం నెగ్గించుకున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇప్పించే విషయంలో ఎక్కడ రాజీ పడే అవకాశం లేనట్లు కనిపిస్తున్నారు. ప్రసాద్ రెడ్డి కూడా సభలు, సమావేశాలు, క్రీడా పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటూ నేనే ప్రధానంగా బరిలో ఉన్నానని ధీమాతో ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన తమ్ముడికే ఎంపీ టికెట్ ఇప్పించాలని అధిష్టానం వద్ద తెరచాటుగా రాజకీయ పావులు కదుపుతున్నారు. వీరితో పాటు ఇంకొంత మంది ఆశావాహులు అధిష్టానం వద్ద ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిచేందుకు తమ ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు.

ఆసక్తి రేపుతున్న నారాయణ వ్యాఖ్యలు..

కాంగ్రెస్ పార్టీతో పొత్తు నేపథ్యంలో తాము ఒక ఎంపీ స్థానాన్ని కోరుతున్నట్లు సిపిఐ జాతీయ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలు తాజాగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, భువనగిరి ఎంపీ స్థానాల్లో ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద విజ్ఞాపన ఉంచినట్లు ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో నారాయణ స్పష్టం చేశారు. కాగా కమ్యూనిస్టులకు కంచుకోటగా చెప్పుకునే ఖమ్మం జిల్లాలో పోటీ పట్ల సిపిఐ పార్టీ పెద్దలు ఆసక్తిని కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐ గతంలో అసెంబ్లీ స్థానాలను గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అలాగే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా తొలి సారి ఖమ్మం ఎంపీ స్థానాన్ని సిపిఐ పార్టీకి కేటాయించారు. ఆ సమయంలో సిపిఐ తరఫున నారాయణ పోటీలో నిలిచారు. సిపిఎం పార్టీ వైసిపి అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా నిలవగా ఆ ఎన్నికల్లో పొంగులేటి విజయం సాధించారు.

అయితే గత చరిత్రను అనుసరించి ఈసారి సిపిఐ పార్టీ ఖమ్మం ఎంపీ స్థానాన్ని గట్టిగా అడుగుతున్నట్లు తెలుస్తోంది. నారాయణ సూచించిన ఐదు ఎంపీ స్థానాల్లోనూ ఖమ్మంలోనే సిపిఐ ప్రాబల్యం అధికంగా కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఖమ్మం స్థానంపైనే గట్టి పట్టు పడుతున్నట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ లో ముగ్గురు మంత్రులు తమ వారికి టికెట్ కేటాయించాలని అధిష్టానం వద్ద ఒకరికొకరు పోటీ పడుతున్నారు. పొత్తు నేపథ్యంలో ఇంకో వంక సీపీఐ ఒత్తిడి పెంచుతోంది. ఇలాంటి సంక్లిష్ట స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సిందే.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

 

WhatsApp channel

సంబంధిత కథనం