CPI Narayana : కాంగ్రెస్ తో సీపీఐ జట్టు-ఫలించిన 'నారాయణ' మంత్రం
CPI Narayana : తెలంగాణలో కాంగ్రెస్ తో చెలిమి సీపీఐ కలిసొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని విజయం సాధించారు. కాంగ్రెస్ తో జట్టుకట్టడంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక పాత్ర పోషించారు.
CPI Narayana : కాంగ్రెస్ పార్టీతో చెలిమి చేసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును అసెంబ్లీకి పంపడంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ సఫలీకృతమయ్యారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు పావులు కలిపారు. కాగా సీపీఎం స్వయంకృతాపరాధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేయలేకపోయింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిర్ణయంతో రాష్ట్రంలోని 19 నియోజకవర్గాల్లో సీపీఎం అభ్యర్థులు ఒంటరిగా బరిలోకి దిగాల్సి వచ్చింది. అయినా వీరికి గౌరవప్రదమైన ఓటింగ్ దక్కకపోవడంతో నిరాశే మిగిలింది. సీపీఎం అభ్యర్థులందరూ డిపాజిట్ కోల్పోయిన దయనీయ పరిస్థితి నెలకొంది.
ఆచితూచి అడుగేసిన సీపీఐ
సీపీఐ నాయకులు మాత్రం ఆచితూచి అడుగు వేస్తూ కాంగ్రెస్ తో ఎంతో చాకచక్యంగా చెలిమిని ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాత్ర ప్రముఖంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపే క్రమంలో ఆయన ఎంతో సహనంతో వ్యవహరిస్తూ ప్రతి అంశంలోనూ సర్దుకుపోయే తత్వాన్ని కనబరిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే సీపీఐకి ఒకే ఒక్క స్థానం దక్కినప్పటికీ అదే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ తో స్నేహం చేసి చివరికి లాభ పడ్డారు.
ఎమ్మెల్యేగా కూనంనేని గెలుపుతో దక్కిన గౌరవం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆచితూచి అడుగులేసిన ఫలితంగా కాంగ్రెస్ చెలిమితో కొత్తగూడెంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాస్తవానికి ఈ స్థానంలో సీపీఐ ఒంటరిగా బరిలోకి దిగితే గెలుపు సాధ్యమయ్యే పనికాదు. ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు పోటీలో ఉండగా, బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా జలగం వెంకట్రావు సైతం పోటీకి నిలిచారు. దీంతో కొత్తగూడెంలో త్రిముఖ పోటీ అనివార్యమైంది. ఇలాంటి సంక్లిష్ట స్థితిలోనూ కూనంనేని సాంబశివరావు 22,125 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును మూడో స్థానానికి పరిమితం చేయగలిగారు.
పువ్వాడను అదుపు చేయడంలోనూ
ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావును అదుపు చేయడంలోనూ నారాయణ సఫలం అయ్యారు. పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐలో జాతీయ నేతగా కొనసాగుతున్నప్పటికీ ఆయన కుమారుడు ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఐదేళ్లపాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పని చేసిన అజయ్ గెలుపు కోసం తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు లోపాయికారీగా సహకరిస్తారని సర్వత్రా చర్చ జరిగింది. గత ఎన్నికల్లోనూ ఇదే జరిగినట్లు ఊహాగానాలు సైతం వినిపించిన నేపథ్యంలో సీపీఐ నారాయణ ఆయనే స్వయంగా రంగంలోకి దిగి పువ్వాడ నాగేశ్వరరావుకు సైతం హెచ్చరికలు జారీ చేయడంలో వెనుకాడలేదు. పుత్ర వ్యామోహంతో పార్టీ కట్టుబాటును వీడితే పార్టీ పరమైన చర్యలు తప్పవని ఖరాకండిగా చెప్పేశారు. దీంతో పాటు పువ్వాడకు బహిరంగ లేఖ రాసి మరింత ఉచ్చు బిగించారు. పువ్వాడకు పార్టీలో అనాదిగా సముచిత స్థానం ఉందని, ఆ స్థానాన్ని కోల్పోవద్దని ఆ లేఖలో హితవు పలికారు. పుత్ర వ్యామోహంతో పార్టీకి ద్రోహం చేయొద్దని పరోక్షంగా హెచ్చరిక చేశారు.
అలాగే పార్టీ కేడర్ ను సైతం అదుపులో పెట్టి పువ్వాడ ప్రమేయం లేకుండా పార్టీకి చెందిన ఓట్లన్నీ పొత్తు ధర్మం ప్రకారం కాంగ్రెస్ కు బదిలీ అయ్యేలా కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే సీపీఐకి చెందిన నూటికి 75 శాతం ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి. దీంతో పువ్వాడ అజయ్ పై పోటీకి నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు భారీ మెజారిటీ వచ్చింది. ఇలా పార్టీ నేతలను ఏకతాటిపై నడుపుతూ పొత్తు ధర్మానికి కట్టుబడేలా చేయడంలో నారాయణ సఫలం అయ్యారు. ఇదే క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావును గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వంలో సముచితమైన స్థానం సీపీఐకి దక్కేలా శ్రమించారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.