TS Elections CPM: సిపిఐ బాటలోనే సిపిఎం సర్దుకుంటుందా?
TS Elections CPM: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులతో సీట్ల సర్దుబాటు జరగొచ్చని ప్రచారం జరుగుతోంది. తమ దారి తాము చూసుకుంటున్నామని సిపిఎం ప్రకటించినా ఆఖరి నిమిషంలో అద్భుతాలు జరగొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.
TS Elections CPM: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమైన సిపిఎంను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా తమతో కలిసి రావాలని సిపిఎంను కాంగ్రెస్ పార్టీ బుజ్జగిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఆ పార్టీ నేతలతో మంతనాలు జరుగుతున్నాయి. నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తి కానుండటంతో వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటును కొలిక్కి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీకి కేటాయించినట్లు ఒక సీటు, రెండు ఎమ్మెల్సీల ఆఫర్‌ను సిపిఎంకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సిపిఎం కోరిన మిర్యాలగూడ స్థానంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు ఎమ్మెల్సీలను కేటాయిస్తామని ప్రతిపాదిస్తోంది.
కాంగ్రెస్ ప్రతిపాదనకు సిపిఎం సానుకూలత వ్యక్తం చేయకపోతే నల్గొండతో పాటు హైదరాబాద్‌లో మరో స్థానాన్ని సిపిఎంకు కేటాయించాలని ఆఫర్ చేస్తారని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆఫర్‌కు సిపిఎం ఎంత మేరకు అమోదం తెలుపుతుందనేది ఉత్కంఠగా మారింది.
కాంగ్రెస్ పార్టీ తరపున పెండింగ్‌లో ఉన్న నియోజక వర్గాల్లో మూడు స్థానాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉన్నాయి. దీంతో అభ్యర్థులను ప్రకటించడం ఆ పార్టీకి కూడా కీలకంగా మారింది. మిర్యాలగూడ, తుంగతుర్తి, సూర్యాపేట నియోజక వర్గాలకు అభ్యర్థులను బుధవారం సాయంత్రంలోగా ప్రకటిస్తారని చెబుతున్నారు. సిపిఎం పార్టీకి కేటాయించే సీట్ల విషయం కొలిక్కి వస్తే మిగిలిన నియోజక వర్గాల విషయంలో కూడా స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
మరోవైపు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు రెండు ఎమ్మెల్సీ స‌్థానాల ఆఫర్‌పై వామపక్షాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తేనే ఎమ్మెల్సీ ఆఫర్ వర్కౌట్ అవుతుందని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవులకు పోటీ ఏర్పడితే కమ్యూనిస్టులు ఏం చేయగలరనే సందేహాలు కూడా ఉన్నాయి.