PM Modi : జూన్ 4 ఫలితాల్లో ఎన్డీఏకు 400 పైగా సీట్లు, ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్- ప్రధాని మోదీ-chilakaluripet praja galam meeting pm modi criticizes ysrcp govt looting money nda will get 400 seats ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pm Modi : జూన్ 4 ఫలితాల్లో ఎన్డీఏకు 400 పైగా సీట్లు, ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్- ప్రధాని మోదీ

PM Modi : జూన్ 4 ఫలితాల్లో ఎన్డీఏకు 400 పైగా సీట్లు, ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్- ప్రధాని మోదీ

Bandaru Satyaprasad HT Telugu
Mar 17, 2024 07:37 PM IST

PM Modi : వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని ప్రధాని మోదీ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు అవినీతి, అక్రమాల్లో పోటీ పడుతున్నారని విమర్శించారు.

ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

PM Modi : చిలకలూరిపేట ప్రజాగళం(Prajagalam) సభలో ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ ప్రధాని మోదీ(PM Modi) తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. జూన్‌ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీఏకు(NDA) 400కుపైగా సీట్లు రాబోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇదే తన తొలి సభ అన్నారు. వికసిత భారత్ కోసం ఎన్డీఏకు 400పైగా సీట్లు రావాలని ఆకాంక్షించారు. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి రెండు అవసరమే అన్నారు. ఈ రెండింటినీ ఎన్డీఏ ప్రభుత్వం సమన్వయం చేస్తుందన్నారు. ఏపీ ప్రజల కోసం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ ఎంతో కష్టపడుతున్నారని ప్రధాని మోదీ కితాబు ఇచ్చారు. ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని ప్రధాని మోదీ ఆరోపించారు. వైసీపీ, కాంగ్రెస్‌ను ఒకే కుటుంబం నడుపుతోందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ (Congress)కుట్రలు చేస్తోందన్నారు. ఏపీలో మంత్రులు అవినీతి, అక్రమాల్లో పోటీ పడుతున్నారని విమర్శించారు. ఒకరిని మించి ఒకరు అవినీతి చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఏపీలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలన్నారు.

తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాటం

ఎన్డీఏ కూటమి రోజు రోజుకూ బలం పుంజుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. టీడీపీ, జనసేన(TDP Janasena) ఎన్డీఏలో చేరాయన్నారు. ఈ కూటమి లక్ష్యం అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను తీర్చిదిద్దడమే అన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రధాని మోదీ (PM Modi)అన్నారు. ఎన్నో జాతీయ విద్యాసంస్థల్ని కేంద్రం ఏపీకి కేటాయించిందన్నారు. తిరుపతి ఐఐటీ, కర్నూలులో ఐఐఐటీ, విశాఖలో ఐఐఎం, మంగళగిరికి ఎయిమ్స్ కేటాయించామన్నారు. ఎన్డీఏలో అందరినీ కలుపుకొని వెళ్తామన్నారు. ఎన్నికలకు ముందే ఇండియా కూటమి పార్టీలు గొడవ పడి విడిపోతున్నాయన్నారు. ఎన్టీఆర్‌ రాముడు, కృష్ణుడి పాత్రలతో మెప్పించారని, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్(NTR) పోరాడారన్నారు.

మరింత బలపడిన ఎన్డీఏ కూటమి

చంద్రబాబు(Chandrababu) చేరికతో ఎన్డీఏ మరింత బలపడిందని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌తోనే ఏపీ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. పేదల కోసం ఆలోచించేది ఎన్డీఏ ప్రభుత్వమేనన్నారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎన్డీఏ విధానాలతో పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. ప్రధాని మోదీ ఆవాస్ యోజన కింద పేదలకు పక్కా ఇళ్లు ఇస్తున్నామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా కోటి కుటుంబాలకు ఉచితంగా కుళాయి కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏపీలో 1.25 కోటి మందికి వైద్య సదుపాయం అందిస్తున్నామన్నారు. చిన్న, సన్నకారు రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కింద సాయం అందిస్తున్నామని ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు.

సంబంధిత కథనం