AP Elections Survey : తొలి సంకేతం కూటమి వైపే, ఎస్సీ స్థానాల్లో అధికార పార్టీకి ఎదురుగాలి!-amaravati peoples pulse survey in sc st reserved seats nda wins major seats ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Amaravati People's Pulse Survey In Sc St Reserved Seats Nda Wins Major Seats

AP Elections Survey : తొలి సంకేతం కూటమి వైపే, ఎస్సీ స్థానాల్లో అధికార పార్టీకి ఎదురుగాలి!

HT Telugu Desk HT Telugu
Apr 03, 2024 04:37 PM IST

AP Elections Survey : ఏపీ ఫలితాలను డిసైడ్ చేసే ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ స్థానాలపై ప్రధాన పార్టీలు అంతగా దృష్టి పెట్టడంలేదు. రాష్ట్రంలోని మొత్తం 36 రిజర్వుడ్ స్థానాల్లో తొలి సంకేత కూటమి వైపు మొగ్గుతోందని పీపుల్స్ పల్స్ సర్వే ప్రకటించింది.

పీపుల్స్ పల్స్ సర్వే
పీపుల్స్ పల్స్ సర్వే

AP Elections Survey : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల ఆటను మలుపుతిప్పే ఓ గట్టి సంకేతాన్ని ప్రధాన పార్టీలు విస్మరిస్తున్నాయి. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచి అధికారం దక్కించుకోనుందో... ఫలితాల జోస్యం చెప్పినట్టు ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలిచే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాలపై(SC ST Reserved Constituencies) ప్రధానపక్షాలైన వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలు పెద్దగా శ్రద్ద పెట్టడం లేదు. విపక్షమైన టీడీపీ(TDP) ఇప్పుడు జనసేన, బీజేపీలతో జట్టుకట్టి కూటమిగా ఏర్పడి కూడా ఆయా నియోజకవర్గాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిందేమీ లేదు. పాలక వైసీపీ కూడా అంతే! 20 శాతానికి పైగా, అంటే 36 అసెంబ్లీ స్థానాలు ఏపీలో ఇలా రిజర్వు అయి ఉన్నాయి. షెడ్యూల్డ్‌ కులాలకు (ఎస్సీ) 29, షెడ్యూల్డ్‌ తెగ (ఎస్టీ)లకు 7 మొత్తం 36 అసెంబ్లీ స్థానాలు రిజర్వుడ్‌గా ఉన్నాయి. ఎప్పట్లాగే రాష్ట్రంలో వీస్తున్న రాజకీయ గాలికి అద్దం పట్టే ఈ నియోజకవర్గాల్లో, ముఖ్యంగా ఎస్సీ స్థానాల్లో ఇప్పుడు పాలకపక్షానికి ఎదురుగాలి వీస్తున్నట్టు ’పీపుల్స్‌పల్స్‌’ తాజా సర్వే(Survey)లో వెల్లడైంది.

ట్రెండింగ్ వార్తలు

పేరుకే రిజర్వుడ్ స్థానాలు

ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాల్లో ఆధిక్యత ఎప్పుడూ.... తదుపరి అధికారం చేజిక్కించుకునే లేదా నిలబెట్టుకునే పార్టీకే దక్కటం ఆనవాయితీగా వస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగి, సీట్లు ప్రస్తుత సంఖ్య ఖరారైన 2009 ఎన్నికల నుంచి ఫలితాలను విశ్లేషించినా ఇదే తేటతెల్లమౌతుంది. ఆ లెక్కన, రిజర్వుడు స్థానాల్లోని తాజా సర్వే గణాంకాలని బట్టి చూస్తే రాష్ట్రంలో కూటమి విజయకేతన సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. నిర్దిష్టంగా ఈ 36 స్థానాల్లో జరిపిన సర్వేలో పాలక వైసీపీ, విపక్ష కూటమి మధ్య స్పష్టమైన ఓటు షేర్‌(Vote Share) వ్యత్యాసం ఉంది. ఎస్సీ నియోజకవర్గాల్లో కూటమి ఆధిక్యతలో ఉంటే ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రం పాలక వైసీపీ ఆధిక్యతలో ఉంది. రిజర్వుడు నియోజకవర్గాల విషయంలో గతాన్ని పరిశీలిస్తే, ఏవో రెండు బలమైన ప్రభావక, దళిత-గిరిజనేతర వర్గాలు ఒక వైపు మొగ్గితే తప్ప ఈ రిజర్వుడు స్థానాల్లో ఎవరికీ గెలుపు దక్కటం లేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నట్టు ప్రాథమిక సర్వే సంకేతాలను బట్టి స్పష్టమౌతోంది. పేరుకు రిజర్వు స్థానాలే అయినా..... రెడ్డి (7స్థానాల్లో), కమ్మ (6), కాపు (6), ఇతర బలహీనవర్గాలు (8) ముఖ్య ప్రభావక సామాజికవర్గాలుగా ఉన్నాయి. రిజర్వు స్థానాలు కావడం వల్ల ఆయా వర్గాలవారే అభ్యర్థులుగా ఉంటున్నా, తుది ఫలితాన్ని ప్రభావితం చేయడంలో ఆయా వర్గాల పాత్ర అంతంతే! ప్రభావక వర్గాలదే ఆదిపత్యం. ఈ సారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటం కూడా ప్రభావక సామాజిక వర్గాల కలయికకు, సమీకరణాలకు ఆస్కారం పెంచింది. ఫలితంగా రిజర్వుడ్‌ స్థానాల్లో కూటమి బలంగా కనిపిస్తోంది.

ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో పోటీ

ఏపీలోని 36 రిజర్వుడ్‌ నియోజకవర్గాలు(SC ST Reserved) మొత్తం 137 మండలాలు, 6 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లోకి విస్తరించి ఉన్నాయి. ఇందులో 14 మండలాలు వైసీపీ పూర్తి పట్టున్నవి కాగా 16 మండలాల్లో కూటమి ముఖ్య భాగస్వాములైన టీడీపీ-జనసేనలకు పట్టుంది. మిగతా చోట్ల పోటీ నీవా నేనా అన్నట్టుంది. కానీ, మొత్తంగా ఓటు షేరు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నట్టు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. పునర్విభజన తర్వాత తొలిసారి జరిగిన 2009 ఎన్నికల్లో గెలిచి అధికారం నిలబెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీకి 36లో 28 (ఎస్సీ 22, ఎస్టీ 6) రిజర్వుడు స్థానాలు దక్కాయి. తెలుగుదేశం అధికారం దక్కించుకున్న 2014 లో పరిస్థితి తిరగబడింది. ఎస్టీ రిజర్వు స్థానాల్లో(ST Reserved) ఆధిపత్యం ఎప్పుడూ కాంగ్రెస్‌ పార్టీకో, దాని ఓటు బ్యాంకులతో మనుగడ సాగిస్తున్న ప్రస్తుత వైసీపీకో దక్కుతూ వస్తోంది. కానీ ఎస్సీ స్థానాల్లో మాత్రం, ఇక్కడ లభించే ఆధిపత్యమే మొత్తం ప్రభుత్వం ఏర్పరిచే ఆధిపత్యానికి చుక్కానిగా కనిపిస్తోంది, ఒక ముందస్తు సంకేతంగా నిలుస్తోంది. 29లో టీడీపీకి 16 స్థానాలు లభించగా వైసీపీకి 13 సీట్లే దక్కాయి. తర్వాత, అంటే చివరగా జరిగిన 2019 ఎన్నికల్లో పరిస్థితి మళ్లీ తిరగబడిరది. 29లో 27 స్థానాలు దక్కించుకున్న వైసీపీ భారీ మెజారిటీ (151/175) తో అధికారం చేపట్టింది. ఇప్పుడు పరిస్థితి మళ్లీ మారుతున్నట్టు సర్వేలో వెల్లడైన గణాంకాలు చెబుతున్నాయి. వైసీపీ పరిస్థితి ఎస్టీ నియోజకవర్గాల్లో మెరుగ్గానే ఉన్నా... ఎస్సీ నియోజకవర్గాల్లో బాగో లేదని స్పష్టమౌతోంది. చదువుకున్న దళిత వర్గాల్లో ఇటీవల కొంత మార్పు కనిపిస్తోంది. సబ్‌ప్లాన్‌ నిధుల(Subplan) మళ్లింపు, ఉద్యోగాలు దొరక్కపోవడం, రుణాలు సరిగ్గా లభించకపోవడం వంటివి వారి ఆలోచనల్లో మార్పుకు కారణం అయి ఉంటుందన్నది నిపుణుల అంచనా.

ఎస్సీ స్థానాల్లో కూటమి, ఎస్టీ స్థానాలలో వైసీపీ

ఏపీలోని మొత్తం 29 ఎస్సీ స్థానాల్లో, తాజా సర్వే(Survey) ప్రకారం వైసీపీ(Ysrcp)కి 42.83 శాతం ఓటు షేర్‌ లభిస్తే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 51.81 శాతం ఓటు షేర్‌ లభిస్తోంది. సీట్లు వైసీపీకి 10, కూటమికి 19 లభించవచ్చని జనాభిప్రాయంగా ఈ సర్వేలో వెల్లడయింది. ఎస్టీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ వైసీపీకి ఓటు షేర్‌(Vote Share)లో స్వల్ప ఆధిక్యత లభిస్తున్నా అది సీట్లకు వచ్చేసరికి తేడా అధికంగా ఉంది. 7 ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో వైసీపీ ఓటు వాటా 48.16 గాను, టీడీపీ-జనసేన-బీజేపీ(TDP Janasena BJP) కూటమి ఓటు వాటా 46.49 గానూ నమోదయింది. అది వైసీపీకి 5 సీట్లు, కూటమికి 2 సీట్లుగా ప్రతిఫలిస్తోంది. ఎస్టీ నియోజకవర్గాల్లో (ST Constituencies)తెలుగుదేశంతో సహా కూటమి పక్షాలు ఎప్పుడూ బలహీనంగానే ఉన్నాయి. ఇందులో... టీడీపీ 2009 లో ఒకసీటు గెలిస్తే, తాను అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నికల్లోనూ గెలిచింది ఒక సీటులోనే! ఇక 2019 ఎన్నికల్లో కనీసం ఒక స్థానం కూడా టీడీపీకి ఎస్టీ రిజర్వు స్థానాల్లో దక్కలేదు. జనసేన, బీజేపీలదీ దాదాపు అన్ని ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. 2009 ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజారాజ్యం పార్టీ మొత్తంగా తాను గెలిచిన 18 (ఆంధ్రలో 16, తెలంగాణ 2) స్థానాల్లోనూ ఎస్టీ సీటు లేదు. రిజర్వుడు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు వివిధ సామాజిక వర్గాలను పెద్దగా ప్రభావితం చేసే పరిస్థితులు ఉండవు. కానీ, ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల ఇతర సామాజికవర్గాల వారు పోటీలో ఉన్న అభ్యర్థులను కాకుండా, ఏ పార్టీ మెజారిటీ స్థానాలు నెగ్గి అధికారంలోకి రాబోతోందో ఓ అంచనాతో ఉంటారు. అందుకే, ఫలితాలు ఇలా ట్రెండ్‌సెట్టర్స్‌లా వస్తుంటాయనే విశ్లేషణ కూడా ఒకటి ప్రచారంలో ఉంది.

జాడేలేని వామపక్ష పార్టీలు

ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టే ఏపీలోనూ గిరిజన ఉపకులాల్లో(Tribals) తగాదాలున్నాయి. అవి కూడా ఎన్నికల్లో కొంత ప్రభావం చూపిస్తుంటాయి. ఎన్నికలు`ఓట్లకు సంబంధించినంత వరకు వీరిపైన, వీరి ఓటింగ్‌ సరళిపైన టీచర్లు, ప్రభుత్వోద్యోగుల (Govt Employees)ప్రభావం ఎక్కువ అనే అభిప్రాయం కూడా ఉంది. ఎస్టీలకు సహజంగానే వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ విభాగాలు దన్నుగా ఉంటాయి, కానీ, ప్రధాన స్రవంతి పార్టీల పోటీకి తట్టుకోలేక ఎన్నికల రాజకీయాల్లో వెనుకబడిపోతున్నారు. వివిధ కారణాలతో కమ్యూనిస్టులు క్రమంగా జనాదరణ కోల్పోయి ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేయలేని స్థితికి చేరుకున్నారిప్పుడు. ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థల దన్నుతో పనిచేసే వనవాసీ కల్యాణ్‌ వంటి కొన్ని సంస్థలు కొంతమేర గిరిజన ఓటర్లను అక్కడక్కడ ప్రభావితం చేయగలుగుతున్నాయి. అయినా, వారు కూడా బీజేపీకి(BJP) ఎస్టీ రిజర్వుడ్‌ సీట్లు గెలిపించి పెట్టే స్థితి లేదు.

సీట్ల పంపకాలు

రాష్ట్రంలో విపక్ష ప్రధాన కూటమి వాటాల పంపకాల్లో భాగంగా జనసేనకు(Janasena) మూడు ఎస్సీ, ఒక ఎస్టీ సీటు దక్కగా, బీజేపీకి ఒక ఎస్సీ సీటు, ఒక ఎస్టీ సీటు లభించింది. ఇక మిగిలిన రిజర్వుడ్‌ స్థానాలంన్నిటా తెలుగుదేశం పార్టీయే పోటీ చేస్తోంది. గెలిచి, అధికారంలోకి వచ్చే పార్టీగా జనాభిప్రాయంలో ఉంటే పరిస్థితి సానుకూలించడం తప్పితే, పార్టీగా చూసినప్పుడు టీడీపీకి కూడా రిజర్వుడ్‌ స్థానాల్లో గొప్ప విజయాల చరిత్ర ఏమీ లేదు. జనసేన, బీజేపీ సంగతి సరేసరి! వైఎస్సార్‌సీపీ సంగతి నిలకడగా లేదు. తాజా సర్వేలో వెల్లడౌతున్న సమాచారం కొన్ని నిర్దిష్ట సంకేతాలనిస్తోంది. తుదకు ఎవరు? ఎవరి పక్షం వహిస్తున్నారు? అంతిమంగా ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది తేలాల్సింది మాత్రం వచ్చే జూన్‌ 4న మాత్రమే!

దిలీప్‌రెడ్డి, పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ
దిలీప్‌రెడ్డి, పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ

Mail: dileepreddy.ic@gmail.com, Cell No: 9949099802

(Disclaimer : ఈ సర్వే పూర్తిగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ వ్యక్తిగతం. ఈ సర్వేకు హెచ్.టి.తెలుగుకు సంబంధం లేదు. ఇందులోని అంశాలు సర్వే ప్రణాళికలతో హెచ్.టి.తెలుగుకు ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ సంబంధంలేదు)

WhatsApp channel