Yuvraj on Kohli: కోహ్లితో మాట్లాడను.. అతనికి అంత తీరిక ఉండదు: యువరాజ్ సింగ్
Yuvraj on Kohli: కోహ్లితో మాట్లాడను.. అతనికి అంత తీరిక ఉండదని అన్నాడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. ఒకప్పటి చీకూకి, ఇప్పటి విరాట్ కోహ్లికి ఎంతో తేడా ఉందని అతడు అనడం విశేషం.
Yuvraj on Kohli: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మధ్యే ధోనీ, తాను క్లోజ్ ఫ్రెండ్స్ కాదంటూ యువీ చేసిన కామెంట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కోహ్లి గురించి కూడా అతడు అలాగే స్పందించాడు. కోహ్లితో తాను పెద్దగా మాట్లాడనని, అతడు చాలా బిజీగా ఉంటాడని యువీ అనడం విశేషం.
కోహ్లి, యువరాజ్ సింగ్ 2008 నుంచి 2017 మధ్య టీమిండియా తరఫున ఆడారు. కోహ్లి టీమ్ లోకి వచ్చే సమయానికి యువరాజ్ పెద్ద స్టార్ ప్లేయర్. 2011 వరల్డ్ కప్ గెలిపించిన హీరో. అయితే క్యాన్సర్ తోనే ఆ టోర్నీ ఆడిన యువీ.. తర్వాత చికిత్స కోసం చాలా రోజులుగా టీమ్ కు దూరంగా ఉన్నాడు. ఆలోపే కోహ్లి సత్తా చాటి టీమ్ లో చోటు ఖాయం చేసుకున్నాడు. తర్వాత పదేళ్లలో యువీని మించిన స్థాయికి ఎదిగాడు.
అతని గురించి ఈ మధ్యే టీఆర్ఎస్ పాడ్‌కాస్ట్ లో యువీ స్పందించాడు. "అతడు చాలా బిజీ. అందుకే అతన్ని డిస్టర్బ్ చేయను. యువకుడైన విరాట్ కోహ్లి పేరు చీకూ. కానీ ఇవాళ చీకూ విరాట్ కోహ్లి అయ్యాడు. చాలా తేడా ఉంది" అని యువీ అనడం విశేషం. ఈ పాడ్‌కాస్ట్ లోనే ధోనీ గురించి కూడా యువీ కామెంట్స్ చేశాడు. తాము బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోయినా.. టీమిండియా కోసం మాత్రం తామిద్దరం తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినట్లు చెప్పాడు.
ఇక కోహ్లి గురించి మరింత స్పందిస్తూ.. "మేమందరం ఫిట్ టీమ్ గా మారాలని అనుకునేవాళ్లం. కానీ కోహ్లి కెప్టెన్ అయిన తర్వాత చాలా తేడా వచ్చింది. అతడో బెంచ్ మార్క్ సెట్ చేశాడు. తాను గొప్ప ఫుట్‌బాలర్ అని అతడు అనుకుంటాడు. కానీ అతని కంటే నాకు ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి. అతడు యువకుడు. బాగా పరుగెత్తుతాడు. తనను తాను క్రిస్టియానో రొనాల్డో అనుకుంటాడు. క్రికెట్ లో అతడు రొనాల్డోనే. ఫిట్‌నెస్, ఆటపై ఏకాగ్రత విషయంలో ఇద్దరూ ఒకటే" అని యువరాజ్ అనడం విశేషం.
విరాట్ కోహ్లి టీమ్ లోకి వచ్చి నిలదొక్కుకునే సమయానికి యువరాజ్ క్యాన్సర్ చికిత్స కోసం జట్టుకు దూరమయ్యాడు. దీంతో 2008 నుంచి 2017 మధ్య ఈ ఇద్దరూ కలిసి ఇండియా తరఫున 3 టెస్టులు, 64 వన్డేలు, 33 టీ20లు మాత్రమే ఆడారు. క్యాన్సర్ నుంచి కోలుకొని యువీ మళ్లీ జట్టులోకి వచ్చినా.. మునుపటి ఆటతీరు లేకపోవడంతో యువీ క్రమంగా తెరమరుగయ్యాడు.