Yuvraj on Dhoni: నేను, ధోనీ క్లోజ్ ఫ్రెండ్స్ కాదు.. 2019 వరల్డ్ కప్ ముందు ఆ విషయాన్ని అతడే చెప్పాడు: యువరాజ్ సింగ్
Yuvraj Singh on MS Dhoni: ధోనీ, తాను ఎప్పుడూ క్లోజ్ ఫ్రెండ్స్‌గా లేమని భారత మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ వెల్లడించాడు. 2019 ప్రపంచకప్ ముందు ధోనీ తనతో చెప్పిన విషయాన్ని కూడా తాజాగా చెప్పాడు.
Yuvraj Singh on MS Dhoni: 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టైటిళ్లను టీమిండియా కైవసం చేసుకోవడంలో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కీలకపాత్ర పోషించారు. 2011 వరల్డ్ కప్‍లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా యువీ కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇద్దరూ రిటైరయ్యారు. భారత జట్టులో ఉన్నప్పుడు ధోనీ, యువీ మధ్య బంధం ఎలా ఉండేదన్న ప్రశ్నలు అప్పట్లో చాలా తలెత్తాయి. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న పుకార్లు కూడా చాలా సార్లు వచ్చాయి. అయితే, కొంతకాలంగా చాలా విషయాలను యువరాజ్ సింగ్ వెల్లడిస్తున్నాడు. ధోనీతో తన బంధం ఎలా ఉండేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ వెల్లడించాడు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
మైదానం బయట ధోనీ, తాను బెస్ట్ ఫ్రెండ్స్ కాదని యువరాజ్ సింగ్ చెప్పారు. టీఆర్ఎస్ క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానెల్‍తో మాట్లాడుతూ కొన్ని విషయాలను యువీ వెల్లడించాడు. మైదానం బయట తన లైఫ్ స్టైల్, ధోనీ లైఫ్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంటాయని యువీ అన్నాడు.
"నేను.. మహీ క్లోజ్ ఫ్రెండ్స్ కాదు. క్రికెట్ వల్లే మేం స్నేహితులం అయ్యాం. కలిసి ఆడాం. నాతో పోలిస్తే మహీ లైఫ్ స్టైల్ చాలా విభిన్నం. అందుకే మేం ఎప్పుడూ క్లోజ్ ఫ్రెండ్స్ రాలేదు. క్రికెట్ వల్ల మేం కేవలం స్నేహితులం అయ్యాం. గ్రౌండ్‍లో ఆడుతున్నప్పుడు నేను మహీ.. దేశం కోసం 100శాతం కంటే ఎక్కువే ఇస్తాం. అతడు కెప్టెన్‍గా.. నేడు వైస్ కెప్టెన్‍గా ఉండేవాడిని. వైస్ కెప్టెన్‍గా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలను విభేదిస్తుంటాం” అని యువరాజ్ చెప్పాడు.
“మైదానం బయట టీమ్‍మేట్స్.. బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండాలని లేదు. ప్రతీ ఒక్కరికీ డిఫరెంట్ స్టైల్, స్కిల్ సెట్ ఉంటుంది. ఆడే ప్రతీ ఒక్కరితో బెస్ట్ ఫ్రెండ్‍గా ఉండాల్సిన అవసరం లేదు” అని యువీ అన్నాడు.
జట్టులోకి తిరిగి తీసుకునేందుకు సెలెక్షన్ కమిటీ తనను పరిగణనలోకి తీసుకోవడం లేదని 2019 వన్డే ప్రపంచకప్‍కు ముందే ధోనీ తనకు చెప్పాడని యువరాజ్ సింగ్ వెల్లడించాడు. దీంతో అప్పుడు క్రికెట్ భవిష్యత్తుపై తనకు ఓ క్లారిటీ వచ్చిందని యువీ చెప్పాడు.
“ధోనీ రిటైర్ అయ్యాడు. నేను రిటైర్ అయ్యాను. మేం కలిసినప్పుడు.. స్నేహితుల్లాగే ఉంటాం. కలిసి ఓ యాడ్‍లోనూ నటించాం. పాత రోజుల గురించి మాట్లాడుకొని నవ్వుకున్నాం” అని యువరాజ్ చెప్పాడు.