Sachin on Virat Kohli: విరాట్ కోహ్లి తన సెంచరీల రికార్డు సమం చేయడంపై సచిన్ టెండూల్కర్ రియాక్షన్ ఇదీ
Sachin on Virat Kohli: విరాట్ కోహ్లి తన సెంచరీల రికార్డు సమం చేయడంపై సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా రియాక్ట్ అయ్యాడు. తన రికార్డు త్వరలోనే బ్రేక్ చేయాలని అతడు ఆకాంక్షించడం విశేషం.
Sachin on Virat Kohli: తన హీరో సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును విరాట్ కోహ్లి సమం చేసిన విషయం తెలుసు కదా. సౌతాఫ్రికాపై సెంచరీతో వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య 49కి చేరింది. సచిన్ కూడా 452 ఇన్నింగ్స్ లో 49 సెంచరీలతో తన కెరీర్ ముగించగా.. విరాట్ తన 277వ ఇన్నింగ్స్ లోనే ఈ సెంచరీలను అందుకోవడం విశేషం.

అయితే కోహ్లి తన రికార్డును సమం చేయడంపై సోషల్ మీడియా ఎక్స్ ద్వారా సచిన్ టెండూల్కర్ స్పందించాడు. విరాట్ సెంచరీ పూర్తి చేయగానే మాస్టర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తన రికార్డును త్వరలోనే అతడు బ్రేక్ చేయాలని టెండూల్కర్ ఆకాంక్షించడం గమనార్హం. "అద్భుతంగా ఆడావు విరాట్. నేను 49 నుంచి 50ల్లోకి రావడానికి 365 రోజులు పట్టింది. నువ్వు నా రికార్డు బ్రేక్ చేయడానికి 49 నుంచి 50కి మరికొద్ది రోజుల్లోనే వెళ్తావని ఆశిస్తున్నాను. కంగ్రాచులేషన్స్" అని సచిన్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. సచిన్ తన వయసు 50కి చేరిన విషయాన్ని చెబుతూ.. కోహ్లి 50వ సెంచరీ చేయడానికి అంత సమయం మాత్రం పట్టకూడదని చెప్పడం విశేషం. కోహ్లి తన 35వ పుట్టిన రోజు అయిన ఆదివారమే (నవంబర్ 5) క్రికెట్ గాడ్, తన ఐడల్ సచిన్ 49 సెంచరీల రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్ లో స్లో పిచ్ పై ఎంతో బాధ్యతాయుతంగా ఆడిన కోహ్లి చివరికి 101 రన్స్ తో అజేయంగా నిలిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
తన పుట్టిన రోజు నాడే ఈ స్పెషల్ ఫీట్ ను సాధించడం కల నిజమైనట్లుగా భావిస్తున్నట్లు కోహ్లి చెప్పాడు. ఈ సెంచరీతో ఒకే వరల్డ్ కప్ ఎడిషన్ లో కోహ్లి తొలిసారి 500కుపైగా రన్స్ చేసిన రికార్డుతోపాటు ఓవరాల్ గా వరల్డ్ కప్ లలో అత్యధిక పరుగుల జాబితాలో సచిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో పాంటింగ్, సంగక్కరలను వెనక్కి నెట్టాడు.
ఈ వరల్డ్ కప్ లో ఇండియా కనీసం మరో రెండు మ్యాచ్ లు ఆడుతుంది. నెదర్లాండ్స్ తో చివరి లీగ్ మ్యాచ్ తోపాటు సెమీఫైనల్ ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ లలోనే కోహ్లి తన 50వ వన్డే సెంచరీ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. టాప్ ఫామ్ లో ఉన్న విరాట్ కు అది సాధ్యమే అని వాళ్లు నమ్ముతున్నారు.