WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్.. బంగ్లాదేశ్ కంటే కిందికి పడిపోయిన టీమిండియా
WTC Point Table: డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టీమిండియా ఐదో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్ చేతుల్లో హైదరాబాద్ టెస్టులో దారుణంగా ఓడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ కంటే దిగువకు పడిపోయింది.
WTC Point Table: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల టేబుల్లో ఇండియన్ టీమ్ బంగ్లాదేశ్ కంటే కూడా దిగువకు పడిపోవడం గమనార్హం. ఆదివారం (జనవరి 28) ఇంగ్లండ్ చేతుల్లో 28 పరుగులతో ఓటమి తర్వాత రెండో స్థానం నుంచి ఏకంగా ఐదో స్థానానికి దిగజారింది.
నాలుగో రోజే ఎదురైన ఈ ఓటమి అభిమానులను షాక్ కు గురి చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఓలీ పోప్ భారీ సెంచరీతోపాటు చేజింగ్ లో ఇండియన్ టీమ్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు.
డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్
ఈ ఓటమితో ఐదు టెస్టుల సిరీస్ లో ఇండియా 0-1తో వెనుకబడింది. అయితే ఈ ఓటమి డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లోనూ టీమిండియా పతనానికి కారణమైంది. ఈ టెస్ట్ ముందు వరకూ రెండో స్థానంలో ఉన్న ఇండియన్ టీమ్.. ఇప్పుడు బంగ్లాదేశ్ కంటే దిగువన ఐదోస్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఇండియా ఐదు టెస్టులు ఆడింది. అందులో రెండింట్లో గెలిచి, మరో రెండు ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. వెస్టిండీస్, సౌతాఫ్రికాలపై ఒక్కో టెస్టు గెలిచింది. ఇక సౌతాఫ్రికా, ఇంగ్లండ్ చేతుల్లో ఓడింది. వెస్టిండీస్ తో మరో మ్యాచ్ డ్రా అయింది. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ గెలిచిన తర్వాత టాప్ లోకి దూసుకెళ్లినా.. తర్వాత రెండో స్థానానికి, ఇప్పుడు ఐదుకు పడిపోయింది.
ఆస్ట్రేలియా టాప్
ఇక తాజా డబ్ల్యూటీసీ సైకిల్లో ఆస్ట్రేలియా టాప్ లో కొనసాగుతోంది. ఆ టీమ్ ఇప్పటి వరకూ 10 టెస్టులు ఆడి 6 గెలిచింది. 66 పాయింట్లు, 55 పర్సెంటేజ్ తో తొలి స్థానంలో ఉంది. వెస్టిండీస్ చేతుల్లో అనూహ్య ఓటమి తర్వాత కూడా ఆస్ట్రేలియా టాప్ లోనే కొనసాగుతోంది. ఇక సౌతాఫ్రికా 2 టెస్టుల్లో ఒకటి గెలిచి, మరొకటి ఓడి 50 పర్సెంటేజ్ తో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లు కూడా రెండు టెస్టుల్లో ఒక్కో విజయంతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇంగ్లండ్ చేతుల్లో ఓటమితో ఇండియా ఖాతాలో కేవలం 26 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇక 43.33 పర్సెంటేజ్ తో ఐదో స్థానంలో ఉంది. ఇండియాపై గెలిచినా కూడా ఇంగ్లండ్ 8వ స్థానంలోనే కొనసాగుతోంది. ఆ టీమ్ ఈ సైకిల్లో 6 మ్యాచ్ లలో 3 విజయాలు, 2 ఓటములు, ఒక డ్రాతో 29.16 పర్సెంటేజ్ తో ఉంది. ఇండియాపై తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే.