World Cup 2023 Income: వరల్డ్ కప్ 2023తో భారత ఆర్థిక వ్యవస్థలోకి రూ.22 వేల కోట్లు
World Cup 2023 Income: వరల్డ్ కప్ 2023తో భారత ఆర్థిక వ్యవస్థలోకి రూ.22 వేల కోట్లు రానున్నట్లు ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. తొలిసారి ఇండియా సొంతంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ గురువారం (అక్టోబర్ 5) ప్రారంభమైన విషయం తెలిసిందే.
World Cup 2023 Income: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేయనున్నట్లు పలువురు ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ మెగా టోర్నీ ద్వారా ఏకంగా రూ.22 వేల కోట్లు (260 కోట్ల డాలర్లు) ఆర్థిక వ్యవస్థలోకి రానున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఈ మెగా టోర్నీని ఇండియా తొలిసారి సొంతంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.
వరల్డ్ కప్ 2023 గురువారం (అక్టోబర్ 5) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమైంది. నవంబర్ 19 వరకూ టోర్నీ జరగనుంది. ఈ క్రికెట్ పండుగను ప్రత్యక్షంగా చూడటానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది రానున్నట్లు అంచనా వేస్తున్నారు. అందులోనూ మ్యాచ్ లు దేశంలోని పది నగరాల్లో ఉండటంతో రవాణా, ఆతిథ్య రంగాలకు ఎంతో మేలు జరుగుతుందని ఆర్థిక వేత్తలు జాహ్నవి ప్రభాకర్, అదితి గుప్తా చెబుతున్నారు.
వరల్డ్ కప్‌తో డబ్బే డబ్బు
క్రికెట్ ను ఓ మతంగా భావించే ఇండియాలో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ జరగడం అంటే కాసుల వర్షం కురవడం ఖాయం. అందులోనూ 12 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ కు ఇండియా ఆతిథ్యమిస్తోంది. గతంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలాంటి దేశాలతో కలిసి టోర్నీ నిర్వహించిన ఇండియా.. ఈసారి మాత్రం సొంతంగా ఆతిథ్యమిస్తుండటం విశేషం.
ఇక ఈసారి వరల్డ్ కప్ పండగ సీజన్లో రావడంతో సెంటిమెంట్ పరంగా క్రికెట్ మెర్చండైజ్ కొనుగోళ్లు గతం కంటే భారీగా ఉండొచ్చని ఈ ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ఇక వరల్డ్ కప్ మ్యాచ్ లను టీవీలు, డిజిటల్ ప్లాట్ ఫామ్‌లపై రికార్డు స్థాయిలో చూస్తారనీ వీళ్లు చెబుతున్నారు. 2019 వరల్డ్ కప్ కు మొత్తం 55.2 కోట్ల వ్యూయర్‌షిప్ రాగా.. ఈసారి దానికి రెట్టింపు వస్తుందని భావిస్తున్నారు.
దీంతో టీవీ హక్కులు, స్పాన్సర్‌షిప్ ద్వారా రూ.10500 కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకూ ఆదాయం వస్తుందని జాహ్నవి, అదితి తెలిపారు. ఇక వరల్డ్ కప్ మ్యాచ్ ల సందర్భంగా విమాన టికెట్ల ధరలు, హోటల్ గదుల ధరలు విపరీతంగా పెంచేశారు. దీంతో ఆ ఆదాయం భారీగా పెరగనుంది. ఈ వరల్డ్ కప్ లో టికెట్ల అమ్మకాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీలపై జీఎస్టీతో కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనున్నట్లు ఆ ఆర్థికవేత్తలు స్పష్టం చేశారు.