Cricket Movies On OTT: టాలీవుడ్, బాలీవుడ్‌లో బెస్ట్ క్రికెట్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ ఇవే - ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Cricket Movies On OTT: వన్డే వరల్డ్ కప్ గురువారం నుంచి మొదలుకానున్న నేపథ్యంలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌పై ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. తెలుగు, హిందీ భాషల్లో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన కొన్ని మూవీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
Cricket Movies On OTT: వన్డే వరల్డ్ కప్ క్రికెట్ సమరం గురువారం నుంచి మొదలుకానుంది. 45 రోజుల పాటు క్రికెట్ అభిమానులను ఈ ప్రపంచ కప్ పోటీలు అలరించనున్నాయి. భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ వరల్డ్ కప్‌లో మొత్తం పది దేశాలు పాల్గొననున్నాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. ఆరంభ పోరు కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్నారు.
వరల్డ్ కప్ నేపథ్యంలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ క్రికెట్ కథాంశాలతో వచ్చిన కొన్ని సినిమాలు ఇవే. వీటిపై ఓ లుక్కేయండి...
ఎమ్ఎస్ ధోనీ - ది అన్ టోల్డ్ స్టోరీ
టీమిండియా లెజెండరీ క్రికెటర్ ఎమ్ఎస్ ధోనీ జీవితం ఆధారంగా రూపొందిన ఎమ్ఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో టైటిల్ పాత్రను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోషించాడు. క్రికెట్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో ధోనీకి ఎదురైన ఎత్తుపల్లాలు, సాధించిన విజయాల్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు నీరజ్ పాండే ఈ బయోపిక్ మూవీని తెరకెక్కించాడు.
అజార్
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, తెలుగు ప్లేయర్ మహ్మద్ ఆజారుద్దీన్ బయోపిక్ అజార్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. అజార్ జీవితంలోని మ్యాచ్ ఫిక్సింగ్ కోణం, వివాహేతర సంబంధాల్ని చర్చిస్తూ రూపొందిన ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించాడు.
లగాన్
ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన లగాన్ మూవీ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. 2002లో రిలీజైన ఈ మూవీ ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. కానీ అవార్డును గెలవలేకపోయింది. లగాన్ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.
వీటితో పాటు క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన అక్షయ్‌కుమార్ పాటియాలా హౌజ్, సుశాంత్ సింగ్ కైపోచే, దుల్కర్ సల్మాన్ జోయా ఫాక్టర్ సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. ఇక్బాల్ (జీ5 ఒటీటీ), షాహిద్ కపూర్ దిల్ బోలే హడిప్పా (అమెజాన్ ప్రైమ్ వీడియో)లు కూడా క్రికెట్ కథాంశాలతోనే తెరకెక్కాయి.
తెలుగులో క్రికెట్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ ఇవే...
తెలుగులో క్రికెట్ నేపథ్య కథాంశాలతో రూపొందిన పలు సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆ సినిమాలు ఏవంటే...
నాని, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన జెర్సీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీకొడుకుల అనుబంధంతో తెరకెక్కిన ఈ సినిమాను జీ5 ఓటీటీలో చూడొచ్చు.
తెలుగులో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన నాగచైతన్య మజిలీ (అమెజాన్ ప్రైమ్ వీడియో), వెంకటేష్ వసంతం, శ్రీవిష్ణు, నారా రోహిత్ అప్పట్లో ఒకడుండేవాడు (డిస్నీ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో), కౌసల్య కృష్ణమూర్తి (సన్ నెక్స్ట్), విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డియర్ కామ్రేడ్ (డిస్నీ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో), గోల్కోడం హైస్కూల్ (సన్ నెక్స్ట్) క్రీడాభిమానులను మెప్పించాయి.