Women's T20 World Cup 2024: వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024కు రికార్డు ప్రైజ్ మనీ అనౌన్స్ చేసిన ఐసీసీ
Women's T20 World Cup 2024: ఈ ఏడాది జరగబోయే వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ రికార్డు ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది. గత టోర్నమెంట్ కంటే ఈసారి ఇది రెట్టింపు కంటే ఎక్కువే ఉండటం విశేషం. ఈ విషయాన్ని మంగళవారం (సెప్టెంబర్ 17) వెల్లడించింది.
Women's T20 World Cup 2024: ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ లో జరగబోయే ఈ మెగా టోర్నీ కోసం ఏకంగా 79.58 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం విశేషం. ఈ విషయాన్ని ఐసీసీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ మొత్తం ప్రైజ్ మనీ గతేడాది జరిగిన టోర్నీ కంటే రెట్టింపు కావడం విశేషం.
వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ
వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ భారీగా పెరగడంతో విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ కూడా భారీగానే పెరిగింది. గతేడాది జరిగిన టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలవగా.. ఆ జట్టుకు 1 మిలియన్ డాలర్లు ఇచ్చారు. అదే ఈసారి ఈ ప్రైజ్ మనీని 2.34 మిలియన్ డాలర్లకు పెంచారు. అంటే ఏకంగా 134 శాతం పెరిగింది.
ఇక రన్నర్సప్ ప్రైజ్ మనీ కూడా 134 శాతమే పెంచారు. ఈసారి ఆ మొత్తం 1.17 మిలియన్ డాలర్లుగా ఉండనుంది. సెమీఫైనలిస్టులు ఒక్కో జట్టుకు 6.75 లక్షల డాలర్లు ఇవ్వనున్నారు. ఇది గతేడాది కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
అందరికీ ప్రైజ్ మనీ
గ్రూపు స్టేజ్ లో ప్రతి విజయానికి ఒక్కో జట్టుకు 31154 డాలర్లు ఇస్తారు. ఇది గతేడాది 17500 డాలర్లుగా ఉంది. అంటే ఈ ప్రైజ్ మనీ కూడా 78 శాతం పెరిగింది. గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టే జట్లకు కూడా 1,12,500 డాలర్లు దక్కనున్నాయి. అంటే మొత్తం పది జట్లకు 1.125 మిలియన్ డాలర్లు లభించనున్నాయి.
టీ20 వరల్డ్ కప్ లో 5 నుంచి 8వ స్థానాల్లో నిలిచే ఒక్కో జట్టుకు 2.7 లక్షల డాలర్లను ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు. 9, 10వ స్థానాల్లో ఉన్న వారికి 1.35 లక్షల డాలర్లు ఇస్తారు. మహిళల క్రికెట్ కు ఆదరణ పెంచే ఉద్దేశంతో ఐసీసీ ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది.
వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఇలా..
ఈ ఏడాది వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరగనుంది. యూఏఈలోని దుబాయ్, షార్జా నగరాల్లో మ్యాచ్ లు జరుగుతాయి. ఈ ఏడాది ఇప్పటికే మెన్స్ టీ20 వరల్డ్ కప్ జరిగిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఇక ఇప్పుడు మన వుమెన్స్ టీమ్ ఏం చేస్తుందో చూడాలి.
అక్టోబర్ 3న గ్రూప్ స్టేజ్ ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 15తో ముగుస్తుంది. అక్టోబర్ 17, 18 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబర్ 20న ఫైనల్ జరుగుతుంది. గతేడాది ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.