Women’s T20 World Cup 2024: వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా ఎంపిక.. కెప్టెన్, వైస్ కెప్టెన్ వీళ్లే-womens t20 world cup 2024 bcci announces team india captain harmanpreet kaur vice captain smriti mandhana ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Women’s T20 World Cup 2024: వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా ఎంపిక.. కెప్టెన్, వైస్ కెప్టెన్ వీళ్లే

Women’s T20 World Cup 2024: వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా ఎంపిక.. కెప్టెన్, వైస్ కెప్టెన్ వీళ్లే

Hari Prasad S HT Telugu
Aug 28, 2024 12:49 PM IST

Women’s T20 World Cup 2024: వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం 15 మంది సభ్యుల టీమిండియాను బీసీసీఐ బుధవారం (ఆగస్ట్ 28) ఎంపిక చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి యూఏఈలో ఈ మెగా టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి బలమైన జట్టుతో ఇండియన్ టీమ్ బరిలోకి దిగనుంది.

 వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా ఎంపిక.. కెప్టెన్, వైస్ కెప్టెన్ వీళ్లే
వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా ఎంపిక.. కెప్టెన్, వైస్ కెప్టెన్ వీళ్లే (BCCI- X)

Women’s T20 World Cup 2024: వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఇండియన్ టీమ్ ను ఎంపిక చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు ఈ టోర్నీ జరగనుంది. దీనికోసం హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా ఈ జట్టుకు వైస్ కెప్టెన్ గా కొనసాగనుంది.

ఒకే ఒక్క మార్పుతో టీమిండియా

వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం దాదాపు గత నెలలో జరిగిన వుమెన్స్ ఏషియా కప్ జట్టునే సెలెక్టర్లు ఎంపిక చేశారు. కేవలం ఒకే ఒక్క మార్పు మాత్రమే చేయడం విశేషం. ఆ జట్టులో ఉన్న ఉమా చెత్రీని పక్కన పెట్టి యాస్తికా భాటియాను తీసుకున్నారు. అయితే ఆమె పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే జట్టుతో కలిసి వెళ్తుంది. బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ లో గాయపడిన ఆమె.. ఆసియా కప్ కు దూరంగా ఉంది.

మిగిలిన 14 మంది సభ్యులు ఆసియా కప్ లో ఆడిన వాళ్లే. గత నెలలో జరిగిన ఈ టోర్నీలో ఫైనల్లో శ్రీలంక చేతుల్లో టీమ్ ఓడిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్ గా కాగా.. స్మృతి వైస్ కెప్టెన్ గా ఉంటుంది.

వరల్డ్ కప్‌కు టీమ్ ఇలా

టీ20 వరల్డ్ కప్ కోసం 15 మందితో జట్టును ఎంపిక చేయగా.. ఇందులో తుది జట్టులో స్మృతి మంధానా, షెఫాలీ వర్మ ఓపెనింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దయలన్ హేమలత రూపంలో మరో అదనపు ఓపెనర్ కూడా ఉంది. ఇక మిడిలార్డర్ జెమీమా, దీప్తి శర్మ, రిచా ఘోష్ లతో బలంగా ఉంది.

బౌలింగ్ లో రేణుకా సింగ్, పూజ వస్త్రకర్, దీప్తి శర్మ, రాధా యాదవ్, ఆశా శోభనలాంటి వాళ్లు ఉన్నారు. 15 మంది జట్టు కాకుండా ఐదుగురు రిజర్వ్ ప్లేయర్స్ ను కూడా ముందుగానే ఎంపిక చేశారు. వీళ్లలో ముగ్గురు జట్టుతోపాటే యూఏఈ వెళ్తారు.

టీ20 వరల్డ్ కప్ 2024కు టీమ్ ఇదే

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధానా (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), పూజ వస్త్రకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, డయలన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంకా పాటిల్, సంజన సజీవన్

రిజర్వ్ ప్లేయర్స్: ఉమా ఛెత్రీ, తనూజా కన్వర్, సైమా ఠాకూర్, రాఘవి బిస్త్, ప్రియా మిశ్రా

టీమిండియా షెడ్యూల్ ఇదే

టీ20 వరల్డ్ కప్ 2024 అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అక్టోబర్ 4న ఇండియా తన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ మెగా టోర్నీలో ఇండియన్ టీమ్.. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంకలతో కలిసి గ్రూప్ ఎలో ఉంది. ఇక గ్రూప్ బిలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్ ఉన్నాయి.

అక్టోబర్ 6న ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ దుబాయ్ లో జరుగుతుంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఇండియా సెప్టెంబర్ 29, అక్టోబర్ 1న వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో వామప్ మ్యాచ్ లు ఆడనుంది.