Virat Kohli: మరో సచిన్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ-virat kohli equals sachin tendulkar record for most fifty plus scores in single world cup edition ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: మరో సచిన్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ

Virat Kohli: మరో సచిన్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 12, 2023 05:16 PM IST

Virat Kohli - IND vs NED: భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో రికార్డును సమం చేశాడు. నెదర్లాండ్స్‌తో నేడు జరుగుతున్న మ్యాచ్‍లో విరాట్ ఈ ఫీట్ సాధించాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (AFP)

Virat Kohli - IND vs NED: ప్రస్తుత వన్డే ప్రపంచకప్‍లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కొనసాగించాడు. నేడు (నవంబర్ 11) బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‍లోనూ కింగ్ కోహ్లీ (56 బంతుల్లో 51 పరుగులు) అర్ధ శకతంతో అదరగొట్టాడు. దీంతో 50వ వన్డే శతకాన్ని చేసి.. సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును ఈ మ్యాచ్‍లోనే విరాట్ బద్దలుకొడతాడని అందరూ ఆశించారు. అయితే, తన 71వ వన్డే అర్ధ శతకం పూర్తయిన వెంటనే కోహ్లీ ఔటయ్యాడు. అయినా, సచిన్ పేరిట ఉన్న మరో రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు.

ఒకే వన్డే ప్రపంచకప్ ఎడిషన్‍లో 50 కంటే ఎక్కువ స్కోర్లు అధిక మ్యాచ్‍ల్లో (7 మ్యాచ్‍లు) చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు. ఈ ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు కోహ్లీ ఏడుసార్లు 50 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. 2003 వన్డే ప్రపంచకప్‍లో సచిన్ టెండూల్కర్ 7 మ్యాచ్‍ల్లో 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ రికార్డును విరాట్ ఇప్పుడు సమం చేశాడు. ఇక, 2019 వన్డే ప్రపంచకప్‍లో బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబల్ హసన్ కూడా 7సార్లు 50 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. దీంతో ఒకే ప్రపంచకప్ ఎడిషన్‍లో ఏడు మ్యాచ్‍ల్లో 50 కంటే ఎక్కువ రన్స్ చేసిన మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. సచిన్, షకీబ్‍ను సమం చేశాడు. న్యూజిలాండ్‍తో జరగనున్న సెమీస్‍లో 50 కంటే ఎక్కువ పరుగులు చేస్తే ఈ రికార్డు విషయంలో ఈ ఇద్దరినీ విరాట్ దాటేయవచ్చు.

ప్రస్తుతం వన్డే ప్రపంచకప్‍ 2023 టోర్నీలో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‍ల్లో రెండు సెంచరీలు, ఐదు అర్ధ శతకాలు చేశాడు. దీంతో.. ఏడుసార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసినట్టయింది.

టాప్ స్కోరర్‌గా కోహ్లీ

వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశ ముగిసే సరికి టాప్ స్కోరర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‍లో కోహ్లీ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. దీంతో ఈ ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‍ల్లో విరాట్ 594 పరుగులకు చేరాడు. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ (591 పరుగులు), న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర (565)ను అధిగమించి.. ఈ ఏడాది ప్రపంచకప్ బ్యాటర్ల జాబితాలో టాప్ స్కోరర్‌గా అగ్రస్థానానికి ఎగబాకాడు కోహ్లీ.

సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న వన్డేల్లో అత్యధిక సెంచరీల (49 శతకాలు) రికార్డును ఈ ప్రపంచకప్‍లోనే విరాట్ కోహ్లీ సమం చేశాడు. 50వ వన్డే శతకం చేసి చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో ఉన్నాడు. ప్రపంచకప్ సెమీస్‍లో నవంబర్ 15న న్యూజిలాండ్‍తో భారత్ తలపడనుంది.

Whats_app_banner