Yashasvi Jaiswal: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఓపెనర్ సిక్స్ కొడితే.. రోడ్డుపై పడిన బంతి-team india opener yashasvi jaiswal smashes ball over the nets and onto the streets ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Yashasvi Jaiswal: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఓపెనర్ సిక్స్ కొడితే.. రోడ్డుపై పడిన బంతి

Yashasvi Jaiswal: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఓపెనర్ సిక్స్ కొడితే.. రోడ్డుపై పడిన బంతి

Galeti Rajendra HT Telugu
Nov 13, 2024 01:18 PM IST

India vs Australia: ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ముంగిట భారత్ జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ హిట్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో కొట్టిన ఒక బంతి… రోడ్డుపైకి వెళ్లి పడిండి.

యశస్వి జైశ్వాల్
యశస్వి జైశ్వాల్ (ANI)

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ కోసం భారత్ జట్టు ఇప్పటికే అక్కడ అడుగు పెట్టింది. నవంబరు 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ జరగనుండగా.. పెర్త్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత క్రికెటర్లు నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

నెట్స్‌లో హిట్టింగ్ ప్రాక్టీస్

పెర్త్‌లో జరుగుతున్న ఈ ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కొట్టిన బంతి నేరుగా వెళ్లి రోడ్డుపై పడింది. ఆస్ట్రేలియా పర్యటనకి తొలిసారి వెళ్లిన జైశ్వాల్ అక్కడి పేస్ పిచ్‌లపై అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరీ ముఖ్యంగా.. శరీరంపైకి దూసుకొచ్చే బంతుల్ని ఫుల్ చేయడం, క్రీజు వెలుపలికి వచ్చి భారీ సిక్సర్లు కొట్టడాన్ని ఈ యంగ్ ఓపెనర్ నెట్స్‌లో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నెట్స్‌లో సిక్సర్లు కొట్టే క్రమంలో యశస్వి జైశ్వాల్ కొట్టిన ఒక బంతి బాగా ఎత్తులో వెళ్లి రోడ్డుపై పడింది. అయితే.. ఆ సమయంలో ఏ వాహనం రాకపోవడం, మనుషులు ఎవరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. అంతకముందే అదే దారిలో స్కూల్ పిల్లలు కూడా వెళ్లినట్లు రాసుకొచ్చింది.

ఏడాదిగా సూపర్ ఫామ్‌లో యశస్వి

యశస్వి జైశ్వాల్ గత ఏడాదికాలంగా సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్‌‌పై ఫస్ట్ టెస్టులోనే శతకం బాదిన ఈ అటాకింగ్ లెప్ట్ హ్యాండ్ బ్యాటర్.. దక్షిణాఫ్రికా‌పై మాత్రం సత్తాచాటలేకపోయాడు. కానీ.. ఇంగ్లాండ్‌తో భారత్‌లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ 700కు పైగా పరుగులు చేశాడు.

ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ యశస్వి వికెట్ కాపాడుకుంటూ సత్తాచాటాడు. దాంతో ఆస్ట్రేలియా టూర్‌లోనూ ఈ యంగ్ ఓపెనర్‌తో ప్రమాదం పొంచి ఉందని కంగారూల బౌలర్లని ఆ దేశ మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.

మరో గబ్బర్ అవుతాడా?

శిఖర్ ధావన్ తరహాలో ఆస్ట్రేలియా పిచ్‌లపై యశస్వి జైశ్వాల్ సత్తాచాటే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా బౌలర్లని ఎదుర్కొన్న అనుభవం యశస్వికి ఉంది. అయితే.. అక్కడి పిచ్‌లకి ఎంత త్వరగా అలవాటు పడతాడు అనేదానిపై అతని ప్రదర్శన ఆధారపడి ఉంటుంది.

భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ షెడ్యూల్

  • నవంబర్ 22న పెర్త్‌లో మొదటి టెస్టు మ్యాచ్
  • డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ ఓవల్ వేదికగా రెండో టెస్టు. ఇది డే/నైట్ ఫార్మాట్ ఉంటుంది
  • డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బాలో మూడో టెస్టు
  • డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టు మ్యాచ్
  • జనవరి 3 నుంచి సిడ్నీలో ఆఖరి టెస్టు మ్యాచ్

Whats_app_banner