Team India Zimbabwe Tour: జింబాబ్వే బయలుదేరిన టీమిండియా.. జట్టులో ఆ ముగ్గురు వరల్డ్ కప్ స్టార్లు కూడా..
Team India Zimbabwe Tour: జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్ కోసం యంగ్ టీమిండియా ఆ దేశానికి బయలుదేరింది. కోచ్ వీవీఎస్ లక్ష్మణ్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో యువకులతో నిండిన ఈ టీమ్ తలపడనుంది.
Team India Zimbabwe Tour: ఈ మధ్యే టీ20 వరల్డ్ కప్ గెలిచిన సీనియర్ టీమిండియా ఇంకా బార్బడోస్ లోనే ఉండగా.. జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్ కోసం యంగిండియా బయలుదేరింది. ఈ టూర్ కోసం సీనియర్ ప్లేయర్స్ అందరికీ బీసీసీఐ విశ్రాంతి ఇవ్వడంతో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ, వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్ లో ఇండియన్ టీమ్ ఆడనుంది.
జింబాబ్వేకు యంగిండియా
టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉన్న ముగ్గురు ప్లేయర్స్ మాత్రమే ఇప్పుడు జింబాబ్వే సిరీస్ లో ఆడనున్నారు. మిగతా వాళ్లంతా కొత్తవాళ్లే. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబె మాత్రమే ఈ టూర్ కు వెళ్లనున్నారు. వాళ్లు కాస్త ఆలస్యంగా జింబాబ్వేలో జట్టుతో చేరతారు. ఇక మంగళవారం (జులై 2) ఉదయం జింబాబ్వే బయలుదేరిన వాళ్లలో కోచ్ లక్ష్మణ్ తోపాటు అభిషేక్ శర్మ, ముకేశ్ కుమార్, రుతురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్, రియాన్ పరాగ్ లాంటి వాళ్లు ఉన్నారు.
మరోవైపు బార్బడోస్ లో తుఫాను వల్ల అక్కడే చిక్కుకుపోయిన ఇండియన్ టీమ్ ప్లేయర్స్.. బుధవారం రాత్రి వరకు ఢిల్లీకి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక జింబాబ్వే సిరీస్ విషయానికి వస్తే టీ20 వరల్డ్ కప్ లోని 15 మందిలో కేవలం ముగ్గురే ఈ పర్యటనకు వెళ్తున్నారు. రిజర్వ్ ప్లేయర్స్ గా ఉన్న ఖలీల్ అహ్మద్, రింకు సింగ్ కూడా ఆ ముగ్గురితో కలిసి జింబాబ్వేకు వెళ్తారు. నిజానికి దూబె మొదట జట్టులో లేకపోయినా.. నితీష్ కుమార్ రెడ్డి గాయపడటంతో అతనికి అవకాశం కల్పించారు.
ఆ ముగ్గురి రిటైర్మెంట్ తర్వాత..
టీ20 క్రికెట్ లో ముగ్గురు లెజెండరీ ప్లేయర్స్ కెరీర్ ముగిసిన తర్వాత జరుగుతున్న తొలి సిరీస్ ఇది. టీ20 వరల్డ్ కప్ గెలవగానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలాంటి వాళ్లు ఈ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యంగ్ ప్లేయర్స్ కు ఇది మంచి అవకాశం. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్‌పాండేలాంటి వాళ్లు తొలిసారి బ్లూ జెర్సీల్లో కనిపించబోతున్నారు.
ఇక హార్దిక్, సూర్యలాంటి వాళ్లు కూడా ఈ సిరీస్ ఆడబోమని చెప్పడంతో శుభ్‌మన్ గిల్ కు కెప్టెన్సీ అప్పగించారు. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ కు కెప్టెన్ గా ఉన్నా.. ఇండియన్ టీమ్ కు ఇదే తొలిసారి కానుంది. అతనితోపాటు రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ లాంటి వాళ్లు కూడా ఉండటంతో టాపార్డర్ స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. వరల్డ్ కప్ లో ఛాన్స్ దక్కని యశస్వి, సంజూలకు మాత్రం తుది జట్టులో కచ్చితంగా స్థానం కల్పించే అవకాశం ఉంది.
జింబాబ్వే సిరీస్‌కు టీమిండియా ఇదే
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజూ శాంసన్, ధృవ్ జురెల్, శివమ్ దూబె, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే