Team India Coach: టీమిండియా కోచ్ పదవిని తిరస్కరించిన మాజీ పేస్ బౌలర్.. ద్రవిడే కావాలంటూ..-team india coach nehra rejected rohit wants dravid to continue ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India Coach: టీమిండియా కోచ్ పదవిని తిరస్కరించిన మాజీ పేస్ బౌలర్.. ద్రవిడే కావాలంటూ..

Team India Coach: టీమిండియా కోచ్ పదవిని తిరస్కరించిన మాజీ పేస్ బౌలర్.. ద్రవిడే కావాలంటూ..

Hari Prasad S HT Telugu
Nov 29, 2023 01:47 PM IST

Team India Coach: టీమిండియా కోచ్ పదవిని మాజీ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ పదవిలో ద్రవిడే కొనసాగాలని కెప్టెన్ రోహిత్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ బలంగా కోరుకుంటున్నారు.

కోచ్ పదవి వద్దన్న నెహ్రా.. ద్రవిడే కావాలంటున్న రోహిత్
కోచ్ పదవి వద్దన్న నెహ్రా.. ద్రవిడే కావాలంటున్న రోహిత్

Team India Coach: టీమిండియా తర్వాతి హెడ్ కోచ్ ఎవరు? ఈ ప్రశ్నకు ఇప్పట్లో సమాధానం దొరికేలా కనిపించడం లేదు. వరల్డ్ కప్ 2023తో రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో తాత్కాలికంగా ఆ బాధ్యతలను ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మోస్తున్నాడు. అయితే తర్వాతి హెడ్ కోచ్ కోసం బీసీసీఐ వేట కొనసాగిస్తూనే ఉంది.

నో చెప్పిన నెహ్రా

టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం మాజీ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రాను బీసీసీఐ సంప్రదించినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. ఐసీఎల్లో గుజరాత్ టైటన్స్ హెడ్ కోచ్ గా 2022లో టైటిల్ అందుకోవడంతోపాటు 2023లో ఫైనల్ వరకూ చేర్చాడు. దీంతో కనీసం టీ20 ఫార్మాట్లో అయినా టీమిండియా హెడ్ కోచ్ గా ఉండాలని బోర్డు అతన్ని కోరింది.

కానీ నెహ్రా మాత్రం అందుకు అంగీకరించలేదు. ద్రవిడ్ పదవీ కాలం ముగిసిన వెంటనే అంటే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత బోర్డు నేరుగా నెహ్రానే సంప్రదించినట్లు ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఒకవేళ నెహ్రా అందుకు అంగీకరించి ఉంటే టీ20ల్లో అతన్ని కోచ్ ను చేసి.. వన్డే, టెస్టు ఫార్మాట్లకు మరో వ్యక్తిని నియమించాలని బీసీసీఐ భావించింది.

ద్రవిడే కావాలంటున్న రోహిత్, అగార్కర్

మరోవైపు రాహుల్ ద్రవిడే టీమిండియా హెడ్ కోచ్ గా కొనసాగాలని కెప్టెన్ రోహిత్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడుతున్నారు. కనీసం వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ముగిసే వరకైనా ద్రవిడ్ ఉంటే బాగుంటుందని వాళ్లు స్పష్టం చేశారు. దీంతో బీసీసీఐ మరోసారి ద్రవిడ్ ను కూడా కొనసాగాల్సిందిగా కోరింది. అయితే అతడు దానికి అంగీకరించలేదు.

టీమిండియా హెడ్ కోచ్ అంటే ఏడాది మొత్తం ఏదో ఒక చోటికి తిరగాల్సి వస్తూనే ఉంటుంది. దీని కారణంగా ఫ్యామిలీకి తగినంత సమయం ఇవ్వలేకపోతున్నట్లు ద్రవిడ్ భావిస్తున్నాడు. పైగా అతనికి ఇప్పటికే ఐపీఎల్ టీమ్స్ లక్నో, రాజస్థాన్ నుంచి హెడ్ కోచ్ ఆఫర్లు కూడా వచ్చాయి. వీటిలో ఒక దానికి ఓకే చెబితే.. కేవలం ఐపీఎల్ సీజన్లో బిజీగా ఉండి ఏడాది మొత్తం ఫ్యామిలీతో గడపొచ్చన్నది ద్రవిడ్ ప్లాన్ గా కనిపిస్తోంది.

లక్ష్మణ్ సంగతేంటి?

ద్రవిడ్ కోచ్ అయిన తర్వాత కూడా అప్పుడప్పుడూ తాత్కాలికంగా కోచ్ బాధ్యతలు మోస్తున్న లక్ష్మణ్ ను కూడా హెడ్ కోచ్ చేయొచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఒకవేళ టీ20లకు నెహ్రా ఓకే చెప్పి ఉంటే.. వన్డే, టెస్టులకు లక్ష్మణ్ ను నియమించేవారు. ప్రస్తుతం అతడు ఎన్సీఏ డైరెక్టర్ గా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు కూడా కోచ్ గా ఉన్నాడు.

ప్రస్తుతం టీమ్ లో ఉన్న ప్లేయర్స్ తో లక్ష్మణ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో అతడు కూడా మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి సౌతాఫ్రికా టూర్ కి కూడా లక్ష్మణ్ ని హెడ్ కోచ్ గా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఆ టూర్ ముగిసేలోపు శాశ్వత హెడ్ కోచ్ విషయంలో బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోవచ్చు.

Whats_app_banner