Nehra: వాళ్లు ఆడాలనుకుంటే అది పెద్ద విషయమే కాదు: రోహిత్, కోహ్లీ టీ20 ప్రపంచకప్ ఆడే అంశంపై నెహ్రా కామెంట్స్
Nehra on Rohit Sharma, Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‍లో కొనసాగుతారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఈ విషయంపై భారత మాజీ పేసర్ అశిష్ నెహ్రా స్పందించారు.
Nehra on Rohit Sharma, Virat Kohli: సొంతగడ్డపై ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‍లో టీమిండియా ఫైనల్‍లో ఓడింది. అజేయంగా తుదిపోరులోకి అడుగుపెట్టి ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది. ఇక తదుపరి టీమిండియా ప్రధాన లక్ష్యం వచ్చే ఏడాది జూన్‍లో జరిగే టీ20 ప్రపంచకప్. అయితే, టీ20 ఫార్మాట్‍లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కొనసాగుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్ తరఫున రోహిత్, కోహ్లీ టీ20 మ్యాచ్‍లు ఆడలేదు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేస్తున్నాడు. అలాగే, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‍కు కూడా రోహిత్, కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.

హార్దిక్ పాండ్యాకు కూడా గాయమవడంతో ఆస్ట్రేలియాతో స్వదేశంలో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‍కు సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు కెప్టెన్సీ చేస్తున్నాడు. టీ20ల్లో సీనియర్ల గైర్హాజరీలో యశస్వి జైస్వాల్, రుతురాజ్, గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇక టీమిండియా తరఫున టీ20లు ఆడబోరన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీ20 ఆడే విషయంపై నిర్ణయాన్ని బీసీసీఐ.. వారికే వదిలేసిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్ కోసం యువ ఆటగాళ్లపైనే దృష్టి సారిస్తుందని తెలుస్తోంది. ఈ తరుణంలో టీ20 ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే అంశంపై టీమిండియా మాజీ పేసర్ అశిష్ నెహ్రా స్పందించాడు.
ఒకవేళ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. 2024 టీ20 ప్రపంచకప్ ఆడాలనుకుంటే వారికి వయసు అనేది పెద్ద విషయమే కాదని నెహ్రా అభిప్రాయపడ్డాడు. పొట్టి ప్రపంచకప్‍కు వారిని ఎంపిక చేసేందుకు వయసు అంశంగా ఉండదని అన్నాడు. 36ఏళ్లు దాటినా రోహిత్ శర్మను యువకుడిగానే పరిగణిస్తానని నెహ్రా చెప్పారు.
“వయసు అనేది పెద్ద అంశం కాదు. ఎన్ని పరుగులు చేస్తున్నామన్నదే ముఖ్యం. మనం యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‍మన్ గిల్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఒకవేళ రోహిత్ శర్మ ఆడాలనుకుంటే.. వారు అతడితో పోటీ పడాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ 36 ఏళ్ల సూపర్ యంగ్‍స్టర్. భయం లేని ఆటగాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాలంటే ప్రపంచకప్ చాలా దూరంలో ఉంది. ఒకవేళ వాళ్లు ఆడాలనుకుంటే.. మంచి స్కోర్లు చేస్తుంటే.. తుదిజట్టులో చోటు దక్కించుకునేందుకు యువ ఆటగాళ్లు వారితో పోటీ పడాల్సి ఉంటుంది” అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెహ్రా చెప్పాడు.
ఐపీఎల్‍లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాగా రాణిస్తున్నారని, అందుకే టీ20ల కోసం సెలెక్టర్లు వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అనుకుంటారని నెహ్రా చెప్పాడు. “వన్డే ప్రపంచకప్‍లో ఓటమి ప్రభావం ఉండదు. వారు ఎలా ఆలోచిస్తున్నారన్నదే ముఖ్యం. ఐపీఎల్‍లో విరాట్ కోహ్లీ బాగా రన్స్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. వాళ్లు రిటైర్మెంట్ (టీ20లకు) ప్రకటించే వరకు వారిని తీసుకోవాలని ఏ సెలెక్టర్ అయినా అనుకుంటాడు. వారి రిటైర్మెంట్ ఇప్పట్లో ఉండదని నేను ఆశిస్తున్నా” అని నెహ్రా చెప్పాడు.
సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణలకు తప్ప వన్డే ప్రపంచకప్ జట్టులో ఉన్న ఆటగాళ్లందరికీ ఆస్ట్రేలియాతో ప్రస్తుత ఐదు టీ20ల సిరీస్‍లో విశ్రాంతి ఇచ్చారు సెలెక్టర్లు. ఈ సిరీస్‍లో భారత్‍కు సూర్య కెప్టెన్సీ చేస్తున్నాడు. తొలి టీ20లో టీమిండియా గెలిచింది. రెండో టీ20 నవంబర్ 26న జరగనుంది.
ఇక, 2024 టీ20 ప్రపంచకప్ వచ్చే ఏడాది జూన్ 4వ తేదీన నుంచి జూన్ 30 వరకు వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగనుంది. తుది షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది.