Dravid on Team India: టీమ్‌లో అందరూ కంటతడి పెట్టారు.. వాళ్లనలా చూడలేకపోయాను: కోచ్ ద్రవిడ్
Dravid on Team India: వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓడిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో అందరూ కంటతడి పెట్టారని, వాళ్లనలా చూడలేకపోయానని కోచ్ రాహుల్ ద్రవిడ చెప్పాడు.
Dravid on Team India: ఏది జరగకూడదని టీమిండియా అభిమానులు బలంగా కోరుకున్నారో అదే జరిగింది. వరల్డ్ కప్ 2023లో ఫైనల్ వరకూ ఓటమెరగని జట్టుగా దూసుకొచ్చిన ఇండియన్ టీమ్.. చివరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియా చేతుల్లో ఫైనల్ ఓడిన తర్వాత ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లో అందరు ప్లేయర్స్ కంటతడి పెట్టారని, వాళ్లనలా చూడలేకపోయానని కోచ్ ద్రవిడ్ చెప్పాడు.

ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఇండియాను 6 వికెట్లతో చిత్తు చేసి మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ ఫైనల్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ప్లేయర్స్ పరిస్థితిని కోచ్ ద్రవిడ్ వివరించాడు. వాళ్లెంతో కష్టపడ్డారని, చివరకు ఇలా జరగడంతో తీవ్రంగా నిరాశ చెందారని అతడు చెప్పాడు.
ఎన్నో త్యాగాలు చేశారు.. అయినా: ద్రవిడ్
"రోహిత్ నిరాశ చెందాడు. డ్రెస్సింగ్ రూమ్ లో అందరి పరిస్థితి అలాగే ఉంది. డ్రెస్సింగ్ రూమ్ లో అందరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఓ కోచ్ గా వాళ్లనలా చూడటం కష్టంగా అనిపించింది. ఎందుకంటే వాళ్లు ఎంత కష్టపడ్డారు, ఎన్ని త్యాగాలు చేశారో నాకు తెలుసు.
ఇది చాలా కష్టమైన సమయం. ఓ కోచ్ గా ఇది నాకు కూడా కష్టమే. ఈ ప్లేయర్స్ అందరనీ వ్యక్తిగతంగా నేను చూశాను. వాళ్లు నెల రోజులుగా ఎలా కష్టపడ్డారు, ఎలాంటి క్రికెట్ ఆడారో నేను చూశారు. కానీ ఆట అంటే ఇదే కదా. ఇలా జరుగుతూనే ఉంటాయి. మంచి టీమ్ ఆ రోజు గెలుస్తుంది. రేపు మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడు. మేము దీని నుంచి నేర్చుకుంటాం.
మళ్లీ పోరాడతాం. మేమూ ముందుడుగు వేస్తాం. అందరూ వేస్తారు. ఓ క్రీడాకారుడిగా అదే చేయాలి. స్పోర్ట్స్ లో గొప్ప విజయాలు, దారుణమైన పరాజయాలు చూస్తూనే ఉంటాం. అయినా అవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉండాలి. ఆగిపోకూడదు. ఆటలో ఎత్తుపల్లాలు తెలుసుకోలేకపోతే ఏమీ నేర్చుకోలేం" అని మ్యాచ్ తర్వాత ద్రవిడ్ చెప్పాడు.
2007లో తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు టీమిండియా తొలి రౌండ్లో ఇంటిదారి పట్టి ఘోర అవమానాన్ని చవిచూసింది ఆ క్షణాలను కూడా ఈ సందర్భంగా ద్రవిడ్ గుర్తు చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ముందు కేవలం 241 పరుగుల లక్ష్యాన్ని ఉంచినప్పుడే చాలా మంది ఆశలు వదిలేసుకున్నారు. అయితే షమి, బుమ్రా చెలరేగి ఆస్ట్రేలియాను 47 పరుగులకే 3 వికెట్లతో కట్టి చేసినప్పుడు మళ్లీ ఆశలు రేగాయి. కానీ హెడ్, లబుషేన్ ట్రోఫీని ఇండియా నుంచి లాగేసుకున్నారు.