India vs Australia: మ్యాక్స్‌వెల్ సూపర్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో చేజేతులా ఓడిన భారత్
India vs Australia 3rd T20: బ్యాటర్ గ్లెన్స్ మ్యాక్స్‌వెల్ అద్భుత సెంచరీ చేసి ఆస్ట్రేలియాను గెలిపించాడు. ఒత్తిడికి గురైన భారత్ చేజేతులా మ్యాచ్‍ను చేజార్చుకుంది. ఈ గెలుపుతో సిరీస్‍లో సజీవంగా నిలిచింది ఆసీస్.
India vs Australia 3rd T20: ఉత్కంఠ పోరులో ఒత్తిడికి గురైన టీమిండియా మూడో టీ20లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. స్టార్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (48 బంతుల్లో 104 పరుగులు నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో అజేయ సూపర్ సెంచరీ చేసి ఆసీస్‍ను గెలిపించాడు. చివరి బంతికి ఆస్ట్రేలియా గట్టెక్కింది. జట్టుకు విజయం ఖాయమనుకున్న దశలో భారత యువ బౌలర్లు పేలవ బౌలింగ్ వేయడంతో చేజేతులా ఓటమి ఎదురైంది. చివరి రెండు ఓవర్లలో విజయానికి ఆసీస్ 43 పరుగులు చేయాల్సి ఉండగా.. మ్యాక్సీ, మాథ్యువేడ్ దాన్ని సాధించారు. దీంతో ఐదు టీ20ల సిరీస్‍లో ఆసీస్ తొలి విజయం సాధించి.. 1-2తో సజీవంగా నిలిచింది. గౌహతి వేదికగా నేడు (అక్టోబర్ 28) జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.
223 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా చివరి వరకు పోరాడి.. గెలిచింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత అజేయ శతకం చేయడంతో పాటు చివర్లో కెప్టెన్ మాథ్యు వేడ్ (16 బంతుల్లో 28 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసి ఆసీస్ గెలిచింది. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా.. ఫోర్ కొట్టాడు మ్యాక్సీ. చివరి ఓవర్లో 22 పరుగులు అవసరం కాగా.. భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ చేశాడు. ముందుగా వేడ్ ఓ ఫోర్ బాది సింగిల్ తీయగా.. మ్యాక్స్‌వెల్ చివరి నాలుగు బంతుల్లో ఓ సిక్సర్, వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఆసీస్‍ను గెలిపించాడు. ఈ క్రమంలో 47 బంతుల్లోనే సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు మ్యాక్సీ. స్లో ఓవర్ రేట్ కూడా భారత్‍కు ప్రతికూలంగా మారింది.
భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీయగా.. అర్షదీప్, అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 19వ ఓవర్లో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ 22 పరుగులు ఇచ్చేశాడు.
రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 123 పరుగులు; నాటౌట్) అజేయ మెరుపు శతకం చేయడంతో ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జేసన్ బెహరండాఫ్, ఆరోన్ హార్జీ, రిచర్డ్ సన్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‍లో భారీ స్కోరును కూడా భారత్ కాపాడుకోలేకపోయింది.
ఈ ఐదు టీ20ల సిరీస్‍లో తొలి రెండు మ్యాచ్‍లు గెలిచింది భారత్. ఇప్పుడు మూడో మ్యాచ్‍లో ఆసీస్ విజయం సాధించింది. దీంతో ఇప్పటికీ 2-1తో టీమిండియా ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 శుక్రవారం (డిసెంబర్ 1) జరగనుంది.
సంబంధిత కథనం