Ruturaj Gaikwad: రఫ్ఫాడించిన రుతురాజ్.. అద్భుత శతకంతో చరిత్ర: భారత్ భారీ స్కోరు
IND vs AUS 3rd ODI - Ruturaj Gaikwad: ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ దుమ్మురేపాడు. ధనాధన్ బ్యాటింగ్‍తో సెంచరీ చేశాడు. దీంతో టీమిండియాకు భారీ స్కోరు దక్కింది.

IND vs AUS 3rd ODI - Ruturaj Gaikwad: భారత యంగ్ స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తన మార్క్ స్టైలిష్ హిట్టింగ్‍తో రప్ఫాడించాడు. గౌహతి మైదానంలో బ్యాటింగ్ విధ్వంసం చేసి అజేయ సెంచరీతో కదం తొక్కాడు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 57 బంతుల్లో 7 సిక్సర్లు, 13 ఫోర్లు బాదిన రుతురాజ్ గైక్వాడ్ 123 పరుగులు (నాటౌట్) చేశాడు. దీంతో ఆస్ట్రేలియాతో నేడు (నవంబర్ 28) జరుగుతున్న మూడో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు చేసింది.
రుతురాజ్ గైక్వాడ్ శతకంతో రెచ్చిపోగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 39 పరుగులు) అదరగొట్టాడు. చివర్లో తిలక్ వర్మ (24 బంతుల్లో 31 పరుగులు నాటౌట్) రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్ సన్, జేసన్ బెహరండాఫ్, ఆరోనా హార్డీ చెరో వికెట్ తీసుకున్నారు. ఆస్ట్రేలియా ముందు 223 పరుగుల భారీ టార్గెట్ ఉంది.
చరిత్ర సృష్టించిన రుతురాజ్
భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6), ఇషాన్ కిషన్ (0) విఫలమవడంతో ఓ దశలో భారత్ 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో తొలుత నిలకడగా ఆడిన రుతురాజ్ గైక్వాడ్.. ఆ తర్వాత టాప్ గేర్‌లో హిట్టింగ్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కళాత్మక షాట్లతోనే ఫోర్లు, సిక్సర్లు బాదాడు. 52 బంతుల్లోనే శతకానికి చేరాడు రుతురాజ్. ఆస్ట్రేలియాపై టీ20ల్లో శతకం చేసిన తొలి భారత బ్యాటర్‌గా రుతురాజ్ చరిత్ర సృష్టించాడు. అలాగే, అంతర్జాతీయ టీ20ల్లో రుతురాజ్ గైక్వాడ్‍కు ఇది తొలి సెంచరీ.
ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో చెలరేగాడు రుతురాజ్ గైక్వాడ్. దీంతో చివరి ఓవర్లో మ్యాక్స్‌వెల్ 30 పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ మ్యాచ్‍లో ఓ దశలో 21 బంతుల్లో 21 పరుగులే చేశాడు రుతురాజ్ గైక్వాడ్. ఆ తర్వాత జూలు విదిల్చాడు. ఆ తర్వాతి 36 బంతుల్లోనే 102 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు తన హిట్టింగ్ రుచిచూపించాడు. రుతురాజ్‍కు కెప్టెన్ సూర్యకుమార్, తిలక్ వర్మ సహకరించారు. రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర సెంచరీతో టీమిండియా 222 పరుగుల భారీ స్కోరు చేసింది.