T20 Rankings: టీ20ల్లో హార్దిక్ పాండ్యా నంబర్ వన్ ఆల్ రౌండర్.. మంచి ర్యాంకులతో ముగించిన కోహ్లి, రోహిత్
T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ లో తొలిసారి ఓ ఇండియన్ ప్లేయర్ నంబర్ వన్ ఆల్ రౌండర్ అయ్యాడు. ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు.
T20 Rankings: టీ20 వరల్డ్ కప్ భారత్ గెలిచిన నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తన కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. టోర్నమెంట్ లో 144 పరుగులు, 11 వికెట్లు తీసిన హార్దిక్.. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో తాజా ర్యాంకుల్లో ఆల్ రౌండర్లలో అగ్రస్థానానికి చేరుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు.
టీ20 ర్యాంకింగ్స్
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ వికెట్లను పడగొట్టిన హార్దిక్ రెండు స్థానాలు ఎగబాకి వనిందు హసరంగను రెండో స్థానానికి నెట్టాడు. గాయం కారణంగా 2023లో జరిగిన వరల్డ్ కప్ కు దూరమైన హార్దిక్ కు ఇది చిరస్మరణీయం. టీ20 వరల్డ్ కప్ బరిలోకి దిగే ముందు అతనికి నిరాశే ఎదురైంది. ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా ఆ ఫ్రాంచైజీ ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమవడంతో అతను గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాడు.
కానీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇండియన్ టీమ్ లోకి తిరిగి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా ఫైనల్లో అతడు కీలక సమయంలో రాణించాడు. క్లాసెన్ హాఫ్ సెంచరీ సాధించి కావాల్సిన స్కోరును 30 బంతుల్లో 30 పరుగులకు తగ్గించాడు. అప్పటికే బుమ్రా ఓవర్లు పూర్తి కావడంతో చివరి ఓవర్ హార్దిక్ వేయాల్సి వచ్చింది. తొలి బంతికే సూర్యకుమార్ అద్భుతమైన క్యాచ్ తో మిల్లర్ ను ఔట్ చేయడంతో ఇండియా విజయం ఖాయమైంది. కప్పు గెలిచిన తర్వాత హార్దిక్ తన దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు.
ఇండియా ఫైనల్ కు చేరడంలో సాయం చేయడంతోపాటు టోర్నమెంట్ మొత్తం హార్దిక్ కీలక ప్రదర్శన చేశాడు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ 2/24తో రాణించాడు. ఫకార్ జమాన్, షాదాబ్ ఖాన్ లను ఔట్ చేశాడు. ఇక అమెరికాపై 2/14తో రాణించాడు. బంగ్లాపై అజేయ హాఫ్ సెంచరీ చేసిన హార్దిక్.. ఆస్ట్రేలియాపై 23 నాటౌట్, ఇంగ్లండ్ పై 23 పరుగులు చేశాడు.
బుమ్రా, కుల్దీప్ ర్యాంకులు ఇలా..
బౌలర్లలో 15 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికైన జస్ప్రీత్ బుమ్రా 12 స్థానాలు ఎగబాకి 11వ స్థానంలో నిలిచాడు. నిజం చెప్పాలంటే, దీనికి అతనికి మించిన అర్హుడు ఎవరూ లేరు. టీ20 ప్రపంచకప్ ఇండియా గెలిచిందంటే దానికి కారణం అతడే అనడంలో సందేహం లేదు.
పాకిస్థాన్ పై 3/14తో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా.. అమెరికాతో జరిగిన మ్యాచ్ ను మినహాయిస్తే తన పదునైన లైన్, లెంగ్త్, పేస్ తో బ్యాట్స్ మెన్ ను కట్టడి చేస్తూనే ఉన్నాడు. ఫైనల్లో రీజా హెండ్రిక్స్ ను క్లీన్ బౌల్డ్ చేసి వికెట్ల పతనం మొదలుపెట్టాడు. తర్వాత మార్కో యాన్సెస్ ను కూడా ఔట్ చేశాడు.
కుల్దీప్ యాదవ్ కూడా 10 వికెట్లు పడగొట్టి సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఫైనల్లో భారత హీరోల్లో ఒకరైన అర్ష్‌దీప్ సింగ్ 13వ స్థానానికి ఎగబాకాడు. ఇక టీ20ల నుంచి రిటైరైన విరాట్ కోహ్లి 40వ స్థానంలో, రోహిత్ శర్మ 36వ స్థానంలో నిలిచారు.