Suresh Raina in IVPL: సురేష్ రైనా వచ్చేస్తున్నాడు.. మరోసారి ఎల్లో జెర్సీలోనే స్టార్ ప్లేయర్
Suresh Raina in IVPL: టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (ఐవీపీఎల్)లో ఆడబోతున్నాడు. ఐపీఎల్లో తనకు ఎంతో కలిసొచ్చిన ఎల్లో జెర్సీలోనే యూపీ టీమ్ ను రైనా లీడ్ చేయబోతుండటం విశేషం.
Suresh Raina in IVPL: ఒకప్పుడు టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక ప్లేయర్ గా ఉన్న సురేష్ రైనా మరోసారి క్రికెట్ ఫీల్డ్ లో అడుగు పెట్టబోతున్నాడు. ఈసారి ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (ఐవీపీఎల్)లో భాగంగా అతు వీవీఐపీ ఉత్తర ప్రదేశ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అయితే ఈ టీమ్ కు కూడా రైనా ఎల్లో జెర్సీలో బరిలోకి దిగనుండటం అసలు విశేషం.
సురేష్ రైనా ఈజ్ బ్యాక్
సురేష్ రైనా ఎన్నో ఏళ్ల పాటు ఇటు ఇండియన్ క్రికెట్ టీమ్ కు, అటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు సేవలందించాడు. మిస్టర్ ఐపీఎల్ గా అభిమానులు పిలుచుకున్నారంటూ ఈ మెగా లీగ్ పై అతడు వేసిన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్లేయర్ ఇప్పుడు ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (ఐవీపీఎల్)లో భాగంగా యూపీ జట్టుకు ఆడుతున్నాడు.
ఈ టీమ్ కు వీవీఐపీ ఉత్తర ప్రదేశ్ అనే పేరు పెట్టారు. ఈ లీమ్ కెప్టెన్ రైనానే. ఎల్లో జెర్సీ వేసుకొనే లీగ్ ఆడబోతున్నాడు. ఇండియాలోని బెస్ట్ టీ20 క్రికెటర్లలో ఒకడిగా పేరుగాంచిన రైనా.. ఇప్పుడు మరోసారి ఈ వెటరన్ లీగ్ లో ఎలా ఆడబోతున్నాడో అన్న ఆసక్తి నెలకొంది. తాను ఐవీపీఎల్లో ఆడుతున్న విషయాన్ని రైనానే ఎక్స్ ద్వారా వెల్లడించాడు.
"అందరికీ హలో.. నేను సురేష్ రైనా. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ లో భాగం పంచుకుంటున్నందుకు చాలా థ్రిల్లింగా ఉంది. నేను వీవీఐపీ ఉత్తర ప్రదేశ్ జట్టుకు ఆడుతున్నాను. వెటరన్ క్రికెటర్లు ఆడేందుకు ఇదొక అవకాశం" అని రైనా అన్నాడు. ఈ వీవీఐపీ ఉత్తర ప్రదేశ్ లో రైనాతోపాటు ఆస్ట్రేలియా టీమ్ మాజీ ఆల్ రౌండర్ డాన్ క్రిస్టియన్ కూడా ఆడనున్నాడు.
ఐవీపీఎల్ ఏంటి?
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (ఐవీపీఎల్) ను బోర్డ్ ఫర్ వెటరన్ క్రికెట్ ఇన్ ఇండియా (బీవీసీఐ) నిర్వహిస్తోంది. ఈ లీగ్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 మధ్య డెహ్రాడూన్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ ఐవీపీఎల్ ద్వారా ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ ను శాసించిన సెహ్వాగ్, రైనా, క్రిస్ గేల్, యూసుఫ్ పఠాన్, హెర్షలీ గిబ్స్ లాంటి ఎందరో మాజీలు మళ్లీ ఫీల్డ్ లో కనిపించనున్నారు.
ఈ ఐవీపీఎల్లో మొత్తం ఆరు టీమ్స్ పాల్గొంటున్నాయి. అందులో తెలంగాణ టైగర్స్ కూడా ఒకటి. ఈ జట్టుకు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కెప్టెన్ గా ఉండటం విశేషం. ఈ మధ్యే ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ టైగర్స్ తోపాటు వీవీఐపీ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, చత్తీస్‌గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టులో ఒకప్పుడు వరల్డ్ క్రికెట్ లో తమకంటూ ఓ పేరు సంపాదించిన పెద్ద పెద్ద ప్లేయర్స్ కనీసం నలుగురైదుగురు ఉండనున్నారు. ఈ లీగ్ పై క్రికెట్ అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది.