Wanindu Hasaranga: శ్రీలంక కెప్టెన్ హసరంగపై రెండు మ్యాచ్‍ల బ్యాన్.. కారణమిదే..
Wanindu Hasaranga: శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగపై రెండు మ్యాచ్‍ల బ్యాన్ పడింది. అఫ్గానిస్థాన్‍తో మ్యాచ్ సందర్భంగా చేసిన చర్య వల్ల అతడు వేటుకు గురయ్యాడు. వివరాలివే..
Wanindu Hasaranga: శ్రీలంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగపై వేటు పడింది. అతడిపై రెండు మ్యాచ్‍ల నిషేధం విధించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). అఫ్గానిస్థాన్‍తో జరిగిన మూడో టీ20 సందర్భంగా అంపైర్‌పై దురుసు వ్యాఖ్యలు చేసిన హసరంగపై రెండు మ్యాచ్‍ల బ్యాన్ విధిస్తూ నిర్ణయం ప్రకటించింది ఐసీసీ. ఏం జరిగిందంటే..
మూడో టీ20 లక్ష్యఛేదన చివరి ఓవర్లో గెలుపునకు శ్రీలంకకు 19 పరుగులు అవసరం కాగా.. ఆ ఓవర్లో హై నోబాల్ విషయంలో అంపైర్‌పై నోరు పారేసుకున్నాడు హసరంగ. అఫ్గానిస్థాన్ పేసర్ వాఫదార్ మహమ్మద్.. క్రీజులో ఉన్న శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్‍కు ఫుల్ టాస్ బాల్ వేశాడు. అయితే, అంపైర్ లిండాన్ హనిబాల్ దాన్ని నోబాల్‍గా ఇవ్వలేదు. అయితే, రిప్లేలో ఆ ఫుల్ టాస్.. కమిందు నడుము కంటే ఎత్తుగానే వెళ్లినట్టు కనిపించింది. దీంతో నోబాల్ ఇవ్వని అంపైర్‌పై హసరంగ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వేరే జాబ్ చేసుకుంటే బెస్ట్!
మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఆ ఫుల్ టాస్ గురించే చిరాకు వ్యక్తం చేశాడు హసరంగ. ఈ క్రమంలో అంపైరింగ్ కాకుండా వేరే జాబ్ చూసుకోవాలని హనిబాల్‍ను అతడు దూషించినట్టు క్రిక్ ఇన్ఫో రిపోర్ట్ వెల్లడించింది.
“ఒకవేళ మీరు అది గుర్తించలేకపోతే.. అలాంటి అంపైర్ అంతర్జాయ క్రికెట్‍కు సరిపోరు. అతడు వేరే జాబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది” అని హసరంగ అంపైర్‌ను ఉద్దేశించి అన్నాడని తెలిసింది. ఫిబ్రవరి 21వ తేదీన జరిగిన మ్యాచ్‍లో ఈ ఘటన జరగగా.. దీనిపై విచారణ చేసిన ఐసీసీ శనివారం ఈ విషయంపై నిర్ణయం తీసుకుంది. అంపైర్‌ను దూషించిన హసరంగపై రెండు మ్యాచ్‍ల వేటు వేసింది.
ఈ మూడో టీ20లో చివరి బంతికి మెండిస్ సిక్సర్ కొట్టినా.. శ్రీలంక గెలువలేకపోయింది. 3 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ విజయం సాధించింది. అయితే, సిరీస్‍ను 2-1 తేడాతో శ్రీలంక కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోరు చేసింది. రహ్మనుల్లా గుర్బాజ్ (70) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. హజ్మతుల్లా జజాజ్ (45) దుమ్మురేపాడు. ఆ తర్వాత ఇబ్రహీం జర్దాన్ (10) త్వరగానే ఔటైనా.. అజ్ముతుల్లా ఒమర్జాయ్ (31) కాసేపు అదరగొట్టాడు. చివర్లో మహ్మద్ ఇషాక్ (16 నాటౌట్) మెరిపించడంతో అఫ్గాన్ మంచి స్కోరు చేసింది. శ్రీలంక బౌలర్లు మతీష పతిరణ, అఖిల ధనంజయ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
భారీ లక్ష్యఛేదనలో శ్రీలంక చివరి వరకు పోరాడింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక (60) మెరుపు అర్ధ శతకం చేశాడు. కమిందు మెండిస్ (65 నాటౌట్) అద్భుత పోరాటంతో చివరి వరకు నిలిచాడు. అయితే గెలిపించలేకపోయాడు. కుషాల్ పెరీరా (2), హసరంగ (13) అంజెలో మాథ్యూస్ (4) విఫలమయ్యారు. కమిందు చివరి వరకు పోరాడినా ఉత్కంఠ పోరులో అఫ్గాన్ గెలిచింది. 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేయగలిగింది లంక. అఫ్గానిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ నబీ రెండు వికెట్లతో రాణించాడు.