Shakib Al Hasan Win: లక్షన్నర ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచిన బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ కెప్టెన్
Shakib Al Hasan Win: బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ షకీబల్ హసన్ ఆ దేశ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచాడు. అతడు ఏకంగా లక్షన్నర ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం.
Shakib Al Hasan Win: బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ కు కెప్టెన్ గా ఉంటూనే రాజకీయాల్లోకి వెళ్లి అక్కడి అధికార అవామీ లీగ్ పార్టీలో చేరిన షకీబల్ హసన్ ఇప్పుడు ఎంపీ అయ్యాడు. ఆ దేశ పార్లమెంట్ ఎన్నికల్లో షకీబ్ ఘన విజయం సాధించాడు. మాగురా అనే నియోజకవర్గం నుంచి నిలబడిన అతనికి ఎన్నికల్లో 185,388 ఓట్లు రావడం విశేషం.
తన సమీప ప్రత్యర్థిపై షకీబల్ హసన్ ఏకంగా లక్షా 50 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. ప్రతిపక్షాలు బాయ్‌కాట్ చేసిన ఈ ఎన్నికల్లో ఆవామీ లీగ్ మరోసారి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. షేక్ హసీనా మరోసారి బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు. ఆవామీ లీగ్ ఆ దేశంలోని మొత్తం 300 స్థానాలకుగాను 223 స్థానాల్లో విజయం సాధించింది.
ఐదోసారి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని కావడం గమనార్హం. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించింది. దీంతో అధికార పార్టీకి అసలు ఎదురే లేకుండా పోయింది. ఆదివారం (జనవరి 7) బంగ్లాదేశ్ లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. క్రికెట్ లో యాక్టివ్ గా ఉండగానే షకీబ్.. రాజకీయాల్లోకి వెళ్లడం విశేషం.
ఈ మధ్యే అతడు ఆవామీ లీగ్ లో చేరాడు. ఎన్నికల్లో అతడు సిక్స్ కొట్టాలని ప్రధాని షేక్ హసీనా అన్నారు. ఆమె అన్నట్లుగానే అతడు బంపర్ మెజార్టీతో ఎంపీగా గెలిచాడు. 1971లో తూర్పు పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ గా అవతరించిన ఆ దేశంలో ఇవి 12వ సాధారణ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే షకీబ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు.
అతడు ఓ అభిమానిపై చేయి చేసుకున్న వీడియో వైరల్ అయింది. షకీబ్ గెలుపు సంబరాలు చేసుకుంటున్న సమయంలో అభిమానులందరూ అతని చుట్టూ గుమిగూడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వెనుక నుంచి పదేపదే మీద పడుతుండటంతో షకీబ్ అతనిపై చేయి చేసుకున్నాడు. ఆ వెనుకాలే ఉన్న వ్యక్తి ఈ వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక అతని క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. 2006లో 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఓ బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా అతడు బంగ్లాదేశ్ టీమ్ లో చోటు సంపాదించాడు. ఐసీసీ ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో అన్ని ఫార్మాట్లలోనూ నంబర్ వన్ గా నిలిచిన ఏకైక ప్లేయర్ షకీబల్ హసన్. అతడు కొన్నాళ్ల పాటు క్రికెట్ కు దూరంగా ఉండి ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నాడు. తాను క్రికెట్ నుంచి రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు.
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ వరకూ అతడు బంగ్లాదేశ్ టీమ్ లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. గతేడాది ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ లో షకీబ్ ఆడాడు. అయితే బంగ్లా టీమ్ మాత్రం దారుణమైన ప్రదర్శనతో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత మాత్రం సాధించగలిగింది.