Shakib vs Mathews: అతడు శ్రీలంకకు వస్తే రాళ్లతో కొడతాం: షకీబ్‌కు మాథ్యూస్ సోదరుడి వార్నింగ్
Shakib vs Mathews: అతడు శ్రీలంకకు వస్తే రాళ్లతో కొడతాం అని షకీబ్‌కు మాథ్యూస్ సోదరుడు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. వరల్డ్ కప్ లో శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ లో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
Shakib vs Mathews: వరల్డ్ కప్ 2023లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్, శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ మధ్య వివాదం ఎంత దుమారం రేపిందో తెలుసు కదా. షకీబ్ చేసిన పనికి అంతర్జాతీయ క్రికెట్ లో టైమ్డ్ ఔట్ అయిన తొలి బ్యాటర్ గా మాథ్యూస్ నిలిచాడు. దీనిపై తాజాగా మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ మాథ్యూస్ తీవ్రంగా స్పందించాడు.
అసలు షకీబల్ హసన్ ను శ్రీలంకలో అడుగుపెట్టనీయమని, ఒకవేళ వచ్చినా రాళ్లతో కొడతామని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. మాథ్యూస్ సోదరుడు చేసిన ఈ హెచ్చరిక ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. "మాకు చాలా నిరాశ కలిగింది. బంగ్లాదేశ్ కెప్టెన్ కు అసలు క్రీడాస్ఫూర్తి లేదు. జెంటిల్మన్ గేమ్ లో కనీస మానవత్వం చూపలేదు. షకీబ్ ను శ్రీలంకకు రానివ్వం.
ఒకవేళ అంతర్జాతీయ మ్యాచ్ లేదంటే లంక ప్రీమియర్ లీగ్ లో ఆడటానికి అతడు ఇక్కడికి వచ్చినా.. అతనిపై రాళ్లు విసురుతాం. లేదంటే అభిమానుల నుంచి అతడు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటాడు" అని ట్రెవిన్ మాథ్యూస్ అనడం గమనార్హం.
డెక్కన్ క్రానికల్ తో మాట్లాడుతూ ట్రెవిన్ ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఊహించని ఘటన జరిగింది. సమరవిక్రమ ఔటైన తర్వాత మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే తాను తీసుకొచ్చిన హెల్మెట్ విరిగిపోవడం గమనించని మాథ్యూస్.. క్రీజులోకి వచ్చిన తర్వాత తొలి బంతి ఆడకముందే మార్చుకోవడానికి ప్రయత్నించాడు.
దీంతో అతన్ని టైమ్డ్ ఔట్ గా ప్రకటించాలని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ అంపైర్లను కోరాడు. వాళ్లు ఇదే విషయాన్ని మాథ్యూస్ కు చెప్పడంతో వివాదం మొదలైంది. స్వయంగా మాథ్యూసే అప్పీల్ విరమించుకోవాలని షకీబ్ ను కోరినా అతడు వినలేదు. ఇలాంటి విషయాల్లో క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని క్రికెట్ ప్రపంచమంతా షకీబ్ పై మండిపడింది.
కానీ షకీబ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని అతడు చెప్పడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ లో ఇలా టైమ్డ్ ఔటైన తొలి బ్యాటర్ మాథ్యూసే. ఈ మ్యాచ్ లో శ్రీలంకను 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఓడించింది.