Arjun Tendulkar: ఒకే మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టిన సచిన్ టెండూల్కర్ కొడుకు, ఒంటిచేత్తో టీమ్‌కి విజయం
Sachin Tendulkar son: దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు ముంబయి టీమ్‌లో అవకాశాలు రాకపోవడంతో గోవా టీమ్‌కి వెళ్లిన సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్.. బౌలింగ్‌లో చెలరేగిపోతున్నాడు. కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో ఒంటిచేత్తో గోవాని గెలిపించాడు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో అదరగొట్టేశాడు. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో గోవా టీమ్ తరఫున నిలకడగా రాణిస్తున్న అర్జున్ టెండూల్కర్.. కేఎస్ సీఏ ఇన్విటేషన్‌గా పిలిచే డాక్టర్ (కెప్టెన్ ) కె.తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్‌లో ఒకే మ్యాచ్‌లో 9 వికెట్లతో సత్తాచాటాడు.
ముంబయి జట్టులో అవకాశం రాకపోవడంతో గోవా తరఫున ఆడుతున్న 24 ఏళ్ల అర్జున్ టెండూల్కర్.. కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. దాంతో గోవా టీమ్ ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులిచ్చిన అర్జున్ టెండూల్కర్ 5 వికెట్లు పడగొట్టడంతో కర్ణాటక 36.5 ఓవర్లలోనే 103 పరుగులకి ఆలౌటైంది.
అనంతరం గోవా టీమ్‌లో అభినవ్ తేజ్రానా (109), మంథన్ ఖుత్కర్ (69) సత్తాచాటారు. దాంతో గోవా 413 పరుగుల భారీ స్కోరు చేసింది. దాంతో 310 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన కర్ణాటక టీమ్.. మరోసారి అర్జున్ బౌలింగ్ ధాటికి తట్టుకోలేక విలవిలలాడిపోయింది. అర్జున్ 46 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడంతో కర్ణాటక 30.4 ఓవర్లలో 121 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. దాంతో సెకండ్ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం కూడా గోవాకి లేకపోయింది. ఇన్నింగ్స్ 189 పరుగులతో సునాయాసంగా గెలిచేసింది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అర్జున్ టెండూల్కర్
వాస్తవానికి అర్జున్ టెండూల్కర్ అండర్-19 క్రికెట్‌లో ఎక్కువ భాగం ముంబయి టీమ్‌లో ఉన్నప్పటికీ.. తుది జట్టులో మాత్రం చోటు ఎక్కువగా దక్కలేదు. 42 సార్లు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో అతడ్ని రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేశారు. దాంతో 2022-23 సీజన్‌లో గోవా టీమ్‌లోకి వెళ్లిపోయిన అర్జున్ టెండూల్కర్.. 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 45.19 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కూడా ముంబయి ఇండియన్స్ తరఫున ఐదు మ్యాచ్‌లను అర్జున్ టెండూల్కర్ ఆడాడు. ఐపీఎల్‌లో ఆడిన మొదటి మొదటి తండ్రీ కొడుకుల జంటగా సచిన్, అర్జున్ నిలిచారు. కానీ.. ఐపీఎల్‌లోనూ ముంబయి టీమ్ అర్జున్‌కి ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదు. 2023లో నాలుగు, 2024లో ఒక మ్యాచ్‌లో మాత్రమే తుది జట్టులో చోటిచ్చింది.
అర్జున్‌పై రోహిత్ ప్రశంసలు
"అర్జున్ గత మూడు సంవత్సరాలుగా ముంబయి జట్టులో ఉన్నాడు. వాస్తవానికి ప్లేయింగ్ ఎలెవన్‌లో లేనప్పటికీ అతని ఎదుగుదలను చూశాను’’ అని ముంబయి ఇండియన్స్ టీమ్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
‘‘ఐపీఎల్‌కి ముందు అతను ఏం చేస్తున్నాడో చూశాం. అతను వేగంగా బౌలింగ్ చేస్తున్నాడు. పదునైనా యార్కర్లనీ సంధిస్తున్నాడు. కొత్త బంతితోనూ చక్కగా స్వింగ్ చేస్తూ, యార్కర్లు కూడా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు" అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
సచిన్ టెండూల్కర్ కొడుకు అనగానే అందరూ అర్జున్‌ను తొలుత బ్యాటర్‌గానే చూశారు. కానీ అనూహ్యరీతిలో అతను ఫాస్ట్ బౌలర్‌గా సత్తాచాటుతున్నాడు. అలానే మిడిలార్డర్ బ్యాటర్‌గానూ జట్టుకి ఉపయోగపడుతున్నాడు. 24 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్ ఐపీఎల్‌లో 5 మ్యాచ్‌లాడినా కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. అయితే బౌలింగ్‌లో మాత్రం 3 వికెట్లు పడగొట్టాడు.