Sachin Tendulkar first ODI century: సచిన్ టెండూల్కర్ తొలి వన్డే సెంచరీకి 30 ఏళ్లు.. కెరీర్‌ను మలుపు తిప్పిన మ్యాచ్ అదే
Sachin Tendulkar first ODI century: సచిన్ టెండూల్కర్ తన తొలి వన్డే సెంచరీ సాధించి నేటికి (సెప్టెంబర్ 9) సరిగ్గా 30 ఏళ్లు పూర్తయింది. మొత్తంగా వన్డేల్లో 49 సెంచరీలు చేసిన మాస్టర్ బ్లాస్టర్ తన తొలి సెంచరీ కోసం ఐదేళ్లు వేచి చూశాడన్న సంగతి మీకు తెలుసా?
Sachin Tendulkar first ODI century: సచిన్ టెండూల్కర్ కెరీర్లోనే కాదు క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకమైన రోజు సెప్టెంబర్ 9, 1994. ఎందుకంటే ఆ రోజు సచిన్ కెరీర్ నే కాదు వన్డే క్రికెట్ దశనే మార్చేసింది. మాస్టర్ తన తొలి వన్డే సెంచరీ చేసిన రోజు అది. ఐదేళ్ల నిరీక్షణ ఫలించి తొలిసారి వన్డేల్లో మూడంకెల స్కోరు అందుకున్న సచిన్.. ఆ తర్వాత అలాంటివి మరో 48న తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐదేళ్ల నిరీక్షణ తర్వాత..
సెంచరీలను మంచినీళ్లు తాగినంత సులువుగా కొట్టేస్తాడన్న పేరు సచిన్ టెండూల్కర్ కు ఉంది. కానీ వన్డేల్లో తొలి సెంచరీ మాత్రం అతనికి అంత సులువుగా దక్కలేదు. దీనికోసం అతడు ఏకంగా ఐదేళ్ల పాటు వేచి చూశాడు. 1989లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన మాస్టర్.. ఐదేళ్ల తర్వాత అంటే 1994లోగానీ వన్డేల్లో తొలి సెంచరీ కొట్టలేకపోయాడు.
టెస్ట్ క్రికెట్ లో మాత్రం వచ్చిన మరుసటి ఏడాదే అంటే 1990లో సెంచరీ బాదినా.. వన్డేల్లో అది సాధ్యం కాలేదు. మొత్తానికి 1994లో ఇదే రోజున అంటే సెప్టెంబర్ 9న సింగర్ వరల్డ్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మాస్టర్ తన తొలి సెంచరీ కొట్టాడు. ఆ హండ్రెడ్ ఓ కొత్త చరిత్రకు నాంది పలికింది.
కెరీర్ మలుపు తిప్పిన మ్యాచ్
1989లో సచిన్ వన్డేల్లో అడుగుపెట్టాడు. ఐదేళ్ల పాటు 78 మ్యాచ్ లు ఆడినా ఒక్కసారీ మూడంకెల స్కోరు అందుకోలేదు. 17సార్లు హాఫ్ సెంచరీ దాటినా వాటిని వందగా మలచలేకపోయాడు. అయితే 1994 మార్చిలో న్యూజిలాండ్ పై తొలిసారి ఓపెనింగ్ చేయడం సచిన్ కెరీర్ మలుపు తిప్పింది. ఆ మ్యాచ్ లో సిద్దూ గాయపడటంతో ఓపెనర్ గా వచ్చిన మాస్టర్.. కేవలం 49 బంతుల్లోనే 82 రన్స్ చేశాడు.
ఆ తర్వాత ఆరు నెలలకు అంటే సెప్టెంబర్ 9, 1994న ఆస్ట్రేలియాపై తొలి వన్డే సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్ లో మనోజ్ ప్రభాకర్ తో ఓపెనింగ్ చేసిన సచిన్.. 43 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత కాస్త నెమ్మదించినా మొత్తానికి మూడంకెల స్కోరు అందుకున్నాడు. చివరికి 130 బంతుల్లో 110 రన్స్ చేశాడు. దీంతో ఇండియా 246 పరుగులు చేయగా.. తర్వాత ఆస్ట్రేలియా 215 పరుగులకే కుప్పకూలింది.
వన్డే చరిత్రలో అత్యధిక రన్స్
ఈ మ్యాచ్ తర్వాత సచిన్ ఇక వెనుదిరిగి చూడలేదు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. తన కెరీర్లో వన్డేలలో అతడు మొత్తం 49 సెంచరీలతో 18426 రన్స్ చేశాడు. అతని అత్యధిక సెంచరీల రికార్డును గతేడాది విరాట్ కోహ్లి బ్రేక్ చేసినా.. అత్యధిక పరుగుల రికార్డు మాత్రం ఇప్పట్లో ఎవరూ బ్రేక్ చేసేలా కనిపించడం లేదు.
వన్డేల్లో తాను చేసిన చివరి సెంచరీ అంటే 49వ సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్ లో అతని 100 సెంచరీలు పూర్తయ్యాయి. టెస్టుల్లో అతడు 51 సెంచరీలు చేశాడు. 2012లో బంగ్లాదేశ్ పై తన చివరిదైన 49వ వన్డే సెంచరీ అందుకున్నాడు.