Test Cricket: టెస్ట్ క్రికెట్‌ను కాపాడటానికి ఐసీసీ మెగా ప్లాన్.. ప్లేయర్స్‌కు బంపరాఫర్.. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తోందంటే?-icc planning to save test cricket to spend over 15 million dollars reveals a report ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Test Cricket: టెస్ట్ క్రికెట్‌ను కాపాడటానికి ఐసీసీ మెగా ప్లాన్.. ప్లేయర్స్‌కు బంపరాఫర్.. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తోందంటే?

Test Cricket: టెస్ట్ క్రికెట్‌ను కాపాడటానికి ఐసీసీ మెగా ప్లాన్.. ప్లేయర్స్‌కు బంపరాఫర్.. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తోందంటే?

Hari Prasad S HT Telugu
Aug 23, 2024 12:01 PM IST

Test Cricket: టెస్ట్ క్రికెట్ ను కాపాడటానికి ఐసీసీ భారీ ప్లానే వేస్తోంది. ఈ ఫార్మాట్ పై ప్లేయర్స్ కు ఆసక్తి కలిగించేందుకు మ్యాచ్ ఫీజును కూడా భారీగా పెంచాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రముఖ వార్తాసంస్థ పీటీఐ తన రిపోర్టులో వెల్లడించింది.

టెస్ట్ క్రికెట్‌ను కాపాడటానికి ఐసీసీ మెగా ప్లాన్.. ప్లేయర్స్‌కు బంపరాఫర్.. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తోందంటే?
టెస్ట్ క్రికెట్‌ను కాపాడటానికి ఐసీసీ మెగా ప్లాన్.. ప్లేయర్స్‌కు బంపరాఫర్.. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తోందంటే? (AFP)

Test Cricket: క్రికెట్ అంటే టీ20 ఫార్మాటే అన్నట్లుగా మారిపోతున్న పరిస్థితుల నుంచి సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ ను బతికించుకోవడానికి ఐసీసీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అభిమానులే కాదు.. యువ ప్లేయర్స్ కూడా టెస్ట్ క్రికెట్ ను కాదని కోట్లు కురిపిస్తున్న టీ20 ఫార్మాట్ వైపు చూస్తున్న వేళ ఈ ఐదు రోజుల ఫార్మాట్ ను మళ్లీ గాడిలో పెట్టడానికి 15 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని భావిస్తోంది.

టెస్ట్ క్రికెట్ కోసం ఫండ్

టెస్ట్ క్రికెట్ కోసం ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా మొదట ప్రతిపాదించింది. దీనికి బీసీసీఐ సెక్రటరీ జై షా నుంచి మద్దతు లభించింది. నెక్ట్స్ ఐసీసీ ఛైర్మన్ ఆయనే అని భావిస్తున్న తరుణంలో జై షా ఈ కీలకమైన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అటు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కూడా ఓకే చెప్పినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక వెల్లడించింది.

ఇందులో భాగంగా టెస్ట్ క్రికెట్ కోసం ప్రత్యేకంగా 15 మిలియన్ డాలర్లు (సుమారు రూ.125 కోట్లు) కేటాయించాలని ఐసీసీ నిర్ణయించినట్లు ఆ రిపోర్టు తెలిపింది. ఈ ఫండ్ లోని నిధులతో టెస్ట్ క్రికెట్ ఆడే ప్లేయర్స్ మ్యాచ్ ఫీజులను పెంచడంతోపాటు టీమ్స్ ను విదేశాలకు పంపేందుకు కూడా వీలవుతుంది. ముఖ్యంగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డులాంటి వాటికి ఈ ఫండ్ ఎంతగానో ఉపయోగపడనుంది.

అందరికీ కనీస వేతనం

ఈ ఫండ్ ద్వారా టెస్ట్ క్రికెట్ ఆడే ప్రతి ప్లేయర్ కు కనీస వేతనం ఇవ్వాలని చూస్తోంది. ఈ మ్యాచ్ ఫీజు 10 వేల డాలర్లుగా ఉంచాలని భావిస్తున్నట్లు ఆ రిపోర్టు తెలిపింది. తమ టీమ్స్ ను విదేశాలకు పంపడానికి ఇబ్బంది పడుతున్న బోర్డులకు కూడా ఈ ఫండ్ నుంచే సాయం చేయాలన్నది ఆలోచనగా ఉంది. అయితే ఈ ఫండ్ ద్వారా ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లకు పెద్దగా ఒరిగేదేమీ లేదు.

నిజానికి ఇండియాలో టెస్ట్ క్రికెట్ కు ఆదరణ పెంచడానికి బీసీసీఐ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. ఓ ఏడాదిలో ఇండియా ఆడే టెస్టు మ్యాచ్ లలో కనీసం 75 శాతం మ్యాచ్ లకు అందుబాటులో ఉండే ప్లేయర్స్ కు మ్యాచ్ ఫీజును రూ.15 లక్షలకు బదులుగా రూ.45 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక 50 నుంచి 75 శాతం మ్యాచ్ లకు అందుబాటులో ఉండే వాళ్లకు రూ.30 లక్షలు ఇస్తామని చెప్పింది.

ఒకవేళ జట్టులోకి ఎంపికై ఆడే అవకాశం రాని ప్లేయర్స్ ఉంటే వాళ్లకు ఈ మొత్తంలో సగం ఇస్తారు. నిజానికి ఐసీసీ ప్రతిపాదిస్తున్న మొత్తంతో పోలిస్తే ఇండియాలో ఇప్పటికే చాలా ఎక్కువ మ్యాచ్ ఫీజు ఇస్తున్నారు.