Mohammed Shami: షమి వచ్చేస్తున్నాడు.. గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ సెక్రటరీ జై షా.. అతడు అవసరం అంటూ..-mohammed shami injury update star pacer set to return to team indias australia tour reveals bcci secretary jay shah ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mohammed Shami: షమి వచ్చేస్తున్నాడు.. గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ సెక్రటరీ జై షా.. అతడు అవసరం అంటూ..

Mohammed Shami: షమి వచ్చేస్తున్నాడు.. గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ సెక్రటరీ జై షా.. అతడు అవసరం అంటూ..

Hari Prasad S HT Telugu
Aug 18, 2024 09:57 PM IST

Mohammed Shami: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. అతడు తిరిగి టీమిండియాలోకి రావడంపై బీసీసీఐ సెక్రటరీ జై షా గుడ్ న్యూస్ చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనలో అతని అవసరం ఉందన్నారు.

షమి వచ్చేస్తున్నాడు.. గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ సెక్రటరీ జై షా.. అతడు అవసరం అంటూ..
షమి వచ్చేస్తున్నాడు.. గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ సెక్రటరీ జై షా.. అతడు అవసరం అంటూ..

Mohammed Shami: మహ్మద్ షమి టీమిండియాకు దూరమై దాదాపు పది నెలలు అవుతోంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో గాయపడిన అతడు.. తర్వాత సర్జరీ చేయించుకున్నాడు. ఆ ఫైనల్ తర్వాత మళ్లీ అతడు ఇండియాకు ఆడలేదు. ఐపీఎల్ కు కూడా దూరమయ్యాడు. అయితే మొత్తానికి ఇప్పుడతడు గాయం నుంచి కోలుకొని తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పారు.

షమి వచ్చేస్తున్నాడు

మహ్మద్ షమి గతేడాది వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్. అయితే టాప్ ఫామ్ లో ఉన్న అతడు.. గాయం కారణంగా ఇంతకాలం జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ మధ్యే అతడు తన గాయంపై అప్డేట్ ఇస్తూ.. తాను తిరిగి ఎప్పుడు వస్తానో చెప్పలేనని అనడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే తాజాగా బీసీసీఐ సెక్రటరీ జై షా దీనిపై స్పందించారు.

ఆస్ట్రేలియా పర్యటన సమయానికి అతడు తిరిగి టీమిండియాలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. నిజానికి వచ్చే నెలలో బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ సమయానికి షమి సిద్ధంగా ఉంటాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పుడు జై షా కూడా షమి ఫిట్‌నెస్ పై కీలక ప్రకటన చేశాడు.

ఆస్ట్రేలియా పర్యటకు వచ్చేస్తాడు

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తోంది టీమిండియా. ఆ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ ముఖ్యమైన సిరీస్ కోసం షమి అవసరం ఇండియన్ టీమ్ కు ఎంతైనా ఉందని షా అభిప్రాయపడ్డారు. "మా టీమ్ ఇప్పటికే బాగా సిద్దమైంది. కొంతకాలంగా బుమ్రాకు రెస్ట్ ఇచ్చాం. మహ్మద్ షమి కూడా ఫిట్ గా ఉంటాడని భావిస్తున్నాం. ప్రస్తుతం ఇది ఎంతో అనుభవం ఉన్న ఇండియన్ టీమ్. రోహిత్, కోహ్లిలాంటి సీనియర్లు ఫిట్ గా ఉన్నారు" అని జై షా తెలిపారు.

ఇక షమిపై స్పందిస్తూ.. "షమి గురించి మీ ప్రశ్న సరైనదే.. అతడు ఆ పర్యటనలో ఉంటాడు. ఎందుకంటే అతడు అనుభవజ్ఞుడు. ఆస్ట్రేలియాలో అతని అవసరం మాకు ఉంది" అని షా అన్నారు. అయితే అది జరగాలంటే షమి ముందుగానే డొమెస్టిక్ క్రికెట్ ఆడి తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు స్నేహిశిష్ గంగూలీ కూడా చెప్పారు.

"ఆ పర్యటనలో ఉండాలని అతడు భావిస్తున్నాడు. కానీ అతడు తనను తాను నిరూపించుకోవడానికి రంజీ ట్రోఫీ ఆడాల్సి ఉంటుంది" అని స్నేహశిష్ అన్నారు. ఆస్ట్రేలియా పర్యటన కంటే ముందు సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో, అక్టోబర్లో న్యూజిలాండ్ తో స్వదేశంలో టీమిండియా సిరీస్ లు ఆడనుంది.