India vs Australia: ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ గెలిచేది ఎవరో చెప్పిన పాంటింగ్.. 3-1తో గెలుస్తుందంటూ..
India vs Australia: ఈ ఏడాది చివర్లో జరగబోయే ఇండియా, ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్ లో విజేత ఎవరో చెప్పేశాడు మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్. 33 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ రెండు టీమ్స్ ఓ ఐదు టెస్టుల సిరీస్ లో తలపడబోతున్నాయి.
India vs Australia: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఈ ఏడాది చివర్లో మరో హోరాహోరీ సిరీస్ జరగబోతోంది. గత రెండు పర్యటనల్లోనూ ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియా.. మూడోసారీ అదే రిపీట్ చేయాలని చూస్తోంది. 33 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఈ రెండు టీమ్స్ ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్నాయి. ఈ సిరీస్ ఫలితాన్ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంచనా వేశాడు.
గెలిచేది ఆస్ట్రేలియానే..
2017 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియా దగ్గరే ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సిరీస్ లు గెలిచిన ఏకైక టీమ్ కూడా టీమిండియానే. 2019లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో 2-1తో, 2020-21లోనూ 2-1తో ఆస్ట్రేలియాను వాళ్ల గడ్డపై ఓడించింది. అయితే ఈసారి మాత్రం ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకుంటుందని ఆ టీమ్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంటున్నాడు.
ప్రస్తుతం 43 రోజుల బ్రేక్ ఎంజాయ్ చేస్తున్న ఇండియన్ టీమ్ ప్లేయర్స్.. తర్వాత మరోసారి ఐదు నెలల పాటు నాన్ స్టాప్ క్రికెట్ ఆడనున్నారు. అందులో ఆస్ట్రేలియా టూర్ కూడా ఒకటి. ఈ సిరీస్ పై ఐసీసీ రివ్యూ షోలో పాంటింగ్ స్పందించాడు.
"ఇది చాలా హోరాహోరీగా సాగబోయే సిరీస్. గత రెండు పర్యటనల్లోనూ ఇండియా సిరీస్ గెలవడంతో ఈసారి ఆస్ట్రేలియాను తమను తాము నిరూపించుకోవాల్సిన స్థితిలో ఉంది. ఈసారి మళ్లీ ఐదు టెస్టుల సిరీస్ జరగబోతోంది. ఇది కూడా ముఖ్యమైన అంశమే. గతంలో రెండుసార్లూ నాలుగు టెస్టుల సిరీసే జరిగింది. ఐదు టెస్టులపై అందరూ ఉత్సాహంగా ఉన్నారు. పెద్దగా డ్రా అయ్యే టెస్టులు ఉండకపోవచ్చు" అని పాంటింగ్ అన్నాడు.
ఇక ఈ సిరీస్ ఆస్ట్రేలియా సొంతమవుతుందని కూడా అతడు స్పష్టం చేశాడు. "కచ్చితంగా ఆస్ట్రేలియానే గెలుస్తుందని అనుకుంటున్నాను. నేనెప్పుడూ ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా మాట్లాడను. ఏదో ఒకటి డ్రా కావచ్చు. వాతావరణం బాగుండకపోవచ్చు. అందువల్ల 3-1తో ఆస్ట్రేలియా గెలుస్తుందని అనుకుంటున్నాను" అని పాంటింగ్ స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియాలో ఇండియా టూర్ ఇలా
ఆస్ట్రేలియాలో ఇండియా పర్యటన నవంబర్ 22న మొదలవుతుంది. ఆ రోజు పెర్త్ లోని ఆప్టస్ స్టేడియం తొలి టెస్టుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత రెండో టెస్టు అడిలైడ్ లో ఉంటుంది. ఇది డేనైట్ కావడం విశేషం. నాలుగేళ్లే కిందట ఇక్కడే డేనైట్ టెస్ట్ ఆడిన ఇండియా కేవలం 36 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. ఇక మూడో టెస్టు బ్రిస్బేన్ లో గబ్బాలో, నాలుగోదైన బాక్సింగ్ డే టెస్ట్ ఎంసీజీలో, ఐదోదైన న్యూ ఇయర్ టెస్ట్ సిడ్నీలో జరుగుతాయి.
సిరీస్ ప్రారంభానికి ముందు ఇండియా అక్కడి ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ తో ఓ డేనైట్ వామప్ మ్యాచ్ కూడా ఆడుతుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు దక్కించుకోవడానికి ఇండియా ఈ సిరీస్ గెలవడం తప్పనిసరి. దీంతో ఆసీస్ గడ్డపై హ్యాట్రిక్ సిరీస్ విజయం ఇండియాకు అవసరం కూడా.