RR vs GT: రాజస్థాన్ జైత్రయాత్రకు బ్రేక్.. గుజరాత్ అద్భుత విజయం.. చివరి బంతికి గెలుపు-rr vs gt highlights ipl 2024 gujarat titans won against rajasthan royals shubman gill rashid khan rahul tewatia shines ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rr Vs Gt: రాజస్థాన్ జైత్రయాత్రకు బ్రేక్.. గుజరాత్ అద్భుత విజయం.. చివరి బంతికి గెలుపు

RR vs GT: రాజస్థాన్ జైత్రయాత్రకు బ్రేక్.. గుజరాత్ అద్భుత విజయం.. చివరి బంతికి గెలుపు

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 11, 2024 12:00 AM IST

RR vs GT IPL 2024: రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో అదరగొట్టి గెలిచింది. ఓడిపోతుందనుకున్న దశ నుంచి అద్భుతంగా గట్టెక్కింది జీటీ.

RR vs GT: రాజస్థాన్ జైత్రయాత్రకు బ్రేక్.. గుజరాత్ అద్భుత విజయం.. చివరి బంతికి గెలుపు
RR vs GT: రాజస్థాన్ జైత్రయాత్రకు బ్రేక్.. గుజరాత్ అద్భుత విజయం.. చివరి బంతికి గెలుపు (AP)

IPL 2024 RR vs GT: ఐపీఎల్ 2024 సీజన్‍లో వరుసగా నాలుగు విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ జోరుకు గుజరాత్ టైటాన్స్ బ్రేకులు వేసింది. జైపూర్ వేదికగా బుధవారం (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‍లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి 5 ఓవర్లలో 73 పరుగులు చేయాల్సి ఉన్న దశలోనూ అదరగొట్టి గెలిచింది గుజరాత్. చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్‍పై శుభ్‍మన్ గిల్ సేన పైచేయి సాధించింది.

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 పరుగులు నాటౌట్), రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76 పరుగులు) మెరుపు అర్ధ శతకాలు చేశారు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ చెరో వికెట్ తీశారు.

లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్‍మన్ గిల్ (44 బంతుల్లో 72 పరుగులు; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత అర్ధ శతకంతో సత్తాచాటాడు. చివర్లో రాహుల్ తేవాతియా (11 బంతుల్లో 22 పరుగులు; 3 ఫోర్లు), రషీద్ ఖాన్ (11 బంతుల్లో 24 పరుగులు నాటౌట్; 4 ఫోర్లు) ధనాధన్ బ్యాటింగ్ ఆడి గుజరాత్‍ను గెలిపించారు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా ఫోర్ కొట్టాడు రషీద్. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్ మూడు వికెట్లు, సీనియర్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ రెండు, ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‍కు వర్షం కూడా ఆటంకాలు కలిగించింది.

గిల్ పోరాటం.. చివర్లో తెవాతియా, రషీద్ మెరుపులు

లక్ష్యఛేదనలో గుజరాత్ కెప్టెన్ శుభ్‍మన్ గిల్ ఆరంభం నుంచే మెరిపించగా.. ఓపెనర్ సాయి సుదర్శన్ (35) వేగంగా ఆడలేకపోయాడు. రాజస్థాన్ పేసర్ కుల్దీప్ సేన్… సాయిసుదర్శన్, మాథ్యు వేడ్ (4), అభినవ్ మనోహర్ (1)ను వెనువెంటనే ఔట్ చేశాడు. దీంతో 79 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి గుజరాత్ కష్టాల్లో పడింది. మరోవైపు కెప్టెన్ శుభ్‍మన్ గిల్ మాత్రం పోరాడుతూనే వచ్చాడు. 35 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. ఇక, గెలువాలంటే చివరి ఐదు ఓవర్లలో గుజరాత్ 73 పరుగులు చేయాల్సి ఉంది. అర్ధశతకంతో గుజరాత్ కెప్టెన్ శుభ్‍మన్ గిల్ జోరు మీద ఉన్నా.. గెలుపు ఆశలు తక్కువగానే ఉన్నాయి. 16వ ఓవర్లో రెండు ఫోర్లు బాది గిల్ కూడా ఔటవటంతో విజయం కష్టమే అనే పరిస్థితి వచ్చేసింది. అయితే, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్ (14) దూకుడుగా ఆడటంతో రవిచంద్రన్ అశ్విన్ వేసిన 17వ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్లో షారుఖ్ ఔట్ కాగా.. 7 పరుగులే వచ్చాయి. దీంతో చివరి రెండు ఓవర్లో గుజరాత్ 35 పరుగులు చేయాల్సి వచ్చింది.

ఆ సమయంలో రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ ఫోర్లతో అదరగొట్టారు. రాజస్థాన్ పేసర్ కుల్దీప్ సేన్ వేసిన 19వ ఓవర్లో 20 రన్స్ వచ్చేశాయి. చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆవేశ్ వేసిన తొలి బంతికి ఫోర్ బాదిన రషీద్.. రెండో బంతికి రెండు పరుగులు తీశాడు. మూడో బంతికి కూడా ఫోర్ కొట్టాడు. ఈ తర్వాత ఓ పరుగు రాగా.. ఐదో బంతికి రెండు పరుగుల తర్వాత తెవాతియా రనౌట్ అయ్యాడు. చివరి బంతికి విజయానికి 2 పరుగులు అవసరం కాగా.. ఫోర్ కొట్టి గుజరాత్‍ను గెలిపించాడు రషీద్ ఖాన్. ఇలా చివరి బంతికి విజయం సాధించింది గుజరాత్.

అదరగొట్టిన సంజూ, రియాన్

అంతుకు ముందు తొలుత బ్యాటింగ్‍లో రాజస్థాన్ ఓపెనర్లు జోస్ బట్లర్ (8), యశస్వి జైస్వాల్ (24) నెమ్మదిగా ఆడి ఔటయ్యారు. దీంతో 5.4 ఓవర్లలో 2 వికెట్లకు 42 రన్స్ మాత్రమే చేయగలిగింది రాజస్థాన్. అయితే, ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్ అదరగొట్టారు. గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. తొలుత కాస్త నిలకడగా ఆడినా.. ఆ తర్వాత గేర్ మార్చి హిట్టింగ్ చేశారు. దీంతో 12.4 ఓవర్లలో రాజస్థాన్ స్కోరు 100 దాటింది. ఆ తర్వాత కూడా పరాగ్, శాంసన్ జోరు కొనసాగించారు.

34 బంతుల్లోనే రియాన్ పరాగ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడు కంటిన్యూ చేశాడు. సంజూ శాంసన్ కూడా 31 బంతుల్లోనే అర్ధ శతకం చేరాడు. 76 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు బాది 76 పరుగులు చేసిన రియాన్ 19వ ఓవర్లో ఔటయ్యాడు. సంజూ చివరి వరకు నిలిచాడు. 7 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. సంజూ - రియాన్ మూడో వికెట్‍కు 78 బంతుల్లోనే 130 పరుగుల భాగస్వామ్యం జోడించారు. రాజస్థాన్‍కు మంచి స్కోరు అందించారు. సంజూ శాంసన్‍కు ఈ సీజన్‍లో ఇది మూడో హఫ్ సెంచరీగా ఉంది.

ఈ సీజన్‍లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‍ల్లో నాలుగు గెలుపులతో రాజస్థాన్ రాయల్స్ 8 పాయింట్లతో ఉంది. దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‍లో ఉంది. ఆరు మ్యాచ్‍ల్లో మూడు గెలిచిన గుజరాత్ ఆరో స్థానానికి చేరింది.

IPL_Entry_Point