RCB vs SRH: ఆ ఇద్దరిపై వేటు వేసిన బెంగళూరు.. ఫెర్గ్యూసన్‍కు చోటు.. సేమ్ టీమ్‍తో హైదరాబాద్
RCB vs SRH IPL 2024: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సన్‍రైజర్స్ హైదరాబాద్ పోరు షురూ అయింది. వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్న ఆర్సీబీ పుంజుకోవాలనే కసితో ఉంది. తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచింది బెంగళూరు.
RCB vs SRH IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో వరుస పరాజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరిలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీకొడుతోంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్‍ల్లో 3 గెలిచి జోష్ మీద ఉన్న ఎస్‍ఆర్‌హెచ్ జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉంటే.. ఆరింట ఐదు ఓడిన బెంగళూరు మళ్లీ గెలుపు రుచిచూడాలని తహతహలాడుతోంది. ఈ రెండు జట్ల మధ్య నేడు (మార్చి 15) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
మ్యాక్స్‌వెల్, సిరాజ్ ఔట్
హైదరాబాద్‍తో ఈ మ్యాచ్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు భారీ మార్పులను చేసింది. ఈ సీజన్‍లో రాణించలేకపోతున్న స్టార్ ప్లేయర్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్‍పై వేటు వేసింది. ఈ మ్యాచ్ తుది జట్టు నుంచి ఆ ఇద్దరినీ తప్పించింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఈ రెండు భారీ ఛేంజెస్ చేసింది బెంగళూరు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుది జట్టులోకి న్యూజిలాండ్ పేసర్ లూకీ ఫెర్గ్యుసన్ వచ్చేశాడు. ఇప్పటి వరకు పలు ఫ్రాంచైజీలకు ఆడిన అతడికి.. ఆర్సీబీ తరఫున ఇదే ఫస్ట్ మ్యాచ్. సౌరవ్ చౌహాన్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిన అతడు.. తుది టీంలోకి అడుగుపెట్టాడు.
గత మ్యాచ్‍తో పోలిస్తే తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు సన్‍రైజర్స్ హైదరాబాద్. వరుసగా రెండు వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఎస్‍ఆర్‌హెచ్ సేమ్ టీమ్‍ను కొనసాగించింది.
ఈ సీజన్‍లో తమ జట్టు అత్యుత్తమ ఆట ఆడలేదని ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ సమయంలో అన్నాడు. తమలో చాలా మంది ఆటగాళ్లు పూర్తిస్థాయి సామర్థ్యం ఇంకా ప్రదర్శించలేదని చెప్పాడు. అందుకే తాము మార్పులు చేయాల్సి వచ్చిందని, మ్యాక్స్‌వెల్, సిరాజ్ ఈ మ్యాచ్‍కు పక్కన కూర్చుంటారని ఫాఫ్ చెప్పాడు.
గత మ్యాచ్ జట్టునే కొనసాగిస్తున్నామని హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఈ సీజన్‍లో కొన్ని మంచి విజయాలు సాధించామని చెప్పాడు.
సన్‍రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రమ్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమాద్, షెహబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, లూకీ ఫెర్గ్యూసన్, యశ్ దయాళ్
హైదరాబాద్ సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: ఉమ్రాన్ మాలిక్, అన్మోల్ ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, సౌరవ్ చౌహాన్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, విజయ్‍కుమార్ వైశాఖ్, రీస్ టోప్లీ, జయదేవ్ ఉనాద్కత్, నటరాజన్
బెంగళూరు సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: సుయాశ్ ప్రభుదేశాయ్, అనూజ్ రావత్, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్