RCB Unbox Event: మహిళా జట్టుకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన ఆర్సీబీ పురుషుల టీమ్: వీడియో.. కొత్త లుక్‍లో కోహ్లీ-rcb unbox event virat kohli and co gives guard of honor to royal challengers bangalore women team after wpl 2024 win ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb Unbox Event: మహిళా జట్టుకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన ఆర్సీబీ పురుషుల టీమ్: వీడియో.. కొత్త లుక్‍లో కోహ్లీ

RCB Unbox Event: మహిళా జట్టుకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన ఆర్సీబీ పురుషుల టీమ్: వీడియో.. కొత్త లుక్‍లో కోహ్లీ

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 19, 2024 08:07 PM IST

IPL 2024 - RCB Unbox Event: ఐపీఎల్ 2024 సీజన్‍కు ముందు ఆర్సీబీ అన్‍బాక్స్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‍లో మహిళల జట్టును గార్డ్ ఆఫ్ హానర్‌తో పురుషుల టీమ్ గౌరవించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

RCB Unbox Event: మహిళా జట్టుకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన ఆర్సీబీ పురుషుల టీమ్: వీడియో.. కొత్త లుక్‍లో కోహ్లీ
RCB Unbox Event: మహిళా జట్టుకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన ఆర్సీబీ పురుషుల టీమ్: వీడియో.. కొత్త లుక్‍లో కోహ్లీ

RCB Unbox Event: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‍కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫుల్ జోష్‍తో సిద్ధమవుతోంది. మరో మూడు రోజుల్లో మార్చి 22న ఈ సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 22న తొలి మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆర్సీబీ తలపడనుంది. ఐపీఎల్ 17వ సీజన్‍కు ముందు నేడు (మార్చి 19) అన్‍బాక్స్ ఈవెంట్‍ను ఆర్సీబీ ఫ్రాంచైజీ నిర్వహించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గ్రాండ్‍గా ఈ ఈవెంట్ జరిగింది.

టైటిల్ మహిళా జట్టుకు గౌరవం

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు ఈవారంలోనే డబ్ల్యూపీఎల్ 2024 టైటిల్ దక్కించుకుంది. 16 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఈ ఫ్రాంచైజీకి ఓ టైటిల్ కైవసం అయింది. ఐపీఎల్‍లో 16 సీజన్లలో పురుషుల జట్టుకు నిరాశే ఎదురవగా.. డబ్ల్యూపీఎల్ రెండో ఎడిషన్‍లోనే టైటిల్ దక్కించుకుంది వుమెన్స్ టీమ్. దీంతో అన్‍బాక్స్ ఈవెంట్‍కు హాజరైన స్మృతి మంధాన సారథ్యంలోని మహిళల టీమ్‍ను పురుషుల జట్టు గౌరవించింది. వారికి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చింది.

డబ్ల్యూపీఎల్ టైటిల్ చేతపట్టుకొని చిన్నస్వామి స్టేడియంలోకి స్మృతి మంధాన నడుచుకుంటూ రాగా.. వెనకనే మిగిలిన మహిళా ప్లేయర్లు వచ్చారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్‍తో పాటు పురుష టీమ్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్ ఎదురెదురుగా నిలబడి చప్పట్లతో వారిని ఆహ్వానించారు. వారి అభినందనల మధ్య నడుచుకుంటూ మైదానంలోకి మహిళా ప్లేయర్లు వచ్చారు. స్మృతి మంధాన సేనకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోహ్లీ అండ్ కో చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

దద్దరిల్లిన స్టేడియం

ఆర్సీబీ.. ఆర్సీబీ అనే అరుపులతో చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. అన్‍బాక్స్ ఈవెంట్‍కు హాజరైన వేలాది మంది ప్రేక్షకులు ఒక్కసారిగా ఆర్సీబీ నినాదాలతో హోరెత్తించారు. ఓ దశలో స్టేడియంలో లైట్లన్నీ ఆఫ్ చేయగా.. ప్రేక్షకులందరూ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్ లైట్లను ఆన్ చేసిన దృశ్యం ఆకట్టుకుంది.

కోహ్లీ కొత్త లుక్

ఐపీఎల్ 2024 సీజన్ కోసం లుక్ మార్చాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. నయా హెయిర్ స్టైల్‍లో మరింత హ్యాండ్‍సమ్‍గా కనిపించాడు. స్టైలిష్ లుక్‍తో అదరగొట్టాడు. కోహ్లీ కొత్త లుక్‍కు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఫిబ్రవరిలోనే విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రి అయ్యాడు. కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు రెండో సంతానంగా మగపిల్లాడు జన్మించారు. అతడికి అకాయ్ అని పేరు పెట్టారు ఈ స్టార్ దంపతులు. అయితే, ఈ కారణంగా ఇంగ్లండ్‍తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‍కు కోహ్లీ దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్ 2024 సీజన్‍కు కోహ్లీ వస్తాడా లేదా అనే టెన్షన్ నెలకొంది. అయితే, ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చాడు కింగ్. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

ఐపీఎల్‍లో 16 సీజన్లుగా ఆర్సీబీకి నిరాశే ఎదురవుతోంది. ఈ 17వ సీజన్‍‍లో అయినా ఛాంపియన్‍గా నిలిచి టైటిల్ సాధించాలనే కసితో ఉంది. ఫాప్ డ్లుపెసిస్ సారథ్యంలో ఈసారి కూడా బెంగళూరు జట్టు చాలా బలంగా ఉంది. ఎప్పటిలాగానే ఈసారి కూడా ‘ఈ సలా కప్ నమ్డే’ అంటూ ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు.